సౌత్ అమెరికాలోని కొలంబియా డ్రగ్స్‌కు ప్రసిద్ధి. అక్కడినుంచి మాదక ద్రవ్యాలు అమెరికాకు సరఫరా అవుతుంటాయి. అక్కడ పేద కుటుంబంలో జన్మించిన ఎస్కోబార్ తిరుగులేని మాఫియా డాన్‌గా ఎదిగారు. మెడలిన్ అనే ప్రాంతంలో తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మాదకద్రవ్యాల ముఠాకు నాయకత్వం వహించాడు. ఆ రోజుల్లోనే కొన్ని లక్షల కోట్లు సంపాదించి పెద్ద నేర సామ్రాజ్యాన్నే స్థాపించాడు. అతనికి ఎవరైనా ఎదురు తిరిగితే చంపేసేవాడు. పోలీసు అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని, మాట విననివారిని భయబ్రాంతులకు గురిచేసేవాడు. కొలంబియాలోని అన్ని వ్యవస్థలపై అతడు పెత్తనం సాగించారు. ఎస్కోబార్‌లోని లక్షణాలన్నీ జగన్‌రెడ్డిలో వున్నాయనే.. జగన్‌ను ఫ్యాబ్లో ఎస్కోబార్‌తో సరిపోల్చారు సీఎం చంద్రబాబు. ఒకానొక దశలో కొకైన్ కింగ్ ఎస్కోబార్‌కు లెక్కపెట్టలేనంతంగా డబ్బు వచ్చిపడేది. వాటిని లెక్కించేందుకు పెద్దపెద్ద మెషిన్లు తెచ్చేవారు. 70, 80 దశకాల్లో సుమారు రెండు దశాబ్దాలపాటు అతడి హవా కొనసాగింది. ఈ విషయంలో కూడా జగన్‌రెడ్డికి పోలిక ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాదాపు రూ.8 లక్షల కోట్లు అక్రమంగా సంపాందించినట్టు అంచనా. విపరీతంగా డబ్బు సంపాదించాలనే దురాశ జగన్‌రెడ్డిలో ఉంది.
ఎస్కోబార్‌కి కూడా తన వద్ద ఎంత డబ్బుందో అతడికే తెలియదు. జగన్‌రెడ్డి పరిసితీ అంతే. ఎస్కోబార్‌కు చిన్నతనంలో పేదరికం కారణంగా డబ్బుపై విపరీతమైన ఆశ పెరిగింది. 2004కు ముందు వైఎస్ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో వున్న సమయంలో హైదరాబాద్‌లో ఇల్లు అమ్మకానికి పెట్టారు. ఆనాడు ఇంటిని క్రమబద్ధీకరించింది సీఎం చంద్రబాబు. వైఎస్ కుటుంబం పేదరికంలో లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు అవసరమైంది. అది చూసిన జగన్‌రెడ్డికి విపరీతంగా డబ్బు సంపాదించాలన్న ఆశ కలిగింది. 2004లో తండ్రి వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండు చేతులతో ప్రజాధనం దోచేశాడు. ఆంధ్రప్రదేశ్‌ను సొంత జాగీరుగా మార్చుకొని జనం సొమ్ముతో విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్‌రెడ్డి నిర్మించుకున్న అత్యంత విలాసవంతమైన ప్యాలస్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రకృతి వనరుల విధ్వంసం, ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేశారో చెప్పడానికి జగన్‌రెడ్డే ఉదాహరణ. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రుషికొండపై పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ జగన్‌రెడ్డి సాగించిన అరాచకం మాటల్లో చెప్పలేనిదే.
విశాఖలో రుషికొండ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం. పచ్చని కొండలను తవ్విపారేసి పర్యావరణాన్ని నాశనం చేసి.. ఏటా రూ.15 కోట్ల వరకు ఆదాయం వచ్చే భవనాలను నిలువునా కూల్చేసి.. జగన్‌రెడ్డి జల్సా భవనాలు నిర్మించారు. అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలకు విరుద్దంగా రుషికొండపై 9.88 ఎకరాల్లో 13,140 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసి విజయనగర, కళింగ, వేంగి, గజపతి బ్లాకులుగా ఏడు భవనాలు నిర్మించారు. ఇందులో విజయనగర బ్లాక్ -1, 2, 3 పేరిట అత్యంత ఖరీదైన విల్లాలు నిర్మించి మూడు విలాసవంతమైన భవనాలను తన కుటుంబానికి కట్టించుకొన్నారు. ఈ భవనాల నిర్మాణాలు పూర్తి సెంట్రల్ ఏసీ కలిగి పూర్తి గ్రానైటెడ్ ఫినిషింగ్‌తో అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ, భారీ స్క్రీన్లు, విలాసవంతమైన బెడ్రూంలు, బాత్రూంలు కలిగి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.500 కోట్లు ఖర్చు చేశారు. ఇంటీరియర్, ఫర్నిచర్, మౌలిక సదుపాయాల కోసమే రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఒక ముఖ్యమంత్రి తన విలాసం కోసం పర్యావరణాన్ని నాశనం చేసి ప్యాలెస్ కట్టడం చరిత్రలో ఇదే ప్రథమం. రుషికొండ ప్యాలెస్‌లోని ఫర్నిచర్, షాండ్లియర్స్, కమోడ్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.
ఉత్తరాంధ్ర సాగు నీటిపారుదల ప్రాజెక్టుల కోసం గత ఐదేళ్లలో రూ.400 కోట్లు కూడా ఖర్చు చెయ్యని జగన్‌రెడ్డి.. తన విలాసాలు, జల్సాల కోసం రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడంటే అతను రాజకీయాల్లో ఉండటానికి అర్హుడేనా? అని ప్రజలు నిర్ణయించుకోవాలి. రుషికొండపై నిర్మించిన ప్యాలెసను చూస్తుంటే. ప్యాలెస్ బ్లూప్రింట్‌తోపాటు వైశాల్యం, ఒక్కో బ్లాక్‌లో నిర్మాణాల ప్రత్యేకతలు విజయనగర బ్లాక్‌లోని విలాసవంతమైన బాత్‌రూమ్‌లు, మసాజ్‌రూమ్, మరుగుదొడ్డి కమోడ్‌లు, ఫ్యాన్‌లు, కళింగ బ్లాక్‌లోని విశాలమైన సమావేశ మందిరం, గజపతి, వేంగీ బ్లాక్‌లలో విదేశాల నుంచి తెప్పించిన రాజరికం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఫర్నిచర్, ఇంటీరియర్‌ను చూసిన సీఎం చంద్రబాబుకు నోట మాటరాలేదు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం, స్వార్థం కోసం ఇంతగా బరితెగించడం చూసి స్థాణువయ్యారు. అందుకే `జగన్‌రెడ్డిని ఆంధ్ర ఎస్కోబార్‌గా చంద్రబాబు అభివర్ణించేది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా ఎలా వ్యవహరించారో చెప్పడానికి ఇదొక కేస్ స్టడీ. తాను రాజుని, రారాజుని, చక్రవర్తిని అనుకున్నాడో లేకపోతే శాశ్వతంగా అధికారంలో ఉండిపోతాననుకున్నాడో తెలీదుకానీ, రాష్ట్రపతిభవన్, వైట్‌హౌస్‌లో కూడా లేనివిధంగా కారిడార్ నిర్మించారు. 200 టన్నుల సామర్థ్యమున్న ఏసీలను ఏర్పాటు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజాధనం అంటే బాధ్యత లేని, ప్రజలంటే లెక్కలేని, ప్రజాస్వామ్యమంటే భయంలేని పాలకులు ప్రభుత్వ సొమ్ము రూ.కోట్లు కుమ్మరించి, వ్యక్తిగత విలాసాల కోసం ప్యాలెస్‌లు నిర్మించుకున్న జగన్‌రెడ్డికి ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా?
