విజయవాడ: ఏపీలో జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్ జరిగిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల డబ్బును దారి మళ్లించారని ఆరోపించారు. అదే విధంగా నిధులను మళ్లించి నాడు-నేడు పేరిట ప్రజల్ని మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని, అందులో కుంభకోణం జరిగిందన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్ మాట్లాడారు. ‘‘గత ఏడాది రూ.1050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి రూ.2400 కోట్లు ఖర్చు చేశారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్గా ఏర్పడ్డాయి. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలింది. విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల ఆరోపించారు. రాష్ట్రంలో వైకాపా పాలనలో అవినీతిని ఆధారాలతో నిరూపిస్తున్నాం. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయం. అవినీతిపై విచారణ జరిపి సీఎం జగన్ చర్యలు తీసుకోవాలి. టోఫెల్, పాలవెల్లువ పథకంలో అవినీతిని జనసేన బయటపెట్టింది. విద్యాశాఖలో జరిగిన అవినీతిని బయటకు తెస్తున్నాం. జగనన్న విద్యాకానుక పేరుతో ప్రవేశపెట్టిన కిట్స్లోనూ అవినీతి జరిగింది. ఢిల్లీలో ఐదు కంపెనీలపై ఈడీ దాడులు చేసింది. ఆ కంపెనీలే విద్యా కానుక కిట్లు సరఫరా చేస్తున్నాయి. టెండర్లు ఆ ఐదు కంపెనీలకే ఎందుకిచ్చారు? ఆ ఐదు సంస్థలు ఒక సిండికేట్ గా ఏర్పడి పిల్లలకు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నాయి. గ్లోబల్ విద్యార్థులను తయారు చేస్తామని మోసం చేశారు. నాడు-నేడులో రూ.16వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారు. రూ.6వేల కోట్లు గ్రాంట్లు వస్తే రూ.3,550 కోట్లే ఖర్చు చేశారు. మిగిలిన డబ్బును దారి మళ్లించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదు. వంటశాలలు, ప్రహరీ గోడలు నిర్మించకుండా దగా చేశారు. నిధుల మళ్లింపుపై కేంద్రం వెంటనే స్పందించాలని మనోహర్ కోరారు.