అసంఘటితరంగ కార్మికులకు చంద్రన్న బీమా 1.50 కోట్ల మందికి ఆగష్టు 15 నుంచి వర్తింపు

Saturday, 02 May 2015 05:30

మేడే సందర్భంగా 1.50 కోట్ల మంది అసంఘటితరంగ కార్మిక కుటుంబాల సంక్షేమానికి భరోసా ఇస్తూ 'చంద్రన్న ప్రమాదబీమా' పథకాన్ని ప్రకటించారు చంద్రబాబు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సమావేశమందిరంలో మేడేను పురస్కరించుకుని కార్మిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్మిక దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు.... అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న ప్రమాద బీమా పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి కార్మికుల నమోదు ప్రక్రియ ఈ నెల నుంచే చేపడతామని, ఆ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తామని అన్నారు. రాష్ట్ర జనాభాలో మూడొంతుల మంది జనాభా ఈ పథకం పరిధిలోకి వస్తారని వివరించారు. దీని కింద రూ.5 లక్షల ప్రమాద మరణ బీమా అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై వేదిక మీదే సంతకం చేసిన చంద్రబాబు... ప్రతి కార్మికుడికి వారు పనిచేసే పారిశ్రామిక ప్రాంతానికి దగ్గరలోనే సొంతిల్లు కట్టిస్తామన్నారు. ఈ విషయంలో సహకరించేందుకు యాజమాన్యాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగం కార్మికులకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్లు కట్టిస్తామన్నారు. 
చంద్రన్న ప్రమాద బీమా పథకంలోనే రవాణా డ్రైవర్ల ప్రమాదబీమా పథకాన్ని కూడా కలిపినట్లు చెప్పారు. ప్రమాదంలో ఎవరైనా కార్మికుడు మరణిస్తే బీమా మొత్తాన్ని మొదటి ప్రాధాన్యం కింద అతని భార్యకు అందజేస్తామన్నారు. 2016 సంవత్సరానికి గాను.. 42 మందికి శ్రమశక్తి పురస్కారాలు, 30 మందికి ఉత్తమ యాజమాన్య పురస్కారాలు అందించారు.