- డోన్ నియోజకవర్గంలో బుగ్గన బంధువులే రాబంధులు
- ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ లలో దేనినీ వదలకుండా దోపిడీ!
- పెన్నా, తుంగభద్ర నదుల నుంచి పెద్దఎత్తున ఇసుక తరలింపు
- అక్రమ సంపాదనకోసం కొండలను పిండిచేసిన బంధుగణం
- అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వందల ఎకరాల భూములు
- అదేమని ప్రశ్నించే గళాలపై తప్పుడు కేసులతో ఉక్కుపాదం
- రామంలా కన్పించే రాజేంద్రనాథ్ రెడ్డి నిజస్వరూపమే వేరు
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – కర్నూలు) : ఎంతో సౌమ్యంగా, చీమకు కూడా హాని తలపెట్ట ని మృధుస్వభావిగా కన్పించే ఆయనను చూస్తే ఆహా ఎంత మంచి మనిషి.. ప్రతిపక్షాలకు పనేంలేదు. పాపం అంత మంచోడ్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాయని లోపల మనిషి గురించి తెలియని జనం పొరబడుతుంటారు. కానీ.. ఆయన వాస్తవ రూపం వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే అపరిచితుడు సినిమా కథానాయకుడిలో ఉన్న లక్షణాలన్నీ ఇంచుమించుగా ఆయనలో కన్పిస్తాయి. పైకి ఎంతో సున్నితంగా రామం క్యారెక్టర్‌ను తలపించే రీతిలో ఉండే ఆ నేత లోపల మనిషి మాత్రం అపరిచితుడే.
నియోజకవర్గంలో తన వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్షనేతలు, ప్రజలకు పైకి కన్పించకుండా చుక్క లు చూపించే ఆ రాజకీయ రామం పేరు రాష్ట్ర ఆర్థిక మంత్రి, డోన్ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బుగ్గన గారి నిజస్వరూపాన్ని, ఆయనలో దాగి ఉన్న లోపల మనిషిని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేసే అరాచకాలను మీ ముందుకు తెస్తోంది చైతన్యరథం.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అక్రమాలు
సత్యహరిశ్చంద్రుడికి తలదన్నె రీతిలో మీడియా ముందు నటిస్తూ బుగ్గన చెప్పే మాటలకు, నియోజకవర్గంలో ఆయన చేసే పనులకు పొంతనే ఉండదు. అందుకే ప్రతిపక్షాలు పిట్టకథల మంత్రిగా నామకరణం చేశాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రకృతి వనరులను యథేచ్చగా కొల్లగొడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన 42నెలల్లో వందల కోట్లు ఆస్తులు కూడబెట్టారు మంత్రి బుగ్గన. తాను చేసే అరాచకాలు ఏమాత్రం బయట ప్రపంచానికి తెలియ కుండా ఉండేలా చూసుకుంటూ తనదైన స్టయిల్ లో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
యథేచ్చగా ఇసుక దోపిడీ
నియోజకవర్గ పరిధిలోని పెన్నా, తుంగభద్ర నదుల్లో నిబంధనలకు విరుద్ధంగా రేయింబవళ్లు అక్రమ మైనింగ్ చేస్తూ ఇసుకను పెద్దఎత్తున కర్నాటకకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కర్నాటకలో లారీ ఇసుక లక్షన్నర వరకు పలుకుతుం డగా, ప్రతిరోజూ ఇక్కడనుంచి వందలారీలకు పైగా ఇసుక పొరుగు రాష్ట్రానికి తరలిపోతోంది. ఈ వ్యవహారం మొత్తాన్ని బుగ్గన మేనల్లుడు గజేంద్రరెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతోంది. కమలాపురం, దొరపల్లి, కొచ్చర్ల గ్రామాల సమీపంలో దొరికే ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించే బాధ్యత ఎర్రగుంట్ల రమేష్‌రెడ్డికి అప్పగించారు. ఈ ఇసుక దందాతో నెలకు రూ.5 కోట్ల రూపాయలకు పైగా అపరిచితుడి ఖజానాకు చేరుతోంది.
కొండలను కూడా మింగేశారు
ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డ కొండలను కూడా బుగ్గన గారి బంధువుల దెబ్బకు మాయమయ్యాయి. భారీ ఎత్తున అక్రమ మైనింగ్ చేయడంద్వారా కొండలను నామరూపాల్లేకుండా చేశారు. ప్యాపిలి మండలంలో కస్తూరిబా పాఠశాల పక్కన బుగ్గన గ్యాంగ్ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కి పాల్పడ్డారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ రేయింబవళ్లు ట్రాక్టర్ల తో, లారీలతో గ్రావెల్ తరలించారు. డోన్ మార్కెట్ యార్డ్ ఛ్కెర్మన్ రామచంద్రుడుకు అక్రమ గ్రావెల్ తవ్వకాల ద్వారా వచ్చే డబ్బును లెక్కతప్పకుండా అప్ప గించే బాధ్యతను అప్పగించారు. డోన్ రూరల్ మండ లంలోని ఉంగరానిగుండ్ల పంచాయతీలో లక్ష్మంపల్లె కొండను పూర్తిగా మాయం చేశారు.
