పోలవరంపై ఫలిస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు వంద శాతం ఖర్చును కేంద్రమే భరించాలన్న కేంద్ర మంత్రి

Thursday, 07 May 2015 05:45

పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన, చేయాల్సిన నిధుల విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి పదే పదే చేస్తున్న విజ్ఞప్తులు, స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి రాష్ట్రానికి కేంద్ర సహకారం గురించి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి కేంద్రంలో కదలికను తీసుకొచ్చాయి. పోలవరం ప్రాజెక్టుపై చేసే ఖర్చు మొత్తాన్నీ (100 శాతం) కేంద్రమే భరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర జల వనరులశాఖ మంత్రి ఉమాభారతి లేఖ రాశారు. అంతేకాదు 2016 ఏప్రిల్‌ 29న రాసిన ఈ లేఖ ప్రతిని ఆమె ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కూడా పంపారు. పోలవరం ప్రాజెక్టుకు 70:30 నిష్పత్తిలో నిధులు విడుదల చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం మెమోలో పేర్కొన్న విషయాన్ని ఉమా భారతి లేఖలో ప్రస్తావించారు. 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, 2014 ఏప్రిల్‌ 1 తర్వాత ప్రాజెక్టు కోసం ఖర్చు చేసే 100 శాతం నిధులు కేంద్రమే చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇందులో ఏ మార్పు చేసినా అది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం - 2014కు వ్యతిరేకంగా చేసినట్లేనని ప్రధానికి వివరించారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు ఇవ్వాలని ప్రధానిని ఆమె కోరారు.