గడచిన ఐదేళ్లల్లో.. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎంఎస్‌ఎంఈలు కుదేలయ్యాయి. సూక్ష్మంగా చెప్పాలంటే.. వైసీపీ సర్కారు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గొంతునొక్కింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఎంఎస్‌ఎంఈ వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేదిశగా పన్డీయే సర్కారు సంకల్పించడం శుభపరిణామం. వాస్తవానికి ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు అనువైన, అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో లేకపోలేదు. ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటుకూ అపారమైన అవకాశాలున్నాయి. అయినా.. ఈ రెండు విభాగాలను సమర్థంగా నడిపించడంలో గత వైసీపీ సర్కారు ప్రదర్శించిన నిర్లక్ష్యమే.. వీటిని సంక్షోభంలోకి నెట్టింది. ప్రధానంగా ప్రోత్సాహకాల కోసం ఎంఎస్‌ఎంఈలు ఎదురు చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చి.. పారిశ్రామిక ప్రగతిపైనే ఉక్కుపాదం మోపింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సహించేందుకు కేంద్రం విడుదల చేసే నిధులను దారి మళ్లించడం.. ఎంఎస్‌ఎంఈలకు వైసీపీ చేసిన పెద్ద ద్రోహం. ప్రభుత్వ ఆదరణ కరవైన పరిస్థితిని గ్రహించిన చిరు వ్యాపారులు.. పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపలేదు.
అప్పటికే ఆ రంగంలోవున్న వ్యాపారులు.. విద్యుత్ ఛార్జీల భారాలను భరించలేక పరిశ్రమలకు తాళాలు వేసుకున్నారు. ఎంఎస్‌ఎంఈల దుస్థితిని గ్రహించిన ఎన్డీఏ సర్కారు, ఇతోధిక ప్రోత్సాహకాలతో ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి చర్యలు మొదలుపెట్టింది. ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర సాయంతో రూ.వెయ్యి కోట్లు నిధని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్ర సాయం రూ.900 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు గురువారం జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడిరచారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు అనుసరిస్తున్న పీ4 విధానంతోపాటు పారిశ్రామిక పార్కుల్లో ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేసుకునేందుకు రైతులను, డ్వాక్రా సంఘాలను కూడా భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్’ కింద అందే లబ్దిని చిన్న పరిశ్రమలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం.. పంఎస్‌ఎంఈలకు కొత్త జవసత్వాలు నింపడమే. అంటే.. కేంద్రంనుంచి ఈ నిధికి అందే రూ.900 కోట్లు కలిపి.. మొత్తంగా వెయ్యికోట్ల నిధిని ఏర్పాటు చేయనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలివ్వడం.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న పరిశ్రమలకు చేయూతనందించడానికి ఈ నిధి ఉపకరిస్తుందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు యోచన.
ఎంఎస్‌ఎంఈ పార్కుల విస్తృతిపైనా దృష్టి
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ప్రధాన సమస్య భూమి. ఏపీఐఐసీ నిధులతో పార్కులను అభివృద్ధి చేయడం వల్ల వాటిలో భూముల ధరలు ఎక్కువ. చిరు వ్యాపారులు పరిశ్రమలు స్థాపనకు అదొక ఇబ్బంది. ఈ సమస్యను అధిగమించడానికి.. ప్రజా ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటును వేగవంతం చేస్తోంది. ఇప్పటికే పెండిరగ్‌లోవున్న ఎంఎస్‌ఎంఈ పార్కులను త్వరతగతిన పూర్తి చేయాలని.. గురువారం ఆ శాఖను సమీక్షించిన సీఎం చంద్రబాబు ఆదేశించడం అందులో భాగమే. ఎంఎస్‌ఎంఈ వాడలను ఆధునీకరించే చర్యలూ తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాలో కనీసం రెండు ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అదీ.. కొత్త జిల్లాల ప్రాతిపదికన రంగాలవారీగా 50 పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలూ సిద్ధమయ్యాయి. అలాగే, కొత్త జిల్లా ప్రాతిపదికన జిల్లా పరిశ్రమల కేంద్రాల్నీ సాంకేతిక సాయంతో అభివృద్ధి చేస్తారు.
జగన్‌రెడ్డి హయాంలోని చివరి ఆరు నెలల్లో.. ‘ఎంఎస్‌ఎంఈ ఏపీ వన్’ అంటూ సర్వే హడావుడికి తెరలేపాడు. ఆర్బాటమే తప్ప పూర్తి కాలేదు. అంతకుముందున్న పరిశ్రమల ఆధార్ సర్వేను సైతం గత వైసీపీ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది. ఎంఎస్‌ఎంఈల వ్యవస్థను విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్న కూటమి సర్కారు.. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండేలా ‘ఎంఎస్‌ఎంఈ వన్’ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఏదైనా పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? జిల్లాలో ఏతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముంది? మార్కెటింగ్ సదుపాయాలేంటి? తదితర సమాచారమంతా ఔత్సాహికులు యాప్‌నుంచే తెలుసుకోవచ్చు
ఎంఎస్‌ఎంఈల్లో రైతులకూ భాగస్వామ్యం
భూమివుండి ఏదోక చిన్న పరిశ్రమ స్థాపించాలనుకునే రైతన్నలే.. పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఆ పార్కుల్లో రైతులతోపాటు ఇతర సూక్ష్మ వ్యాపారులూ వ్యాపారాలు చేసుకొవచ్చు. అలా పార్కులు నెలకొల్పాలనుకున్న రైతులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందుతాయి. వీరితోపాటు డ్వాక్రా సంఘాలనూ పారిశ్రామిక పార్కులకు అనుసంధానించే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ప్రతిభ ఉండి పరిశ్రమలు పెట్టాలనుకునే డ్వాక్రా మహిళలకు అవకాశం ఇవ్వనుంది. దీంతో.. ఇంటివద్దనే వ్యాపారం చేసుకునేందుకు ఆస్కారముంటుంది. ఇంట్లోనే చిన్న వ్యాపారం పెట్టుకున్నా.. వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ప్రతి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు తోడ్పాటు అందించేందుకు ఉద్యమ్ సర్టిఫికేట్ వచ్చేలా చర్యలు తీసుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ చర్యలు ఎంఎస్‌ఎంఈల విస్తృతికి దారితీస్తాయన్నది ప్రభుత్వ యోచన. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మళ్లీ మంచిరోజులు వస్తున్నట్టే!
`మణిశంకర్