- ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రద్దుకు ఛాన్స్
- కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024
- వైసీపీ భూదందాల నిగ్గు తేల్చడానికే..
- స్పోర్ట్స్, డ్రోన్, డేటాసెంటర్ల పాలసీలపై చర్చించే అవకాశం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మంత్రిమండలి సమావేశం జరగనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 బిల్లు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించనుంది. భూసేకరణ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వైకాపా ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూఆక్రమణలపైనే ఉన్నాయి. ప్రస్తుత చట్టంతో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులున్నాయని.. దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే భూసేకరణ చట్టం 1982ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024ను తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది.
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించే అంశం కేబినెట్ భేటీలో చర్చకు రానుంది. వైకాపా హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77ను రద్దు చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటారు. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త క్రీడా విధానం, డ్రోన్, సెమీకండక్టర్, డేటా సెంటర్ పాలసీల రూపకల్పనపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంపు, ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాన్ని రూ.7 కోట్లకు పెంపు అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు.