ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికలు..అధికార వైసీపీకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల వల్ల పార్టీకి కలిగిన లాభం మాట అటుంచితే.. నలుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చింది. వీరిలో ఇద్దరు ఇప్పటికే రెబల్స్‌గా ఉన్నప్పటికీ.. మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేయాల్సి రావటం.. రాజకీయంగా వైసీపీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొన్న ఓ రకమైన అభద్రతా భావానికి తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి ద్వారా.. ఇప్పటికే వైసీపీ పరువు గంగలో కలవగా.. నలుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసుకోవాల్సి రావటం..ఆ పార్టీ దౌర్భాగ్యంగా అభివర్ణిస్తున్నారు.
వాస్తవానికి అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీ.. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలను నల్లేరుపై నడకలా గెలుచుకోవాల్సి ఉంది. కానీ అలా జరగక పోగా.. ఎన్నికలు ముగిసే నాటికి నలుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేలను చేతులారా కోల్పోవాల్సి వచ్చింది. అంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా వచ్చిన మైలేజ్ మాట దేవుడెరుగు.. జరిగిన డ్యామేజ్ ఆ పార్టీ అధినాయకత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తోంది. అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయాయన్న సామెత చందంగా పార్టీ అధినేత జగన్ రెడ్డి పరిస్థితి తయారైందని విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతికిలపడ్డారంటూ ఎద్దేవా చేస్తున్నాయి.
ఇక.. ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా జరిగిన క్రాస్ ఓటింగ్.. ఆ తరువాత నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయటం వైసీపీలో సంచలనం సృష్టిస్తోంది. పార్టీ అధినేత జగన్ రెడ్డి నిర్ణయాన్ని కొంత మంది సమర్ధిస్తుంటే.. మరి కొంత మంది అంతర్గత సమావేశాల్లో వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్ళూ ఎమ్మెల్యేలకు అపాయింటుమెంట్లు కూడా ఇవ్వని జగన్ రెడ్డి వైఖరిని ప్రైవేటు సంభాషణల్లో ప్రశ్నిస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి వంటి వారికే ఇలాంటి దుస్థితి పట్టినప్పుడు.. రేపు తమ పరిస్థితి ఏంటనే అభిప్రాయాన్ని చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాల్లా తయారు చేసిన సీఎం జగన్ రెడ్డి.. తమకు కనీసం అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వకపోవటాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తాము చేసేందుకు పనే లేనప్పుడు.. తమ గ్రాఫ్ తగ్గిందంటూ టికెట్లను నిరాకరించటం ఏంటని నిలదీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రానప్పుడు ఈ పార్టీలో ఉండీ ఉపయోగం ఏంటని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదో ఒక రోజు బయటకు వెళ్ళక తప్పని పరిస్థితుల్లో.. ముందు జాగ్రత్తగా ప్రతిపక్ష టీడీపీతో వారు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావటం.. మొత్తం నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా వేయటం జరిగిపోయాయి. ఆనం రాం నారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితోనే అసమ్మతి ఆగిపోతుందనుకున్న వైసీపీ అధిష్టానం షాక్ తింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం అసమ్మతి జాబితాలో చేరటంతో.. చేసేదేమీ లేక మొత్తం నలుగురిపై సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చింది. అయితే.. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్‌లోనే పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయి. తమ నియోజకవర్గాల్లో ఇతరులకు పెత్తనం ఇవ్వటాన్ని వీరు తీవ్రంగా తప్పు పడుతున్నారు. అధిష్టానం వద్ద తమ గోడు వినిపించుకున్నా.. జగన్ రెడ్డి డోన్ట్ కేర్ అంటున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో గత్యంతరం లేక వారు తెలుగుదేశం పార్టీ వైపు చూడాల్సి వస్తోంది. దాదాపు ఇదే రకమైన పరిస్థితి త్వరలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎదురుకానుందని పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు అదును చూసుకుని తమ గళాలు వినిపించటానికి సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే.. అధికార వైసీపీ భారీ రాజకీయ సంక్షోభాన్ని త్వరలోనే ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.