- పార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు, గౌరవం
- సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆరే మనకు స్ఫూర్తి
- టీడీపీ.. ఓ రాజకీయ యూనివర్సిటీ
- ఏ పార్టీ ముఖ్య నేతకైనా మూలాలు టీడీపీలోనే
- టీడీపీ పనైపోయిందన్న వారి పనే అయిపోయింది
- మొన్న జరిగింది ఎన్నికలు కాదు… రాక్షసుడితో యుద్ధం
- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతాం…
- కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తాం
- ఇసుక, మద్యంలో ఎవరూ తలదూర్చొద్దు
- ఎవరు తప్పుచేసినా మొత్తం పార్టీకి చెడ్డపేరు
- ఎమ్మార్పీ రేట్లకు మించి మద్యం విక్రయిస్తే చర్యలే
- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
- కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు ప్రారంభం
- తొలి సభ్యత్వం స్వీకరించిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చింది. తెలుగుజాతిని టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అన్న కోణాల్లో విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే తెలుగుజాతికి ప్రపంచవ్యాప్త కీర్తి సాధించిపెట్టారు. సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ వారసులుగా మనందరం ముందుకెళ్లడడం గర్వించదగ్గ విషయం’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేతల మీదుగా సభ్యత్వ కార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వైసీపీ నేతల దాడిలో ప్రాణాలు కోల్పోయిన, దాడులకు గురైన, ప్రమాదాల్లో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలతో జూమ్‌కాల్‌లో మాట్లాడారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
టీడీపీ సభ్యత్వమే సమాజంలో ఓ గుర్తింపు…గౌరవం
‘ఈరోజు పవిత్రమైన రోజు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పార్టీ పెట్టిన తొలినాళ్లలో రూపాయితో సభ్యత్వం ప్రారంభించాం. టీడీపీలో సభ్యునిగా చేరడంతో సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంటుంది. టీడీపీ సభ్యత్వం కార్డు పెట్టుకోవడమే ప్రతి ఒక్కరూ ఒక హోదాగా భావిస్తారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించాం. గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు కార్యకర్తల భాగస్వామ్యం, అభీష్టం మేరకు కమిటీలు వేశాం. టీడీపీ రాకముందు కొన్ని కుటుంబాలకే పరిమితమైన అధికారాన్ని సామాన్యులకు చేరువ చేశాం. చదువుకున్న యువతకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం. బలహీనవర్గాలను ప్రోత్సహించాం. టీడీపీ రాజకీయ విశ్వవిద్యాలయం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది నాయకులను తయారు చేశాం. రెండు రాష్ట్రాల్లో ఏ ముఖ్య నాయకుడిని చూసినా వారి మూలాలు టీడీపీతోనే ప్రారంభమయ్యాయి. రాజకీయ కార్యకర్తలకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించిన ఏకైక పార్టీ మనది. కార్యకర్తలను నాయకులుగా చేయడానికి అనునిత్యం పనిచేశాం. ఎంతోమంది ప్రమాదాలు, రాజకీయ కక్షల్లో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి కుటుంబాల్లోని పిల్లలు అనాధ కాకూడదని, వారి కోసం ప్రత్యేకంగా స్కూల్ నడిపిన ఏకైక పార్టీ టీడీపీ. వందలమందిని చదివించి వారి జీవితాల్లో వెలుగులు నింపాం. దేశంలోనే మొదటిసారి బీమా విధానాన్ని తీసుకొచ్చాం. రూ.100లతో సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల బీమా అందించబోతున్నాం. సహజ మరణం జరిగిన వారికి మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు అందిస్తాం. కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి లైఫ్ టైం సభ్యత్వం తీసుకుంటున్నారు. కార్యకర్తల కోసం రూ.120 కోట్లు ఖర్చు చేశాం. 5,113 మందికి రూ.102 కోట్లను బీమా సొమ్ము కింద అందించాం. సహజ మరణం పొందిన వారికి రూ.18 కోట్లు ఖర్చు చేశాం. పేద పిల్లల చదవులకు రూ.2.5 కోట్లు, 180 మందికి విదేశాల్లో చదివే వారికి ఆర్ధిక సాయం చేశాం. ఎన్టీఆర్ ట్రస్ట్, ఇతర స్కూళ్లలో 4,732 మందిని చదివించే బాధ్యత తీసుకున్నాం. అన్ని పార్టీలకంటే మనపార్టీ భిన్నం. అధికారం కోసం నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదు. ఓటర్లకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో కొత్త వ్యవస్థలైన క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలను తీసుకొచ్చాం. పార్లమెంట్‌లో కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాం. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల ద్వారా ప్రధానులను నిర్ణయించాం’ అని చంద్రబాబు అన్నారు.
