.ప్రకృతి సంపద యథేచ్చగా దోపిడీచేస్తున్న వైసిపి దొంగలు
.రుషికొండ, గజ్జలకొండ, మడ అడవుల విధ్వంసం
.పోలీసులు ఉన్నది మైనింగ్ మాఫియాను రక్షించడానికా?
.ప్రజలు చైతన్యవంతులై అక్రమ దందాను అడ్డుకోవాలి
.భావి తరాలకు నష్టం చేకూర్చే ఏ ఒక్కరిని వదలం
.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
అమరావతి: రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన గత మూడేళ్లలో జగన్ రెడ్డి గ్యాంగ్ ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను యథేచ్చగా దోచుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ప్రారంభానికి ముందు వైసీపీ నాయకులు చేసిన అక్రమ మైనింగ్ పై కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. అక్రమ మైనింగ్ కోసం ప్రకృతి సంపదను విధ్వంసం చేసిన చిత్రాలను చూసి చలించిన చంద్రబాబునాయుడు అక్రమార్జన కోసం ఇంతదారుణంగా విధ్వంసానికి పాల్పడిన వారు మనుషులేనా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలోని కొండల్ని తవ్వేసి చెరువులుగా మారుస్తూ భవిష్యత్ తరాలకు తీరని నష్టం కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రకృతి సంపదను అడ్డుగోలుగా దోచుకుంటున్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తిలేదని చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. సహజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలన కోసం ఐఏఏస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ను, శాంతి భద్రతల పరిరక్షణకు ఇండియన్ పోలీసు సర్వీస్, అడవుల రక్షణ కోసం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ను ఏర్పాటు చేశారు. ఎవరికి వారు ఇష్టానుసారం అడవులను నాశనం చేస్తే వాతావరణం సమతుల్యం దెబ్బతిని భావితరాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు.
దోపిడీకోసం రుషికొండకు గుండుకొట్టించారు!
జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కొండల్ని తవ్వేసి చెరువులుగా చేసేశారు. చెట్లు నరికినా మళ్లీ పెంచగలరు కానీ కొండల్ని తవ్వేస్తే ఎలా పెంచగలమని గతంలో కోర్టు వ్యాఖ్యానించింది. వైసీపీ నేతలు ధన దాహంతో రాష్ట్రంలోని కొండల్ని తవ్వేస్తున్నారు. విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండను వైసిపినేతల దోపిడీకోసం నాశనం చేశారు. పూర్వం రుషికొండ పై మునులంతా తపస్సు చేశారని చెబుతుంటారు. అలాంటి చారిత్రక కొండను గుండుకొట్టించారు. దీనిపై ఎన్.జి.టి ఉత్తర్వులిస్తే సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే బరితెగింపు ఏముంటుంది? ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అయిదేళ్లు రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండి పాలన సాగించాలని ఎన్నుకున్నారే తప్ప దోచుకోమని కాదు. ఇది ఒక్క విశాఖ సమస్య కాదు… రాష్ట్ర ప్రజలందరి సమస్య. నేను రుషికొండ వెళ్తే వారి తప్పులు బయటపడతాయన్న భయంతో నన్ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇలా మొత్తం రాష్ట్రంలో 75చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇసుకను సైతం నిబంధనలకు విరుద్దంగా ఇష్ణానుసారంగా తవ్వేసి అమ్ముకుంటున్నారు.
చారిత్రక రవ్వలకొండను తవ్వేశారు!
కర్నూలు జిల్లా బనగానపల్లెలో బ్రహ్మం గారు కాలజ్నానం రాసిన రవ్వల కొండను సైతం తవ్వేశారు. ఇది ఆయనకు ముందే తెలిసి ఉంటే నా కొండను కొట్టేసేవారని తన కాల జ్నానంలో రాసి ఉండేవారేమో. బ్రహ్మంగారి జీవిత చరిత్రపై ఎన్టీఆర్ సినిమా సైతం తీశారు. కానీ ఏ మాత్రం ఆ సెంటిమెంట్ లేకుండా రవ్వల కొండను తవ్వేయటం దుర్మార్గం. కాకినాడలో మడ అడవుల్ని నాశనం చేశారు. టీడీపీ హయాంలో మడ అడవుల అభివృద్దికి కృషి చేశాం. తుపాన్లను అడ్డుకునే శక్తి మడ అడవులకు ఉంది. వాటి రక్షణకు ఒక విభాగం ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ ఈ అడవుల్ని కూడా జగన్ రెడ్డి గ్యాంగ్ నాశనం చేసింది. దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పోలవరం కుడికాలువ గట్టును సైతం తవ్వేశారు. టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయలతో కాలువలు నిర్మించాం. కానీ నేడు ఆ మట్టి అంతా తవ్వేసి కాలువలకు రక్షణ లేకుండా చేశారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి సరిహద్దుల్లో తమ సొంత కంపెనీ భారతి సిమెంట్ కోసం రూ. 15 వేల కోట్ల విలువైన లాటరైట్, బాక్సైట్ దోపిడికి పాల్పడుతున్నారు. దీనిపై పలువురు సామాజికవేత్తలు, టీడీపీ నేతలు ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తే.. ఎన్జీటీ బృందం వచ్చి పరిశీలించింది, కానీ అక్కడ అక్రమ మైనింగ్ మాత్రం ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి? కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మైనింగ్ జరిగే ప్రాంతానికి పరిశీలించేందుకు నన్ను కూడా అనుమతించలేదంటే ఎంత కండకావరం? ఇకపై వైసీపీ రౌడీయిజం చేయాలనుకుంటే కుదరదు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలే మిమ్మల్ని తరిమికొట్టే రోజులొచ్చాయి. టీడీపీ హయాంలో కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో హెర్బల్ ప్లాంట్స్, చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి పర్యావరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశాం. కానీ నేడు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాఫియా నాయకుడిగా మారి దగ్గరుండి చెట్లు కొట్టిస్తున్నారు. అన్ని శాటిలైట్‌లో అక్కడ చిత్రాలు భద్రంగా ఉన్నాయి, తప్పు చేసిన వారిని ఎవరినీ వదలం. ఆధారాలతో సహా చట్టం ముందు దోషులుగా నిలబెడతాం.
