ఒక పల్నాడులోనే 5గుర్ని బలి
జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డంకులు
నర్సరావుపేట, రావులాపురంలో టిడిపి నేతల బైఠాయింపు
ఎక్కడికక్కడే టిడిపి నేతల గృహనిర్బంధం
తాము వెనుకబడిన వర్గాలకు ఎంతో ప్రాతినిధ్యం ఇస్తున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాస్తవంలో గతమూడేళ్లుగా బిసిలపై పగబడ్డారు. గత మూడేళ్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన 37మంది టిడిపి నేతలు, కార్యకర్తలను వైసిపి ముష్కర మూకలు హత్యచేయగా, అందులో 26మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. తాజాగా పల్నాడులోని మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో టిడిపి బిసి నేత కంచర్ల జల్లయ్య యాదవ్ ను వైసిపి ముష్కరమూకలు కత్తులు, గొడ్డళ్లతో అత్యంత కర్కశంగా హతమార్చాయి. జగన్ అండ్ కో అడ్డగోలు అవినీతిని ప్రశ్నించిన ఎస్సీ, ఎస్టీ, బిసి నేతలను హతమార్చడం, దాడులకు దిగడం ద్వారా అణచివేత చర్యలకు పాల్పడుతున్న జగన్ రెడ్డి సామాజిక న్యాయం పేరుతో కొందరు తాబేదారులకు మంత్రి పదవులిచ్చి యాత్రలంటూ రాష్ట్రవ్యాప్తంగా తిప్పుతున్నారు. జగన్ రెడ్డి సామాజిక న్యాయం నేతిబీరలో నేయి చందమేనని తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. నరరూప రాక్షసుడిగా పేరొందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గంలో బీసీ నేతలను ఊచకోత కోస్తున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టించుకోలేదు. ఫలితంగా తాజాగా జల్లయ్య యాదవ్ ను కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు పొట్టనబెట్టుకున్నారు.
జల్లయ్య అంత్యక్రియలకు హాజరుకావడానికి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, బీద రవిచంద్ర, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, జివి ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, మహమ్మద్ నసీర్, కోవెలమూడి రవీంద్ర, అరవింద్ బాబు, డేగల ప్రభాకర్, బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యాలరావు, రావిపాటి సాయికృష్ణ, తదితరులను పోలీసులు ఎక్కడిడక్కడే అడ్డుకున్నారు. కొందరిని ఇళ్లనుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు.
మాకు చెప్పకుండానే పోస్టుమార్టం చేస్తారా?
నరసరావుపేటలో బంధువుల బైఠాయింపు
ఇదిలావుండగా పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు తెలియకుండానే జల్లయ్యకు పోస్టుమార్టం నిర్వహించారని ఆగ్రహిస్తూ.. వైద్యశాల ఆవరణలో జల్లయ్య కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు. దీంతో.. దాదాపు 3 గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసులు లాక్కెళ్లి బస్సు ఎక్కించారు. ఈ క్రమంలో.. మహిళా పోలీసులు, మహిళా ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. మహిళలని కూడా చూడకుండా చేయిచేసుకున్నారని జల్లయ్య బంధువుల ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుని బంధువులు, టిడిపి నాయకులను 2 బస్సుల్లో పోలీసులు తరలించారు. ఉద్రిక్తల మధ్యనే జల్లయ్య మృతదేహాన్ని బొల్లాపల్లి మండలం రావులాపురం తరలించారు. జల్లయ్య కుటుంబ సభ్యులు లేకుండా మృతదేహం ఎలా తీసుకుంటామని బంధువులు ఆందోళనకు దిగారు.
సాయంత్రం వరకు అంబులెన్స్ లో
జల్లయ్య శవాన్ని తిప్పిన పోలీసులు
పోస్టుమార్టం అనంతరం ఉదయం 11 గంటలు నుంచి సాయంత్రం 4గంటలకు జల్లయ్య శవాన్ని అంబులెన్స్ లో అటూఇటూ తిప్పుతూ పోలీసులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య శనివారం సాయంత్రం బొల్లాపల్లి మండలం రావులాపురానికి జల్లయ్య మృతదేహాన్ని తీసుకురాగా, జల్లయ్య బంధువులు, కుటుంబ సభ్యులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అంబులెన్స్ లో తండ్రి మృతదేహన్ని చూసి జల్లయ్య భార్య, కుమార్తె భోరున విలపించారు. పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానిక తెలుగుదేశం నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ జిల్లా నాయకులు జివి ఆంజనేయులు, బ్రహ్మ రెడ్డి ని అంత్యక్రియలు అనుమతి ఇస్తేనే మృతదేహానికి అంత్యక్రియలు చేస్తామని టిడిపి నాయకులు ,మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు డిఎస్పీ విజయభాస్కర్ హామీతో శనివారం సాయంత్రం జల్లయ్య కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో కుటుంబసభ్యుల అశ్రునయనాల నడుమ జల్లయ్య అంత్యక్రియలు రావులాపురంలో జరిగాయి. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం ఆదివారం రావులాపురం వెళ్లి జల్లయ్య కుటుంబాన్ని పరామర్శనుంది.