పరాకాష్టకు చేరిన సిఐడి వికృత చేష్టలు
మిస్టర్ డీజీపీ… ఏం సమాధానం చెబుతావ్?
ఎంతమందిపై తప్పుడు కేసులుపెడతారో చూస్తా
అవసరమైతే న్యాయం కోసం నేనే రోడ్డెక్కుతా
మహిళలను వేధించిన వాడిని మాపై ప్రయోగిస్తారా?
ఆ సిఐ గోడలు దూకడంలో సిద్ధహస్తుడు
తప్పుడు పోలీసులను చట్టం ముందు నిలబెడతాం
సిఐడి తీరుపై విరుచుకుపడిన చంద్రబాబునాయుడు
నారాసుర రక్తచరిత్ర అని రాసిన సాక్షిపై కేసుపెడతారా?
అమరావతి: పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ మర్డర్లకు ప్లాన్ చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలు సాంబశివరావు, వెంకటేష్ విషయంలో సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. సంఘ వ్యతిరేక శక్తులమాదిరి అర్థరాత్రి ఇళ్లపైకి వెళ్లడం ఏమిటని ఆయన నిలదీశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో … రాష్ట్రంలో సిబిసిఐడి అధికారులు రౌడీలు, అసాంఘిక శక్తులకంటే దారుణంగా వ్యవహస్తున్నారు. ఎంపి రఘురామ విషయంలో ఇష్టానుసారం ప్రవర్తించారు. ఎంపీని రాత్రంతా కొట్టి భయపెట్టడమేగాక వైద్య పరీక్షలకు కూడా సరైన పద్దతిలో పంపలేదు. ప్రభుత్వానికి సిగ్గు, శరం ఉంటే ఆ రోజే రాజీనామా చేసేవారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు ఎక్కడికక్కడ స్పందించి రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకు అందరి తలుపులు తట్టాకగానీ ఎంపి బయటపడలేకపోయారు. రఘురామ కృష్ణంరాజును పోలీసు సైకాలజీని క్రూరంగా ఉపయోగించి రాత్రంతా కొట్టి… బయటకు చెబితే చంపుతామన్నారు. చివరకు ఆయనను వైద్యం కోసం ఆర్మీ హాస్పటల్ కు పంపాల్సి వచ్చింది. బాబాయ్ ని హత్యచేసి నారాసుర రక్తచరిత్ర అని నాపై తప్పుడు రాతలు రాశారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకే మా సోషల్ మీడియా కార్యకర్తలను అడ్డగోలుగా అరెస్ట్ చేస్తున్నారు. నాపై తప్పుడు రాతలు రాసిన సాక్షి యాజమాని భారతీరెడ్డిని అరెస్ట్ చేయరా?
600 మంది టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు
వైసిపి అధికారంలోకి వచ్చాక 600మంది టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు…120మందిని జైల్లో పెట్టారు. 41ఎ నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా వ్యవహరించారు. పట్టాభి వంటి కేసులో మెజిస్ట్రేట్ పై ఎంక్వయిరీ చేయమన్నారు. నిన్న జరిగిన సంఘటనలు పరాకాష్ట. కళంకిత అధికారులు ఎవరైతే ఉన్నారో… ఎవరిపై ఆరోపణలు ఉన్నాయో, ఎవరు సైకో ప్రవర్తన కలిగి ఉన్నారో అటువంటి పోలీసు అధికారులను ఆయుధంగా చేసుకొని వారితో తప్పుడు కేసులు పెట్టి ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఇష్టప్రకారం చేయాలనుకుంటే ఆటలు సాగనివ్వం. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. ఎన్ని వేలమందిని కొడతారు? ఎన్ని లక్షలు, కోట్లమందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం. ఎన్నిసార్లు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తారో చూద్దాం.
పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిలదీస్తా… న్యాయం కోసం రోడ్డెక్కుతా!
నిబంధనలను ఉళ్లంఘించి మా వారిని హింసించే అధికారం ఎవడిచ్చాడో మీ స్టేషన్ కు నేనే స్వయంగా వచ్చి నిలదీస్తా… అవసరమైతే రోడ్డెక్కుతా…సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టేది లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను…మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను…22 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ మాది. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే…ఈ విషయాన్ని పోలీసులంతా గుర్తు పెట్టకోవాలి. సిన్సియర్ గా పనిచేసేవారిని అభినందిస్తాం. మా పోరాటం మీతో కాదు… రాజకీయ ప్రత్యర్థులతో మాత్రమే. తప్పుడు కేసులుపెట్టే వారిపై రాజీలేని పోరాటం చేస్తాం. కావాలని తప్పుడు కేసులు పెట్టి టార్చర్ చేస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే నేనే పోలీసు స్టేషన్ కు వస్తా… మీ సంగతి చూస్తాం. రాబోయే మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం. 27 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా…ఎప్పుడు ఇంతటి నీచపరిపాలన చూడలేదు. వారు చెప్పినపుడల్లా తలాడిరచి మీరు బలిపశువులు కావద్దు.
డీజీపీ, సిఐడి చీఫ్ సమాధానం చెప్పండి!
