ఖరీఫ్‌ నుంచి రూపాయికే కిలో పచ్చిగ్రాసం కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వ శ్రీకారం

Saturday, 16 May 2015 19:30

వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతుంటే పశుగ్రాసం సాగు క్రమేణా తగ్గిపోతోంది. కొన్ని గ్రామాల్లో దాదాపుగా ఉండటం లేదు. రెండంకెల వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరింత అధిక వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం పశుగ్రాసాన్ని అతి తక్కువ ధరకి అందించాలని భావిస్తోంది. ప్రస్తుత వేసవిలో సైలేజ్‌ గడ్డిని సరఫరా చేసిన ప్రభుత్వం... వచ్చే ఏడాది నుంచి అవకాశమున్న ప్రతి గ్రామంలోనూ పచ్చిమేతను సరఫరా చేయాలని నిర్ణయించింది. గ్రామంలో ఎవరైనా ఆసక్తి చూపిన వారికి పశుగ్రాసాన్ని పెంచే బాధ్యత అప్పగిస్తారు. గ్రామానికి 50 ఎకరాల వరకు గ్రాసాన్ని సాగు చేసేందుకు అవకాశమిస్తారు. కౌలును ప్రభుత్వం చెల్లిస్తుంది. సాగుకయ్యే వ్యయాన్ని ఎకరానికి రూ.ఎనిమిది వేలు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి సర్దుబాటు చేస్తారు. 
ఇలా పండించే పచ్చి మేతను పశువులు పెంచే వారికి కేజీకి రూపాయి చొప్పున సరఫరా చేస్తారు. ఎకరానికి పది వేల రూపాయల ఆదాయం సమకూరుతుంది. సొంత పెట్టుబడి లేకుండా వచ్చే ఆదాయం కనుక దీని సాగుకి ప్రతి గ్రామంలోనూ కనీసం అయిదారుగురైనా ముందుకొస్తారని అంచనా వేస్తున్నారు.