ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళలో విఫల పాలకుడిగా చరిత్ర సృష్టించారు. ప్రజలకు,రాష్ట్రానికి చేసింది ఏమి లేకపోయినా ఏవో మహాద్భుతాలు చేసినట్లు సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా వుంది. జగన్ అసమర్ధ, అరాచక, విధ్వంస పరిపాలన రాష్ట్రాన్ని పెనుసంక్షోభంలోకి నెట్టింది. జగన్ మూర్ఖపు పాలన ఆంధ్రప్రదేశ్ ని అధోగతి పాలుచేసింది. కోటిఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన జగన్ తన మూడేళ్ళ పాలనలో ప్రజలకు చేసిన మంచి పనులు ఏమిటో చెప్పాలి. మీరు నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొన్నానని, మూడేళ్ళలో 95 శాతం పైగా హామీలు అమలు చేసామని, ఎన్నో మంచి పనులు చేసామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ట్వీట్ చేశారు. మూడేళ్ల పాలనపై వైసీపీ నేతలు మాత్రమే సంబరాలు జరుపుకున్నారు తప్ప ప్రజలెవ్వరూ సంబరాలు చేసుకోలేదు. వైసిపి సంబరాలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయి. జగన్‌పాలనలో ప్రజలకు మంచి జరిగిఉంటే ప్రజలే సంబరాలు చేసుకొనేవారు. సంక్షేమ పథకాల ద్వారా జగన్ ప్రజల ఖాతాల్లో లక్షా 40 వేల కోట్లు వేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆస్తిపన్ను నుంచి చెత్త పన్నువరకు, విద్యుత్ చార్జీలు నుండి ఆర్టీసీ చార్జీలు ధరలు, నిత్యావసర ధరలు వరకు ప్రజలపై మూడేళ్ళలో రూ 90 వేలకోట్ల రూపాయల భారం మోపినందుకు ఏం సమాధానం చెబుతారు? మూడేళ్లలో ఏ రంగంలోనైనా అభివృద్ధి జరిగిందా? ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? ఒక్క ఎకరం భూమి సాగులోకి తెచ్చారా? ప్రాధాన్యత రంగాలైన పారిశ్రామిక, వ్యవసాయ, సాగునీటి రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అమరావతి రెక్కలు విరిచారు. చంద్రబాబునాయుడు హయాంలో 70శాతం పూర్తిచేసిన పోలవరాన్ని పుట్టి ముంచారు. పోలవరం నిర్వాసితులను గాలికి వదిలేశారు. పాలనలో విఫలమై… చేసింది చెప్పుకోవడానికి ఏమిలేక సామాజిక న్యాయం అంటూ మంత్రులతో బస్సు యాత్రలు చేయించారు.
మూడేళ్ళ పరిపాలనలో వైసీపీ నాయకులు ప్రజలను ఏం ఉద్దరించారని సంబరాలు చేసుకొంటున్నారో సమాధానం చెప్పాలి. మూడేళ్లలో ఏ వర్గాన్ని, ఏ రంగాన్ని ఉద్దరించారని సంబరాలు చేసుకొన్నారు? మూడేళ్ళుగా జగన్ సాధించిన ఘనకార్యం ఏమిటని సగటు వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లుగా అసమర్ధ, అసంబద్ద, అలసత్వ, అహంకార విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ని అధఃపాతాళానికి నెట్టినందుకు సంబరాలు చేసుకొన్నారా? పాలనలో విఫలం అయి టక్కుటమారా విద్యలతో, దగాకోరు విన్యాసాలతో మోసపూరిత పాలన చేస్తున్నందుకు సంబరాలా? మూడేళ్ళలో రాష్ట్ర అప్పు రూ 8లక్షల కోట్లకు చేర్చి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల కుప్పగా మార్చినందుకు సంబరాలా ? అప్పుల కుప్పతో, చితికిన బతుకులతో, విధ్వంసం చేసిన ప్రజావేదిక శిధిలాలతో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతున్నందుకు సంబరాలు చేసుకున్నారా? వారం, వారం హస్తిన చుట్టూ తిరుగుతూ అప్పుల కోసం బిచ్చం ఎత్తుకొంటున్నందుకు సంబరాలా? జగన్ దాహోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించలేనందుకు సంబరాలా? మూడేళ్లుగా హైకోర్టు,సుప్రీం కోర్టులతో దాదాపు 200 లకు పైగా చీవాట్లు తిన్నందుకు సంబరాలా? మీ పాలనలో మహిళల భధ్రత గాలిలో దీపమై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారినందుకు సంబరాలా? చట్టంకాకుండా దిశ బిల్లు, దిశ పోలీస్ స్టేషన్ , దిశ వాహనాలు, దిశయాప్ లు అంటూ మహిళలను మభ్యపెడుతున్నందుకు సంబరాలా? ప్రాధాన్యతా రంగమైన నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసినందుకు, పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేసినందుకు, మూడేళ్ళుగా 3 శాతం పనులు కూడా చేయనందుకు పోలవరాన్ని కలగా మార్చినందుకు సంబరాలా? మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే అసమర్ధ విధానాలతో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చి మూడేళ్ళలో మళ్లీ రాష్ట్రాన్ని అంధకారం చేసినందుకు సంబరాలు చేసుకుంటారా? 7సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ. 42 వేలకోట్ల భారం వేసినందుకు సంబరాలా? సామాజిక న్యాయ యాత్ర పేరుతో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు నిర్వహించిన బస్సుయాత్ర సభలు జనం లేక వెలవెల బోయినందుకు సంబరాలా?