ఇసుక మాఫియావల్ల 62 నిండుప్రాణాలు బలి!
వైసీపీ నేతల ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాం కోట్టుకుపోయి 62 మంది నిండు ప్రాణాలు పోయాయి. అక్కడ ఇంతవరకు పునరావాసం కల్పించలేదు. ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదంటే ఈ అసమర్ధ ముఖ్యమంత్రిని ఏమనాలి? పొన్నూరు నియోజకవర్గం అనుమర్లపూడిలో అక్రమ మైనింగ్ ని అడ్డుకునేందుకు వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారు. పోలీసులు ప్రభుత్వ ఆస్తులు రక్షిస్తారా? లేక మైనింగ్ మాఫియాకు సహకరిస్తారా? చిత్తూరు జిల్లా బండపల్లిలో కొండను చెరువును చేశారు. కాకినాడ సమీపంలోని పెద్దాపురంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో భారీకొండను పిండిచేశారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో రోజుకు 300 ట్రిప్పర్ల గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారు. కడప చలమారెడ్డి పల్లిలో కొండను మాయం చేశారు. తూ.గో జిల్లా వేమగిరి కొండల్ని చెరువుగా మార్చారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో అక్రమ మైనింగ్ ని అడ్డుకునేందుకు వెళ్లిన దేవినేని ఉమాను అరెస్టు చేశారు. విజయనగరం నెల్లిమర్ల కొండలు ఆహ్లాదరకరంగా ఉంటాయి. అటువంటి వాటిని మాయం చేశారు.
మైనింగ్ మంత్రి నేతృత్వంలోనే అక్రమమైనింగ్!
అనంతపురం జిల్లాలో పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వేస్తున్నారు. పీలేరులో కొండల్ని చెరువులు చేశారు. గుంటూరులో లాం గ్రామంలో కొండ మెత్తం తవ్వేశారు. హైదరాబాద్ లో ఉన్న సుందరమైన కొండలు మన అమరావతికి ఉన్నాయి. ఆ కొండలన్నింటినీ నాశనం చేశారు. భావి తరాల భవిష్యత్ తో ఆడుకునే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 75 చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఎంతమందిని అరెస్ట్ చేసినా వీటిని అడ్డుకునే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడి తీరుతుంది. అధికారులు వైసీపీ నేతలు చెప్పినట్టు తలాడిరచి భవిష్యత్ తరాలకు, రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్ లో చర్యలు తప్పవు. పారెస్ట్, మైనింగ్ రెవిన్యూ డిపార్టమెంట్లకు చెందిన అధికారులు ఎవరి హయాంలో అక్రమ మైనింగ్ జరిగిందో వారందరూ వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు తప్పుడు రికార్డులు చూపించి తప్పించుకున్నా భవిష్యత్తులో మాత్రం అటువంటి వారికి ఇబ్బందులు తప్పవు.
భారతీ సిమెంట్ కోసం అడ్డగోలుగా అక్రమ మైనింగ్!
తూర్పుగోదావరి – విశాఖ జిల్లాల సరిహద్దుల్లో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రతిరోజూ వెయ్యి లారీల లాటరైట్ ను అటవీచట్టాలను ఉల్లంఘించి యథేచ్చగా మైనింగ్ చేస్తూ తరలిస్తున్నారు. దీనిని అడ్డుకున్న టిడిపి నేతలపై కేసులు పెడతారా? మైనింగ్ ను అడ్డుకున్న వారిపై ఎక్కడిక్కడ కేసులు పెట్టి బెదిరిస్తారా? చిత్తూరు జిల్లా సత్యవేడులో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకుని, కోర్టుకు వెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెద్దిరెడ్డి అనుచరులు బెదిరించడం, పోలీసులు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్ జరిగేచోటుకు వెళ్లిన సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తల్ని మంత్రులు బెదిరింపులు, అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కంచే చేనుమేసిన చందంగా మైనింగ్ శాఖ మంత్రే ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అక్రమ మైనింగ్ చేసే వ్యక్తులకు అనుమతులు ఇచ్చి వారికి అండగా నిలుస్తున్నారు. మంత్రి ఇదే పంథాలో పోతే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని చంద్రబాబునాయుడు హెచ్చరించారు.
