అనకాపల్లి: డ్రైవింగ్ రాని వారిని సీట్లో కూర్చోపెడితే వాహనం ఏమవుతుందో జగన్ పాలనలో రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే తయారైందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి క్విట్ జగన్- సేవ్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో అంతా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో రెండోరోజైన శుక్రవారం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగింది. తొలి రోజు బుధవారం చోడవరంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు రెండో రోజు అనకాపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ…రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో రివర్స్ లో పరుగులు పెడుతోందని ఎద్దేవా చేశారు. నిన్నటి సభలో పోలీసుల సమస్యలపై మాట్లాడితే వెంటనే ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేసిందని… ఉద్యోగుల గురించి పోరాటం చేసేది, గళమెత్తేది తామేనని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని… అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడుతున్న వారికి అంతకు అంతా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. స్థానిక కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అనకాపల్లిలోని చంద్రశేఖర కళ్యాణ మండపంలో పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.