మొన్న జరిగింది ఎన్నికలు కాదు… రాక్షసుడితో యుద్ధం
‘నాలుగు దశాబ్ధాల ప్రస్తానంలో అనేక సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. చాలామంది టీడీపీ పనైపోయిందన్నారు. కానీ ఆ మాట అన్నవారి పనైపోయింది. టీడీపీని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మొన్నటి ఎన్నికల్లో మన శక్తి ఏంటో చూపించాం. సామాజిక సమీకరణాలతో ముందుకెళ్లి అన్ని కులాలకు ప్రాధాన్యమిచ్చాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించాయి. పార్టీ ఇచ్చిన పిలుపు అందుకుని ప్రతి కార్యకర్త ఎన్డీయే విజయానికి కృషి చేశారు. మొన్న జరిగింది ఎన్నికలు కాదు… రాక్షసుడితో యుద్ధం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు వస్తారని ఊహించలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా… మొన్నటి ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల విజయమే. వేధింపులు, కేసులు, అరెస్టులు, దాడులతో ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టారు. అయినా ఏ నాయకుడూ వెనక్కి తగ్గలేదు.. ఎవరూ జెండా వదల్లేదు. చాలామంది ప్రాణాలు, ఆస్తులు కోల్పోయారు. మనపై రెండు ప్రధాన బాధ్యతలున్నాయి. రాజకీయంగా త్యాగాల చేసిన వారిని కాపాడుకోవాలి. నమ్మిన ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. నేను ఇప్పుడు 1995నాటి సీఎంని… 2014 సీఎంను కాదు. 1995లో సీఎం అయ్యాక పార్టీ, ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా ముందుకు నడిపించాం. కార్యకర్తలు, నాయకుల్లో నాడు మనోధైర్యం నింపాం. అధికారులు కూడా పని చేయకపోతే చర్యలు తీసుకున్నాం. ఎవరైనా రాజకీయ ముసుగులో తప్పులు చేస్తే వదిలిపెట్టను. వ్యక్తిగత అంశాలను పార్టీ కక్షలుగా తీర్చుకుంటామంటే సమస్యలు వస్తాయి. ప్రజలపట్ల మనకున్న విశ్వసనీయతను పోగొట్టుకోవడం రెండు నిమిషాలు. కొందరు సమాచారాన్ని ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. నాలుగోసారి సీఎం అయిన నేను ఇంతటి అస్తవ్యస్త పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదు. విధ్వంసం నుండి గాడిలో పెట్టాలంటే సమయం పడుతోంది. గత పాలకుల విచ్చలవిడి తప్పులతో ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాం. నాసిరకం, సొంత బ్రాండ్లతో మద్యం సరఫరా చేసి గత పాలకులు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. అందుకే నూతన మద్యం పాలసీ తెచ్చాం. ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. మనం వచ్చాక ఉచిత ఇసుక పాలసీని తెచ్చాం. సీనరేజ్, లోడిరగ్ ఛార్జీలు రద్దు చేశాం. వైసీపీ నేతలు రూ.30లకే ఇసుక తోడుతామని టెండర్లు వేశారు. ఇసుక పాలసీపై తప్పుడు సంకేతాలు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇసుక విషయంలో ఎవరు దందా చేసినా తిరుగుబాటు చేయండి. ఇందులో మనవాళ్ళు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. మద్యం ఎమ్మార్పీ రేట్లకంటే ఎవరు ఎక్కువ అమ్మినా చర్యలు తీసుకుంటాం. కొందరు ముసుగులో నేరంచేసి దాన్ని మనపై నెట్టే ప్రయత్నం చేస్తారు… అప్రమత్తంగా ఉండాలి’ అని చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.
సమపాళ్లలో అభివృద్ధి-సంక్షేమం
‘జాబ్ ఫస్ట్ విధానం కోసం ఆరు కొత్త పాలసీలు తీసుకొచ్చాం. అధికారంలోకి రాగానే రూ.4 వేలు పెన్షన్ అమలు చేశాం. ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ పేదలపై ప్రేమతో అత్యధిక పింఛన్లు అందిస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ బాధితులకు రూ.10 వేలు, శాశ్వత వ్యాధితో బాధపడేవారికి రూ.15 వేలు అందిస్తున్నాం. దీపావళి నుంచి యేడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పథకాన్ని ప్రారంభిస్తున్నాం. చెత్తపన్ను రద్దు, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు, 217 జీవో రద్దు చేశాం. గౌడలకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. అర్చకులకు జీతాలు రూ.10 వేల నుండి రూ.15 వేలకు పెంపు, దేవాలయాల్లో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణులకు ఆలయ కమిటీల్లో స్థానం కల్పించాం. దీప దూప నైవేద్యాలకు రూ.10 వేలు అందిస్తున్నాం. చేనేతపై జీఎస్టీ ఎత్తేశాం. అధికారంలోకి రాగానే రైతుల ధాన్యం బకాయిలు రూ.1674 కోట్లు చెల్లించాం. రూ.4,500 కోట్లతో గ్రామాల్లో 30 వేల పనులకు శ్రీకారం చుట్టాం. డిసెంబర్ నెల నుండి పూర్తిస్థాయిలో రాజధాని పనులు ప్రారంభమవుతాయి. రెండేళ్లలో పోలవరం పేజ్`1 పూర్తి చేస్తాం. ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం. రైల్వే జోన్ ఏర్పాటుకు సమస్యలు పరిష్కరించి భూమి కేటాయించాం. అమరావతికి కొత్త రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటిస్థలం ఇవ్వబోతున్నాం. ప్రజల కోసం మనం కష్టపడుతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్ళలో ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది.. ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తాం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. జనవరిలోపు రోడ్లపై గుంతల పూడ్చాలని టార్గెట్ ఇచ్చాం. విజయవాడ వరద బాధితులకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రూ.25 వేలు సాయం అందించాం. 10 రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్‌లో ఉండి పరిస్థితిని చక్కదిద్దాం. 4.16 లక్షల మంది బాధితులకు ఆర్థిక సాయం అందించాం. కార్యకర్తలు, నేతలపై పెట్టిన తప్పుడు కేసులను కూడా చట్టపరంగా పరిష్కరిస్తాం. నా చుట్టూ కాకుండా నేతలు ప్రజలు, కార్యకర్తల చుట్టూ తిరగాలి. పని చేసే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుంది’ అని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.