జగన్ రెడ్డిపై ప్రజల్లో ఏహ్యభావం!
సీఎన్‌ఓఎస్ సర్వేలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 20వ స్థానంలోకి వెళ్లారు…ప్రజలకు ఆయన మీద కంపరం పుట్టింది. వైసీపీ దోపిడీకి అడ్డొస్తున్నామని టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయింది. రాష్ట్ర ప్రజలు కూడా పునరాలోచించుకోవాలి. వైసీపీ ధన దాహానికి ప్రకృతిని కూడా వదలరా? మద్యంపైన వేలకోట్లు దోచుకుంటున్నారు. రాష్ట్రం మరో శ్రీలంక కాకుండా వైసీపీ దుష్ట పరిపాలన నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కలిసి పోరాడడానికి ముందుకు రావాలి. అందరం చైతన్యవంతులం అవుదాం. మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యకార్యదర్శులు అక్రమ మైనింగ్ పై సమాధానం చెప్పాలి. ప్రతి అక్రమ మైనింగ్ ను నేను రుజువుచేస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారో, లేదో చెప్పాలి? చర్యలు తీసుకోకుంటే చరిత్ర హీనులుగా మారతారు. వైసీపీ ఆటలు సాగనివ్వం. 75చోట్ల అక్రమ మైనింగ్ ను అడ్డుకుంటాం. ప్రకృతి సంపదను కాపాడుకుంటాం. ప్రభుత్వ అక్రమ మైనింగ్ ను తీవ్రంగా గర్హిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్లీనరీ కోసం పరీక్షలు వాయిదా వేస్తారా?
వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రలు చౌకబారు విమర్శలు చేయడానికి దిగజారిపోయారు. కొండలన్నీ మేమే తవ్వేశామని కూడా చెప్పడానికి వారు వెనకాడరు. గడపగడపకు ప్రభుత్వం ఎత్తిపోయింది. వైసీపీ ప్లీనరీల్లో కుర్చీలు గాల్లో ఎగిరాయి. ప్లీనరీకి స్కూల్ బస్సులు తీసుకురావడానికి మీకేం అధికారం ఉంది, వాటికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? ఆర్టీసీ బస్సులు వినియోగించడంలో మీకొక హక్కు, మాకొక హక్కా? ప్లీనరీకి బస్సులన్నీ తీసుకెళ్లి వైసీపీ రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మా మీటింగులకు గ్రౌండ్లు ఇవ్వడం లేదు. మీ ప్లీనరీ కోసం విద్యార్థుల పరీక్షలు వాయిదా వేస్తారా? అధికారులు వైసిపికి సేవలందించడానికి ఉన్నారా? ఇది రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. అధికారం చేతిలో ఉంది కదా అని ఏది చేస్తే అది చెల్లుతుందని అనుకుంటే చెల్లదు.
అన్నీ వదిలేసినోడికి బాధ్యత ఏముంటుంది?
రాష్ట్రప్రజల బాగోగులు చూసుకోవడం పాలకుల బాధ్యత. గాలికొదిలేసి తిరగేవాడికి బాధ్యత ఏముంటుంది? తిత్లీ తుఫాను వచ్చిన సమయంలో పండుగలు ఉన్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా అధికారులను పెట్టుకుని పరిస్థితులు సరిదిద్దుకున్నాం. హుద్ హుద్ సమయంలో బస్సులో ఉండి పరిపాలన కొనసాగిస్తూ పరిస్థితులను చక్కదిద్దాను. కానీ ఈ ప్రభుత్వానికి వర్షాలు, తుఫాన్లు, పోలవరం, అమరావతి, ప్రజలు చనిపోయినా, ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పట్టడం లేదు. ప్రశ్నిస్తున్న మాపై కేసులు పెట్టడంపై మాత్రమే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ అసమర్థత వల్ల నేడు ప్రజలు వరదల్లో చిక్కుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముంపు ప్రాంత బాధితులకు పునరావాసం కల్పించి, పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు ప్రజలను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి ప్రజల బాగోగులపై స్పృహ లేదు. ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా పరదాలు చాటున దాక్కునే పరిస్థితి. ఇటువంటి చెడ్డ పనులు ఇలాగే కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్యాలెస్ నుండి బయటకు అడుగు పెట్టలేరని చంద్రబాబునాయుడు హెచ్చరించారు.