.గత నెలలో అప్పల రాజు, ఇప్పుడు ఉష శ్రీచరణ్
.అనుచరులను వెంటేసుకుని నేరుగా శ్రీవారి దర్శనం
.40 గంటలు క్యూలో ఉంటున్న భక్తులు
.దేవుడి వద్ద కూడా వైసీపీ మంత్రుల ఇష్టారాజ్యం
(చైతన్యరథం స్పెషల్ డెస్క్)
వైసీపీ మంత్రులకు దేవుడంటే లెక్కలేదు. భక్తీ లేదు. భక్తులంటే గౌరవంలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భక్తులు గంటల తరబడి లైన్లో నిలబడి శ్రీవారిని దర్శనం చేసుకుంటుంటే, గత నెలలో మంత్రి సిదిరి అప్పల రాజు, సోమవారం మరో మంత్రి ఉష శ్రీచరణ్ తమ అనుచరులను వెంటేసుకుని ప్రత్యేక దర్శనాలు, బ్రేక్ దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులు క్యూలో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకుండా గత నెలలో వీఐపీ ప్రొటోకాల్ సమయంలో మంత్రి అప్పల రాజు తన అనుచరులు 150 మందితో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఇది విమర్శలకు దారీ తీసినా, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా లెక్కచేయకుండా మరో మంత్రి ఉష శ్రీచరణ్ తానేమీ తక్కువ కాదన్నట్లు సోమవారం 50 మందిని వెంటేసుకొని శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 21 వరకు బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు రద్దు చేశారు. వారం రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సేవాసదన్ వరకు దాదాపు కిలోమీటర్ వరకు భక్తులు బారులుతీరారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టారు. అన్నప్రసాదాల పంపిణీ చేపట్టారు. ప్రతిరోజా దాదాపు 70వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం 92వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 40 గంటలకు పైగా సమయం పడుతోంది. చంటి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి ఉష శ్రీచరణ్ అధికారులపై ఒత్తిడి చేసి తన అనుచరులకు బ్రేక్ దర్శనాలు చేయించారు. మరో 10 మందికి సుప్రభాత సేవ టికెట్లను ఇప్పించారు. తిరుమలలో పరిస్థితిని అధికారులు మంత్రికి వివరించినా ఆమె వారిపై ఒత్తిడి చేసి అనుచరులకు బ్రేక్ దర్శనాలు ఇప్పించారు. మంత్రి వ్యవహార తీరుకు సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనం కోసం తాము రోజుల తరబడి నిల్చుంటే మంత్రి మధ్యలో జనాన్ని వెంటేసుకొచ్చి బ్రేక్ దర్శనాలు చేయించడం ఏమిటని మండిపడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన మీడియా ప్రతినిధుల పట్ల మంత్రి గన్‌మేన్ దురుసుగా ప్రవర్తించారు. రాష్ట్రంలోనే కాకుండా, దేవాలయాల వద్ద కూడా వైసీపీ నేతలు దుడుకుగా ప్రవర్తిస్తున్నారు. వారికి ప్రజలన్నా, భక్తులన్నా లెక్కేలేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సమయం, అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.