ఇంటింటికీ అంతర్జాలం అందించే అంశంలో ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచింది

Sunday, 17 May 2015 19:30

ఇంటింటికీ అంతర్జాలం అందించే అంశంలో ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచిందని. విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని రాష్ట్రమంతటా ఇందుకు సంబంధించిన నమూనా పటాన్ని వారం రోజుల్లోనేే రూపొందించడంతోపాటు మూడు నెలల్లో 10 వేల కిలోమీటర్ల ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ)ని ఆంధ్రప్రదేశ్‌ వేయగలిగిందని కేంద్రం అభినందించింది. విద్యుత్‌ స్తంభాలను ఉపయోగించుకుని రాష్ట్రాలు జీఐఎస్‌ పటాన్ని తయారు చేసుకునే విషయమై ఈ నెల 23న రాష్ట్రాల ఐటీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్ర కమ్యునికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కార్యదర్శి జేఎస్‌ దీపక్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. ‘‘ ఉపరితలంలో ఓఎఫ్‌సీ కేబుల్‌ వేసే విషయంలో రాష్ట్రాలు, విద్యుత్‌ పంపిణీ సంస్థలది కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకోవడం ద్వారా వినూత్న పద్ధతిని అనుసరించింది. విద్యుత్‌శాఖను, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ వనరులను ఇందుకు ఆ రాష్ట్రం ఉపయోగించుకొంది. వారం రోజుల్లోనే ఇదంతా చేయగలిగారు. ఇది అయితే ఓఎఫ్‌సీ కేబుల్‌ ఎంత దూరం వేయాల్సి ఉంటుందనే విషయమై ఒక అవగాహనకు రావడానికి వీలవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్‌లో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ఇది ఉపకరిస్తుంది’’ అని కేంద్ర కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు.