‘మనలోని ఉత్సాహాన్ని సమర్థవంతంగా సద్వినియోగపరిస్తే బ్రహ్మండమైన నిర్మాణశక్తి ఉద్భవిస్తుంది.’
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆనాటి ప్రధాని 70 ఏళ్ల క్రితమే ఉద్బోధించారు.
ఆనందాంధ్రను ఆవిష్కరించే విధంగా బడ్జెట్ రూపొందించారు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్. పన్నుల బాదుడు జోలికి పోకుండా కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తూ, మూలధన వ్యయాన్ని పెంచుతూ రాష్ట్రాన్ని ప్రగతిబాట పట్టించేలా బడ్జెట్‌లో బాటలు వేశారు. అభివృద్ధి పూర్తిగా అడుగంటి ఏపీ అస్తిత్వమే ప్రశ్నార్థకమైన రాష్ట్ర భవిష్యత్తును కాచుకోవడమే లక్ష్యంగా.. విధ్వంస ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ మహాయజ్ఞానికి ఎన్డీయే ప్రభుత్వం సమగ్ర ఆర్ధిక ప్రణాళికను రూపొందించింది. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తీర్చిదిద్దిన 2024-25 ఆర్ధిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణం దిశగా కొత్త అడుగులువేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునరంకితమవుతూ నిధుల కేటాయింపులు చేశారు. అభివృద్ధి సంక్షేమం, ఎన్నికల హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణంవంటి అనేక ఒత్తిళ్ల మధ్య కూడా భారీ కసరత్తు చేసి భారీ బడ్జెట్‌ను రూపొందించారు. ఏవర్గాన్ని అసంతృప్తి పర్చకుండా దీర్ఘకాలంలో చేకూరే ప్రయోజనాలు, ప్రస్తుతం చేకూరే ప్రయోజనాలు, హామీలు, భరోసాలు బాగానే కల్పించారు. బడ్జెట్ రూపొందించే సమయంలో వాస్తవికతను ప్రజల కళ్లకు కట్టారు. ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా నిలపడమే లక్ష్యంగా అద్భుత బడ్జెట్ రూపొందించడం అభినందనీయం. భారమైనా భారీగానే బడ్జెట్ కేటాయింపులు జరిపి సమస్యలకు తలోగ్గేదిలేదన్న తెగువను కనబర్చారు ఆర్ధిక మంత్రి. జనం ఆశలు, సీఎం చంద్రబాబు కలలు కలగలిసి స్వర్ణాంధ్ర దిశగా ప్రయాణం మొదలైంది. ఐదేళ్ల అసుర పాలనలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన అత్యంత కీలక తరుణంలో తమను ఒడ్డుకు చేర్చే బాధ్యతను సమర్ధ నాయకుడు, దార్శనికుడైన చంద్రబాబుకే అప్పగించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో ప్రవర్ధమానం కావాలని ఐదునెలలుగా ఒక్క రోజు విరామం లేకుండా శ్రమిస్తున్నారు.
జగన్ జమానాలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యమేలింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సకల వ్యవస్థలూ గాడి తప్పాయి. వీటన్నింటినీ సరిదిద్ది రాష్ట్రాభివృద్ధిని పరుగులు తీయించడం నూతన ప్రభుత్వానికి సవాలే. అయినా సమర్ధ ఆర్ధిక నిర్వహణ, సమగ్ర ప్రణాళికలు, వినూత్న విధానాలతో ముందుకుసాగితే ఏపీ దశ మారడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో వేరేచెప్పనక్కరలేదు. కానీ కష్టపడితే సిద్ధించే లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఉత్తమ విధానాలను అనుసరించడం, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సవాళ్లను అధిగమించి ఆగ్రస్థాయికి ఎదగవచ్చు. అనుభవం, దార్శనికత మెండుగావున్న నాయకత్వం రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా నిలుస్తుంది. చీకట్లు కమ్మిన, శిథిలసౌధంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి అలంబనలయ్యే పోలవరం, రాజధాని నగర నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందించేందుకు ముందుకు రావడం అభినందనీయం.
విధ్వంస రాష్ట్ర పునర్నిర్మాణానికి, అన్నివర్గాల అభ్యున్నతికి ఆర్ధికమంత్రి కేశవ్ తొలి పద్దు వేగుచుక్కలా పొడిచింది. రాజధానికి నిధులిచ్చింది. పోలవరానికి వరాలు కురిపించింది. అమరావతి, పోలవరాన్ని వేగంగా నిర్మించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా అన్నివైపులనుంచి సహకారం లభిస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి, భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు కలిపి రూ.3,445 కోట్లు కేటాయించారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తేవాలన్న లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేశారు. ఒకవైపు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సాయానికి పచ్చ జెండా ఊపిన ప్రభుత్వం రాజధాని పనులు పరుగులు పెట్టించేందుకు బడ్జెట్‌లో ఇతోధికంగా నిధులిచ్చింది. రాబోయే నాలుగు నెలల్లో ఈ నిధులతో అమరావతి నిర్మాణ పనులు పరుగులు తీయనున్నది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల కింద ఆస్తులు సృష్టించేలా మూలధన వ్యయం చేసేందుకు రూ.32,712 కోట్లు కేటాయించారు. ఐదు కోట్ల ఆంధ్రుల జలదేవాలయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5.445 కోట్లు కేటాయించడం అభినందనీయం. పోలవరం ప్రాజెక్టు తొలి దశకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించింది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా మిగిలిన నిర్మాణ పనులు 2027 మార్చినాటికి పూర్తి చేసి జాతికి అంకితం చెయ్యనున్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలను పరుగులు తీయించాలని నిర్ణయించడం సీఎం చంద్రబాబు దీక్షా దక్షతలకు అద్దం పడుతుంది. 2025 న్యూ ఇయర్‌లో ఆంధ్రప్రదేశ్ గేరు మార్చబోతున్నది. ఏపీని వెలుగులవైపు మళ్లించబోతున్నారు చంద్రబాబు.
తన తొలి పద్దులోనే సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ పేదల గుండెల్లో ఎన్డీయే ప్రభుత్వానికి పెద్దపేట వేశారు. అన్నదాతా సుఖీభవా అంటూ, అమ్మకు వందనాలు పలికింది తొలిపద్దు. ఆడబిడ్డ నిధితోపాటు త్వరలోనే కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభం కాబోతున్నాయని సంకేతాలిచ్చింది. జగన్ జమానాలో మంగళంపాడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా మళ్లీ స్వయంఉపాధి పథకాలు చేపట్టేందుకు వీలుగా రాయితీపై రుణాలిచ్చేందుకు బాటలు వేశారు. గత పాలనలో దగాపడ్డ మధ్యతరగతి ప్రజలు, అట్టడుగు ప్రజలు వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అన్నివర్గాల జీవనాన్ని గుణాత్మకంగామార్చే బృహత్తర లక్ష్య సాధన కోసం పేదప్రజల సంక్షేమానికి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. చదువుకునే ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున సాయం చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా, దీనికోసం ‘తల్లికి వందనం’ పథకానికి రూ.6,487 కోట్లు బడ్జెట్‌లో కేటాయించడం హర్షణీయం. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రకటించిన అన్నదాతా సుఖీభవ పథకానికి రూ.1000 కోట్ల నిధులు కేటాయించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం చేస్తామన్న హమీ అమలుకు మహిళా నిధి కింద బడ్జెట్‌లో రూ.3341 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలకు, వారికి సంబంధించిన మౌలిక సౌకర్యాల కల్పనకు కలిపి రూ.69,437 కోట్లు కేటాయించారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రూ.10 లక్షల వరకు అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు రూ.1,250 కోట్లు. పేదల గృహ నిర్మాణం కోసం రూ.4,012 కోట్లు, పట్టణాల్లో జీ ప్లస్3 తరహాలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లకు రూ.1,088 కోట్లు కేటాయించారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి స్వయం ఉపాధి పథకాల కింద రాయితీ రుణాలు ఇచ్చేందుకు రూ.1,521 కోట్లు నిధులు కేటాయించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వాటాయే బ్యాంకుల రుణాలు కలిపితే ఈ నిధులు రెండు రెట్లు పెరగనున్నాయి.
వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి రూ.48,402 కోట్లు కేటాయించారు. ఇందులో ఉచిత విద్యుత్తు రూ.7.211 కోట్లు, జలవనరుల శాఖకు రూ.16,705 కోట్లు ఖర్చు చెయ్యనున్నారు. వంశదార`2, వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు- నగరి సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ సాగునీటి ప్రాజెక్టులతో పాటు అనేక ఇతర ప్రాజెక్టులు నిర్మాణానికి నిధులు కేటాయించడం అభినందనీయం.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రస్తుత బడ్జెట్‌లో రహదారుల పునర్నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. ఇందుకోసం రూ.5.441 కోట్లు కేటాయించారు. గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ.1,098 కోట్ల, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.16,739 కోట్లు కేటాయించారు. పల్లెల్లో జలజీవన్ మిషన్ పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆసియా మౌలిక సౌకర్యాల అభివృద్ధి బ్యాంకు నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులిచ్చి ఇళ్లలో జలజీవన్ మిషన్ పనులు ఊపందుకునేందుకు బడ్జెట్ వీలు కల్పించింది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక బకాయిలు చెల్లించేందుకు బడ్జెట్లో రూ.2,270.70 కోట్లు నిధులు కేటాయించారు. కొత్తగా పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మూలధన వ్యయం కింద నిధులు కేటాయించారు.
నాయకుడికి తొణకని పట్టుదల ఉంటే రాష్ట్రం అన్ని సవాళ్లనూ అధిగమించి ప్రగతిపధంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. ఎదురుగా కనిపిస్తున్న దారి కంటకప్రాయమైనదే. అయినా శక్తివంచన లేకుండా కష్టించి ప్రజల కలలను నిజం చేసేందుకు నూతన చైతన్యం నిండిన దార్శనికత వున్న నాయకుడు పాలకుడిగా వున్నారు. ఏపీ భవిత చాలా ఆశాజనకంగా కనబడుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరింత ఉన్నతమైన ఉత్సాహంతో భవిష్యత్తు కోసం దృఢ సంకల్పంతో ముందుకు నడస్తే ఆనందాంధ్రను ఆవిష్కరించవచ్చు.
నీరుకొండ ప్రసాద్.