- రూ.433 కోట్ల ప్రజాధనంతో రుషికొండపై జగన్ కోసం విలాసవంతమైన భారీభవనం
- పేదల అవసరాలకు నిధులుండవు.. జగన్ ప్యాలెస్‌కు మాత్రం వందల కోట్ల ఖర్చు
- హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పులివెందుల, ఇడుపులపాయ, తాడేపల్లిలోని రాజభవనాలు సరిపోలేదా జగన్ రెడ్డి?
అమరావతి: రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాల్సిన ముఖ్యమంత్రే…ప్రజలసొమ్ముతో విలాస వంతమైన జీవితం గడపడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ప్రకృతి వనరుల దోపిడీపై జగన్ రెడ్డికి ఉన్న మోజు ఇంకా తీరలేదని, తన దోపిడీని మరింత యథేచ్ఛగా కొనసాగించడానికే ఆయన విశాఖపట్నంలో మకాం పెట్టబోతున్నాడన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
ప్రజారాజధాని అమరావతిని విధ్వంసం చేసిన జగన్ రెడ్డి … మూడు రాజధానుల నాటకమాడి చివరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని మండిపడ్డారు. మూడు రాజ దానుల ముసుగులో తన పార్టీ వారితో రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలు చేయించిన జగన్ రెడ్డి, తన దోపిడీని ఇకపై విశాఖ కేంద్రంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ క్రమంలో విశాఖపట్నంలోని రుషికొండపై రూ.433 కోట్లతో విలాసవంతమైన భారీ భవనాన్ని నిర్మింపచేస్తున్నాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక పోవడంతో రాష్ట్రంలో ఎవరూ రోడ్లు వేయడానికి, కనీసం మరమ్మతులు చేయడానికి కూడా ముందుకు రావడంలేదు. మరోపక్క ఆరోగ్యశ్రీ బిల్లుల తాలూకా బకాయిలు ఆసుపత్రులకు దాదాపు రూ.1000 కోట్ల వరకు బకాయి పెట్టడంతో పేదలకు వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చే అనేక రకాల చెల్లింపులు పక్కన పెట్టిన ముఖ్యమంత్రి తన విలాసాల కోసం ఏకంగా రూ.450 కోట్ల వరకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడానికి సిద్ధమవ్వడం నిజంగా బాధాకరమని చినరాజప్ప అన్నారు.
పర్యాటక ప్రదేశమైన రుషికొండను తన నివాసానికి అనుకూలంగా జగన్ రెడ్డి మార్చుకోవడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమే. అలానే రుషికొండపై తన విలాస జీవనం కోసం ముఖ్యమంత్రి నిర్మించుకుంటున్న రాజభవనం నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలముందు పెట్టకుండా దాచిపెడుతున్నాడు. నిర్మాణ ఖర్చుల తాలూకా బిల్లులను ఆన్ లైన్ లో ఉంచకపోవడంపై న్యాయస్థానం ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. దాంతో పనుల్ని చిన్నవిగా విడగొట్టి.. చిన్న మొత్తాల బిల్లుల వివరాలు అంటే రూ.100 కోట్లు.. ఆ లోపు పనులకే టెండర్లు పిలిచి ప్రభుత్వం రుషికొండపై జగన్ రెడ్డి రాజభవనాన్ని నిర్మిస్తోంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై ముఖ్యమంత్రి నివాసం కోసం భవననిర్మాణం సాగుతోందని చినరాజప్ప విమర్శించారు.
జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధిచెప్పాలి
జగన్ రెడ్డికి ఇప్పటికే హైదరాబాద్ లో లోటస్ పాండ్ (రూ.200కోట్ల విలువైన రాజభవనం), బెంగళూరులోని ఎలహంకలో మరో భారీ ప్యాలెస్ (రూ.350 కోట్ల విలువ) ఉన్నాయి. వాటితో పాటు చెన్నై, ఇడుపుల పాయ, తాడేపల్లిలో కూడా భారీ భవనాలు నిర్మించుకున్నాడు. అవి చాలవన్నట్టు ఇప్పుడు మరలా రుషికొండపై పర్యాటక భవనాల్ని నేలమట్టం చేసి మరీ తన రాజభవనాన్ని నిర్మించుకుంటున్నాడు. తన సుఖసౌఖ్యాలు… రాజభోగాల కోసం జగన్ రెడ్డి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి తీరుని.. నియంత్రత్వ పోకడల్ని ప్రజలు, ప్రతిపక్షాలు గమనించి, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధిచెప్పాలని చినరాజప్ప పిలుపు ఇచ్చారు.