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తామని ఉద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక అది సాధ్యంకాదని కమిటీల మీద కమిటీలు వేస్తూ ఉద్యోగులను వంచించినందుకు సంబరాలా? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తూ భావప్రకటనా స్వేచ్చను, పౌరహక్కులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నందుకు, కొన్ని మీడియా వ్యవస్థలపై వివక్షత చూపిస్తూ సొంత మీడియాకు ప్రకటనల ద్వారా రాష్ట్ర ఆదాయం దోచి పెడుతున్నందుకు సంబరాలా? వృద్దుల,వితంతు పింఛన్లను రూ 3వేలకు పెంచుతామని హామీఇచ్చి అధికారంలోకి వచ్చాక మూడేళ్ళలో రూ 500 మాత్రమే పెంచి చేతులు దులుపుకొన్నందుకు సంబరాలా? నాకు అందరూ సమానమేనని, కుల,మతాలకు అతీతంగా పాలన సాగిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కీలక పదవులన్నీ సొంత కులానికి కట్టబెట్టి కూడా సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్రలు చేస్తూ బీసీలను మోసం చేస్తున్నందుకు సంబరాలా? ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉంటామని మోసగిస్తే కళ్లాల్లో ధాన్యాన్ని అన్నదాతలు అయినకాడికి అమ్ముకున్నందుకు సంబరాలా? నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజల జీవన ప్రమాణాలు దుర్భరంగా మారినందుకు సంబరాలా? అమరావతిపై పగబట్టి అయిదు కోట్ల ప్రజల కలల రాజధాని అమరావతిని పురిటిలోనే పీకనులిమి మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కల ఆటఆడి చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు సంబరాలా? అదనపు అప్పులకోసం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించి ఉచితవిద్యుత్ పథకానికి మంగళం పాడేందుకు సిద్దపడి రైతుల మెడకు వురి బిగిస్తున్నందుకు సంబరాలా? వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు, రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ను దేశం మూడోస్థానంలో నిలిపినందుకు, అరకొర రైతుభరోసా ఇచ్చి సమస్త రైతు సమస్యలు పరిష్కరించినట్లు పత్రికాప్రకటనలు ఇస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నందుకు సంబరాలా?
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కును కేంద్రం ప్రవేటీకరణ చేసేందుకు సిద్ధమైతే ప్రవేటీకరణ చేసేందుకు అంగీకరించి కూడా ప్రజలను నమ్మించడానికి ధర్నాలు, పాదయాత్ర డ్రామాలతో రక్తికట్టించి అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కపట తీర్మానాలు చేసి ప్రజలను మభ్యపెట్టినందుకు సంబరాలా ? అభివృద్ధి పధంలో పయనిస్తున్న రాష్ట్రంలో అభివృద్ధిని నిలిపివేసి తిరోగమన బాట పట్టించినందుకు, కక్షపూరితంగా, అక్కసుతో పాలిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఒక్కరు కూడా రానందుకు, వచ్చిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోయినందుకు సంబరాలా ? ప్రభుత్వ సంపద అయిన గనులు, ఇతర సహజ వనరులను చేజిక్కించుకొని జేబులు నింపుకొంటున్నందుకు సంబరాలా? సంపూర్ణ మద్యనిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నాసిరకం మద్యంతో ముంచెత్తి సామాన్యుల ఇల్లు, ఒళ్లు గుల్లచేస్తూ ఖజానా నింపుకోవడం కోసం నవరత్నాలను మద్యం ఆదాయంలో ముంచి బడుగుల బతుకులు బుగ్గి చేస్తున్నందుకు సంబరాలా ? స్టార్ హోటళ్లలో తప్ప మద్యం ఎక్కడా అందుబాటులో ఉండదని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చి ప్రస్తుత ప్రజలు తాగే మద్యమే కాకుండా భవిష్యత్ లో తాగబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి వేలకోట్లు అప్పు తెచ్చినందుకు సంబరాలా? మూడేళ్ళలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పధకానికి కూడా పునాది రాయి వెయ్యనందుకు, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీగా వున్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని, ప్రతిఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని యువతని వంచించి అధికారంలోకి వచ్చి మూడేళ్ల తర్వాత బోగస్ జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసినందుకు సంబరాలా? మూడేళ్లుగా రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ రాక ఉపాధి, ఉద్యోగ అవకాశాలూ లేక నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తున్నందుకు సంబరాలా? అమరావతిని అటకెక్కించడం, పీపీఏల రద్దు చెయ్యడం వంటి మీ రివర్స్ నిర్ణయాలతో గతంలో వచ్చిన పరిశ్రమలు వెళ్లిపోయినందుకు సంబరాలా? ఎవరైనా మూడేళ్ళ పరిపాలనలో ప్రజలకు చేసింది ఏమిటో చెప్పుకొంటారు. కానీ వైసిపి నాయకులు చేసింది ఏమిటో చెప్పుకోలేక పదిమంది బీసీలకు మంత్రి పదవులు, తెలంగాణా వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇస్తే సామాజిక న్యాయం పేరుతో మంత్రులు బస్సు యాత్రం చెయ్యడం సిగ్గుచేటు. వైసిపి నాయకులు చెబుతున్న సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి చందమే. జగన్ గద్దెనెక్కాక రాష్ట్రంలో సామాజిక న్యాయం పూర్తిగా అటకెక్కింది. ఏదిఏమైనా జగన్ మూడేళ్ళ పరిపాలనలో ఏమి మహాద్భుతాలు చేశారని సంబరాలు చేసుకొంటున్నారో సమాధానం చెప్పాలి.