కోవిద్ మహమ్మారిని వదల్లేదు
కోవిడ్ సమయంలో రోగులకు పరీక్షలు నిర్వహించడానికి ఇచ్చే కిట్లను కూడా మంత్రి సోదరుడు హరనాథ్‌రెడ్డి ఎండీగా ఉన్న కంపెనీకి అప్పగించారు. దీనిద్వారా రూ.70 కోట్లు చేతులు మారాయని సమాచారం. కిట్లు సరఫరాలో కూడా తప్పుడు లెక్కలు చూపించి అక్రమాలకు పాల్పడ్డా రు. దీనిపై ఎటువంటి విచారణ జరగకుండా పిట్ట కథలు చెప్పి నిందితులను కాపాడారు. బదిలీలు, మైన్స్, సెటిల్‌మెంట్లు నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రతాపరెడ్డి అనే ఎంపీడీవోను స్థానిక పీఏగా పెట్టుకుని ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగిం చారు. పైకి ఎంతో సౌమ్యంగా కన్పించే బుగ్గన పేరుచెబితే నియోజకవర్గంలో ప్రతిపక్షనాయకులు, స్థానిక ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతుం టారు. ఈయన అవినీతిపై ప్రశ్నించినా, కనీసం ప్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చినా మరుసటి రోజు సం బంధిత నేతపై పోలీసులు ఏదోఒక కేసు బనా యించి తీసుకెళ్లిపోతుంటారు. కోర్టులో ప్రవేశపెట్టే వరకు బాధితుడు ఏంనేరం చేశారో కూడా పోలీసు లు చెప్పరు. పోలీసులు మాట్లాడేమాటలు, వారు తీరు చూశాకే తమ అరెస్టు వెనుక పెద్ద తల ఉందని తెలుస్తుంది. వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి డోన్ నియోజకవర్గంలో ప్రతిపక్షనేతల పై మోపిన కేసులు చూస్తే బుగ్గనగారి నిజ స్వరూపం తెలుస్తుంది. ఇటువంటి అపరిచితులను ప్రజాకోర్టులో నిలబెట్టడమే చైతన్యరథం వంతు. ప్రజాస్వామ్యయుతంగా ఆయనకు ఏవిధంగా బుద్ది చెబుతారన్నది ప్రజాభీష్టం.
బంధువులే ఏజంట్లు
ఎవరినో బినామీలుగా పెట్టుకుంటే వాటాల్లో తేడాలొస్తే ఇబ్బంది అని బంధువులనే ఏజంట్లుగా పెట్టుకున్నారు. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్ తరలించి తద్వారా వసూళ్ల బాధ్యతను మేనల్లుడు గజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. పెన్నానది, తుంగభద్ర నదుల నుంచి ఇసుక తరలించే బాధ్యతను సోదరుడు ఎర్రగుంట్ల రమేష్ రెడ్డికి, ప్రభుత్వ పనులుచేసే కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల వసూలు చేసే బాధ్యతను మరో సోదరుడు బుగ్గన హరనాథ్ రెడ్డికి అప్పగించారు. అదేవిధంగా నియోజక వర్గంలో అక్రమ లేఅవుట్లు, కబ్జాల బాధ్యతను తమ్ముడు చిట్టిరెడ్డికి, భూదందాలు సెటిల్మెంట్ల బాధ్యతను జడ్ పిటిసి సభ్యుడు శ్రీరామ్ రెడ్డికి అప్పగించారు. బార్లు, బెల్ట్ షాపుల నుంచి వసూళ్ల బాధ్యతను దూరపు బంధువు రాజశేఖర్ రెడ్డికి, డోన్ పట్టణంలో పేకాటక్లబ్బులు, మట్కాల నిర్వహణ బాధ్యతను కొండపేట దినేష్ గౌడ్, పోస్టల్ ప్రసాద్‌కు అప్పగించారు.
బుగ్గనగారి భూదాహం
అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారమే 162 ఎకరాలు బుగ్గన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న నివాస స్థలాలు, భవంతులు అదనం. కర్ణాటక, తమిళనాడులో 100 ఎకరాలకు పైగా భూములు బినామీల పేర్లతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అనధికారికంగా బుగ్గన కుటుంబ సభ్యుల ఆధీనంలో ఒక్క డోన్ నియోజకవర్గంలోనే 700 ఎకరాలు పంట భూములున్నాయి. అనంతపురం జిల్లాలో బినామీ పేర్లతో మరో 300 ఎకరాల భూములు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 70ఎకరాల సున్నరాయి గనులు కేటాయించుకొని నిబంధనలను విరుద్దంగా మైనింగ్ చేస్తూ కోట్లాదిరూపాయలు వెనకేసుకుంటున్నారు.
ప్రభుత్వ భూమి కనిపిస్తే రాబంధులే
డోన్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎక్కడ కన్పించినా బుగ్గన బంధువులు రాబంధువుల్లా వాలిపోతారు. ఎమ్మార్వోలను బెదిరించడం, రికార్డు లను తారుమారు చేసి ప్రభుత్వ భూములను కైవసం చేసుకోవడం బుగ్గన బంధువులకు వెన్నతోపెట్టిన విద్య. ఇటీవల వీరి వత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలుగా సంతకాలుచేసిన ప్యాపిలి మండలంలో ఒక వీఆర్‌వో, ఆర్‌ఐ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ప్యాపిలి మండ లంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి 10 ఎకరాల్లో వెంచర్ వేసి బోర్డు పెట్టి మరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.20 కోట్లు దోచుకున్నారు. డోన్ మండలంలోని బూర్గుల గ్రామంలో సర్వే నెం.270లో 480 ఎకరాల ప్రభుత్వ భూమిని కొలివిగుండ్ల గ్రామానికి చెందిన వారి పేరుతో పాస్‌బుక్‌లు ఇప్పించి రూ.50 కోట్లు కొల్లగొట్టారు. ఈ తంతంగమంతా వెనుక ఉండి నడిపించేది నడిపించేది మంత్రి బుగ్గనే.