ప్రజలకు ఉపయోగపడే కట్టడాలను తీసేసి మళ్లీ టూరిజం ప్రాజెక్టు కడతామని జనానికి అబద్దాలు చెప్పి గుట్టుచప్పుడు కాకుండా అక్కడ ప్యాలెస్‌ను కట్టుకున్నారు. అదో రాజభవనమని, అలాంటిది దేశ ప్రధానికి కూడా లేదని తేలింది. జనం డబ్బుతో జల్సా చేయడానికి ప్యాలెస్ కట్టుకున్నారని ప్రపంచానికి అర్థమైంది. దేశ పార్లమెంటు భవన నిర్మాణానికి అయిన ఖర్చు రూ.700 కోట్లు మాత్రమే. కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ముతో సొంత అవసరాల కోసం రూ.500 కోట్లతో భారీ ప్యాలెస్ నిర్మించుకోవడం పెత్తందారీతనానికి నిదర్శనం. తాడేపల్లిలో ప్యాలెస్ నిర్మాణానికి వందల కోట్ల ప్రజా ధనాన్ని దారపోశారు. తన బండారం బయట పడటంతో ప్రధానులు, రాష్ట్రపతులు వస్తే ఉండడానికి నిర్మాణాలు చేసినట్లు కొత్త కథలు చెప్పారు. నిజంగా ప్రధాని, రాష్ట్రపతిలాంటి వారి కోసమే అయితే గుట్టుగా ఎందుకుంచారు? తన రాజభోగాన్ని కప్పి పెట్టేందుకు ప్రధాని, రాష్ట్రపతిపైకి నెపాన్ని నెట్టారు. ప్రజలపై చెత్త పన్ను పేరుతో వంద రకాల పన్నులేసి, ఆర్టీసీ, విద్యుత్, పెట్రోల్ డీజిల్ ధరల బాదుడుతో రక్తాన్ని పీల్చి పిప్పి చేసి, ఇలాంటి భారీ ప్యాలెస్లు నిర్మించుకున్న వ్యక్తికి పేదలు గురించి మాట్లాడే అర్హత ఉన్నదా?
అప్పులు చేసి విలాసవంతంగా ఉండేందుకు ప్రజల సొమ్మును దారబోసిన జగన్‌రెడ్డి పేదల మనిషి ఎలా అవుతాడు? సొంత విలాసాల కోసం, సొంత ఆడంబరాల కోసం ప్రజల రక్తాన్ని జుర్రుకున్న జలగ ఈ జగన్ రెడ్డి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించిన మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి రూ.5 కోట్లు ఖర్చు చేసి తాగునీరు ఇవ్వడానికి చేతులు రాలేదు. కానీ రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. కోర్టుల కళ్లకు గంతలుకట్టి రూ.500 కోట్లు ఖర్చుపెట్టి సీఎం క్యాంపు కార్యాలయం పేరిట రాజప్రసాదం నిర్మించడం జగన్ మితిమీరిన అహంకారానికి పరాకాష్ట. కాకినాడ-విశాఖపట్నం పెట్రో కారిడార్ కలసాకారం చేసివుంటే లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు పెరిగి ఉత్తరాంధ్ర ఆర్ధికంగా అభివృద్ధికి దోహద పడేది. అది వదిలేసి సీఎం కార్యాలయం అట్టహాసంగా కడితే రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనమేమిటి? అందుకే ఎస్కోబార్‌లో ఉన్న అన్ని అవలక్షణాలూ జగన్‌లో ఉన్నాయి కనుకే.. అతనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఆంధ్రా ఎస్కోబార్’తో పోల్చారు. దీనికి మాత్రం జగన్ అర్హుడు!
`నీరుకొండ ప్రసాద్