- బాబంటే అభివృద్ధి.. జగన్ అంటే జైలు
- పెద్ద అవినీతి స్టార్ జగన్
- వైసీపీ నేతలు తిన్నదంతా కక్కిస్తాం
- మచ్చలేని అశోక్ గజపతిరాజును అవమానించారు
విజయనగరం: జగన్‌కు చంద్రబాబు భయం పట్టుకుంది.. రాత్రి కలలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. విజయనగరంలో శుక్రవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చాయి.. ఆయనవల్ల తెలుగుజాతికి జరిగిన మేలు గుర్తుకు వచ్చింది.. జగన్ జైలులో పెడితే ఆయన చేసిన అవినీతి బాగోతాలు బయటకు వచ్చాయన్నారు. 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చంద్రబాబును ఏ తప్పు చేయకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారు.
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో మొదట రూ.3 వేల కోట్ల అవినీతి అన్నారు. తర్వాత రూ.3 వందల కోట్లు, ఇప్పుడు రూ.27కోట్ల అవినీతి అంటు న్నారు. చంద్రబాబును అరెస్టు చేసి అవినీతి మరక అంటించాలని చూశారు. చంద్రబాబుది పోలవరం రేంజ్… జగన్ ది పిల్లకాలువ రేంజ్. చంద్రబాబును చూస్తే కియా గుర్తొస్తే… జగన్‌ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది. చంద్రబాబును చూస్తే పరిశ్రమలు గుర్తొ స్తాయి…జగన్ చూస్తే బూమ్ బూమ్, ఆంధ్రాగోల్డ్ గుర్తొస్తాయి. చంద్రబాబు అంటే అభివృద్ధికి బ్రాండ్.. జగన్‌రెడ్డి అంటే చంచల్‌గూడ జైలుకు బ్రాండ్. ఆయన కుటుంబ జైలు అది. ఆయన బాబాయి భాస్కర్‌రెడ్డి కూడా చంచల్ గూడ జైలులోనే ఉన్నారు. చంద్రబాబు ముందు చూపున్న విజనరీ..జగన్ ప్రిజనరీ అని లోకేష్ ఎద్దేవా చేశారు.
అవినీతి స్టార్ జగన్
జగన్ ఒక అవినీతి స్టార్. జగన్‌్ ఏ పనిచేసినా ఓ స్కాం దాగి ఉంటుంది. సెంటు స్థలాల పేరుతో 7వేల కోట్లు కొట్టేశారు. లెవలింగ్ పేరుతో 2200 కోట్లు దోచే శారు. టీడీపీ వచ్చిన తర్వాత వడ్డీతో సహా ఆ సొమ్ము కక్కిస్తాం. జగనన్న ఇళ్లు చేతితో తాకితేనే కూలిపోయే పరిస్థితి ఉంది. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మెరుగైన టెక్నాలజీతో ఇళ్లు కట్టిస్తామని లోకేష్ హెచ్చరించారు.
మచ్చలేని అశోక్‌ను అవమానించారు
జగన్ కేసుల్లో నిందితుడు విజయసాయిరెడ్డి. అన్ని కేసుల్లో ఏ2… ఇతను నిజాయితీపరుడు, మచ్చలేని అశోక్ గజపతిరాజును అవమానించాడు. అశోక్ గజ పతిరాజు మాన్సాస్ ట్రస్టు ద్వారా అనేక సేవలందిం చారు. దేశంలోనే అద్భుతమైన సేవలందిస్తున్న స్వచ్ఛం ద సంస్థ మాన్సాస్ ట్రస్టు. దాన్ని బలవంతంగా లాక్కు నేందుకు పిల్లిగడ్డం విజయసాయిరెడ్డి ప్రయత్నించాడు. ఈ వేదిక నుండి విజయసాయిరెడ్డికి చెబుతున్నా… మీరు చేసిన దానికి రెట్టింపు చేసి ఎందుకు అశోక్ జగపతిరాజుతో పెట్టుకున్నానా అని భయపడేలా చేస్తా.
నిరుపేద కుటుంబాలకు మాన్సాస్ ట్రస్టు అండగా నిలబడిరది. మీసాల గీత, అశోక్‌గజపతి రాజు విజయ నగరాన్ని అభివృద్ధి చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గోస్తని-చంపావతి నదుల నుండి నీళ్లు తీసుకొచ్చాం. డబుల్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు నిర్మించాం. 30 పడకల మహారాజా ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మార్చాం. ఇండోర్ స్టేడియం కట్టాం. కానీ మీరేంచేశారు.. తన్నే దున్నపోతును తెచ్చు కున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా విజయనగరాన్ని మార్చారు. అవినీతి రాజు ఎవరు అంటే కోలగట్లను చూపిస్తారు. ప్రభుత్వ భూములు లాక్కుని పార్టీ కార్యాలయం కట్టుకున్నారు. సెంటు పట్టాలంటూ రూ.15 లక్షలకు ఎకరా కొని రూ.38 లక్షలకు ప్రభుత్వానికి అమ్మారు. 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, తిన్నదంతా కక్కిస్తాం. కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించాడు ఈ కోలగట్ల వీరభద్రస్వామి. అశోక్ గజపతిరాజుపై 3 కేసులు పెట్టించారు. ఆయన ఎప్పుడూ ఒకరిని కించపరిచి మాట్లాడే వ్యక్తి కాదని లోకేష్ అన్నారు.
గంజాయికి అడ్డాగా..
విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి విజయనగరాన్ని గంజాయికి అడ్డాగా మార్చారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలి…కుటుంబాలను గంజాయి నాశనం చేస్తుంది. గంజాయి వల్ల లక్షల కుటుంబాలు నాశనం అయ్యాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక గంజాయికి పుల్ స్టాప్ పెడతాం. గతంలో టీడీపీ ఎమ్మెల్యే… ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే ఎలా పని చేస్తున్నారో మీరు చూస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక పోలవరం పూర్తి చేస్తాం..గోదావరి నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకొస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పిప్తాం. ఈ ప్రాంతంలో క్యాన్సర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా క్యాన్సర్ ఆసుపత్రిని తీసుకొస్తాం.
విజయనగరం జిల్లాకు జగన్ 50 హామీలు ఇచ్చారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, రామతీర్థం ప్రాజెక్టు, గోస్తనీ-చంపావతి నదుల అనుసంధానం చేస్తానని చెప్పి చేయలేదు. రామభద్రాపురం, పెద్దగడ్డ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి చేయలేదు. పాలేరు నదిపై డ్యా నిర్మాణం, స్వర్ణముఖి-చిట్టిగడ్డపై బ్రిడ్జిపై నిర్మిస్తామన్నారు. ఏమైనా చేశారా? విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఏ రోడ్డు, భవనం చూసినా టీడీపీ నిర్మించినవే. ఆసుపత్రులు, టూరిజం ప్రాజెక్టులు, సాగు-తాగునీటి ప్రాజెక్టులు కట్టాం. భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ చేశాం. నిరుపేదలకు టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చామని లోకేష్ అన్నారు.