నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ
కేంద్రమంత్రులతో కలిసి 23న సీఎం చంద్రబాబు భూమిపూజ
రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో పరిశ్రమకు శ్రీకారం
ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉద్యోగావకాశాలు
ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో మరో చారిత్రక అడుగుపడనుంది. ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎనఎస్ ఇండియా) సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి సిద్ధమైంది. దీనికి ఈనెల 23న అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో కేంద్రమంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు. రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటుకానున్న ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. 5,465 ఎకరాల్లో మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు సాకారంకానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుంది.
క్యాప్టివ్ పోర్టుతో మరో 6 వేల ఉద్యోగాలు
స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును కూడా ఏఎంఎనఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. దీని కోసం ప్రత్యేకంగా రూ.11,198 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మరో ఆరువేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంఎనఎస్ ఇండియా ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిశ్రమల హబ్‌గా రూపుదిద్దుకోనుంది. గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దేశంలో భారీగా పెరిగిన ఉక్కు మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఏఎంఎనఎస్ ఇండియాకు లభించనుంది.
అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వ సహకారం
ఈ ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను ఎన్‌హెచ్-16తో కలిపేలా 4 లేన్ రహదారి విస్తరణ పనులు చేపట్టింది. కనెక్టివిటీ పెంచడంతోపాటు పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్‌వంటి మౌలిక వసతులు శరవేగంగా కల్పిస్తోంది.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
సోమవారంనాటి శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరవుతారు. అలాగే కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిధులుగా పాల్గొంటారు. ఇంకా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత, టిజి భరత్, ఎంపీ సిఎం రమేష్ విశిష్ట అతిథులుగా హాజరవుతారు. ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్, ఏఎంఎనఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ భూమి పూజలో పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతినుంచి నేరుగా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఎక్స్‌పీరియన్స్ జోన్ సందర్శించి, ఏఎంఎనఎస్ ఇండియా స్టీల్‌ప్లాంట్ మోడల్‌ను పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకం ఆవిష్కరిస్తారు. అలాగే అవగాహన ఒప్పందాల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు.
