మా ఫ్రీలాన్సర్ సాంబశివరావు భార్య బాలింత. తన బిడ్డకు పాలు ఇస్తుంటే పోలీసు ఆ గదిలోకి ఎలా వెళతారా..అసలు మీకు మానవత్వం ఉందా? దీనికి డీజీపీ, సీబీసీఐడీ చీఫ్ సమాధానం చెప్పాలి. సాంబశివరావు కులంతో మీకేం పని? కాపు కులంలో ఎలా పుట్టావురా అని ఎందుకు అడిగారు? మీరు ఏమైనా డిక్టేటర్లా? పిచ్చి పట్టిందా? సైకో పాలనలో మీరు కూడా సైకోల్లా మారిపోయారు. ఇంటి తలుపులుగడ్డ పలుగులతో పగులకొట్టడం, వీడియోలు తీస్తున్నారని లైట్లు పగులకొట్టడం ఏంటి? మొత్తం ఫోన్లు అన్నీ లాగేసుకున్నారు. వెంకటేష్ ను లాక్కెళుతుంటే అడ్డుపడిన తన సోదరిని బలవంతంగా నెట్టేసి ఇంటి గదిలో పెట్టి తలుపు మూసేశారు. ఇది అరాచకం కాదా? అర్థరాత్రి అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లడం ఏంటి?
టిడిపి నేతలపై ఎంతకాలం వేధింపులు?
అమ్మఒడిపై ప్రశ్నించిన గౌతు శిరీషపై తప్పుడు కేసు పెట్టి వేధించారు. కదిరి ఎమ్మెల్యే ఓబుల రెడ్డి పనితీరును ప్రశ్నించిన వ్యక్తి ఉగాండాలో ఉంటే…70సంవత్సరాల తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అరాచకాలు, దందాలను సోషల్ మీడియాలో బయటపెట్టినందుకు నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఉండవల్లి అనూషను సీఐడీ కేసులతో ఇబ్బందులకు గురిచేశారు. 70సంవత్సరాల వయస్సు ఉన్న ఎన్జీఓ రంగనాయకమ్మపై సీఐడీ కేసులు పెట్టి వేధించారు. నలంద కిషోర్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి కరోనా అంటించి పంపి చంపేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతిపై నిలదీసిన అక్కోజి వినోద్ ను కొట్టి, తప్పుడు కేసులు పెట్టారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య అక్రమాలను ఎత్తిచూపిన మణిరత్నంను అరెస్టు చేసి బెదిరింపులకు గురిచేశారు. రాజమండ్రిలో వై సురేష్ ను ఇబ్బంది పెట్టారు. పోలీసులు చట్టప్రకారం పనిచేయడం నేర్చుకోండి…పోలీసు కస్టడీలో టార్చర్ మానండి. ప్రైవేటు కేసులు వేస్తాం, చట్టం ముందు నిలబెడతాం. కళంకిత ఆఫీసర్లను అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తే..మేమూ అదేవిధంగా ప్రవర్తిస్తాం. మీరు చట్టప్రకారం వ్యవహరించకపోతే మేమెందుకు చట్టాలను గౌరవించాలి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోం.
హతుడి భార్యను బెదిరిస్తారా… మీరు పోలీసులేనా?
మీడియా ప్రశ్నలకు చంద్రబాబు స్పందిస్తూ….ఉదయగిరిలో దళితుడైన నారాయణ చనిపోతే అతని భార్యను పోలీసులు బెదిరించారు. అతని భౌతికకాయాన్ని పూడ్చిపెడితే రీ పోస్టు మార్టం చేసే అవకాశం ఉందని బయటకు తీసి తగులబెట్టారు. అక్కడ ఐపీఎస్ అధికారి ఉన్నారా? గుర్తు పెట్టుకోండి. ఏదీ మరిచిపోం…తప్పు తప్పే…మేం అధికారంలోకి వచ్చాక దేన్నీ విడిచేది లేదు. నారాయణ మా పార్టీ కాకపోయినా ఆ కుటుంబానికి మేం అండగా నిలబడ్డాం. సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాద్యత రాజకీయ పార్టీగా మాకు బాధ్యత ఉంది. ఎంత మందిని ఈ పోలీసులు చంపుతారో నేను రేపట్నుంచి చూస్తాను. నాలో మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దు. మీరు మాకు సహకరించాలి, రౌడీలకు కాదు. వెంకటేష్ ను హింసించిన సిఐడి సిఐ జగదీష్ తప్పించుకోలేరు. అన్యాయంగా ప్రవర్తించిన వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం.
ఎంపిని రాష్ట్రానికి రానీయ్యరా?
రాష్ట్రానికి వస్తే అక్రమంగా కేసులు పెడతారని భయపడి ఎంపీ రఘురామకృష్ణరాజు ముందుగానే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం, మంత్రులకు సిగ్గు అనిపించడం లేదా? ఎమ్మెల్యేలకు బాధ అనిపించలేదా? రానున్న కాలంలో మీరు రాష్ట్రంలో ఉండరా? వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలకు రానున్న కాలంలో ముకుతాడు వేస్తాం. అధికారంలో ఉన్నవారు అన్యాయంగా వ్యవహరిస్తే… అడ్డగోలు పరిపాలన చేస్తుంటే ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం. అది తమ బాధ్యత అని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.