టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగాబుధవారం జమ్మలమడుగు నియోజకవర్గం సలివెందుల గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో ఉన్న కోనేరుకు మరమ్మతులు చేసి, కోనేరు చుట్టూప్రహరీగోడ నిర్మించాలి. శ్మశానవాటికకు చుట్టూ ప్రహరీగోడ ఏర్పాటుచేయాలి. సుంకులాంబ గుడిపక్కన ఉన్న గ్రామపంచాయితీ స్థలంలో కమ్యూనిటీ హాలు ఏర్పాటుచేయాలి. సలివెందులలోని శంకర్ రెడ్డి కాలనీ నుంచి దేవగుడి వరకు డ్రైనేజి ఏర్పాటుచేయాలి. సలివెందుల నుంచి గ్రామ పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా రోడ్లు ఏర్పాటుచేయాలి. గ్రామంలో సిసి రోడ్లు నిర్మించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. గ్రామపంచాయితీలకు చెందాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.8660 కోట్లు దారిమళ్లించారు. జగన్ నిర్వాకం కారణంగా గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయితీల వద్ద నిధుల్లేని పరిస్థితి నెలకొంది. పలువురు సర్పంచ్ లు పరువు కోసం సొంతడబ్బులు ఖర్చుపెట్టి పనులుచేసి, బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టిడిపి హయాంలో ఫైనాన్స్ కమిషన్ నిధులకు అదనంగా రాష్ట్రప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ. సిమెంటు రోడ్లు, 30లక్షల ఎల్ ఇడి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేశాం. సలివెందుల గ్రామ కోనేరు, శ్మశాన వాటికలకు ప్రహరీగోడలు నిర్మిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.