- నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపండి
- ఆడబిడ్డల విజయాలు ఎందరికో ఆదర్శం
- సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకూ మహిళలే
- మహిళాశక్తికి దార్శనికుడు అన్న ఎన్టీఆర్..
- ఆ దార్శనికతను ముందుకు తీసుకెళ్లింది చంద్రబాబు
- హెరిటేజ్ బాధ్యతలిచ్చినపుడు.. నేనూ భయపడ్డా
- చంద్రబాబు ప్రోత్సాహంతో నా శక్తి నేను గ్రహించా
- కూలికెళ్లే ప్రతి మహిళా నాకు ఆదర్శమూర్తే..
- మహిళా శక్తికి నిదర్శనమే మన దసరా పండుగ
- సంస్కృతీ, సంప్రదాయానికీ ప్రతీకే.. పండుగలు
- రాష్ట్ర ప్రజలందరికీ విజయాలు కలగాలి…
- రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి…
- శక్తి`విజయోత్సవంలో భువనమ్మ ఆకాంక్ష
- రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
- ఘనంగా సాగిన శక్తి`విజయోత్సవం
విజయవాడ (చైతన్య రథం): కష్టాలు, కన్నీళ్లను అధిగమించి విజయాలు సాధిచగల శక్తి ప్రతీ మహిళలో ఉందని, అది గ్రహించి ముందడుగువేస్తే విజయాలు వాటంతట అవే వస్తాయని ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహించిన శక్తి- విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘దేశ విదేశాల్లోవున్న తెలుగువారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ప్రజలంతా సంతోషంగా ఉండాలి. మన సంస్కృతీ సంప్రదాయాన్ని పదిమందికీ తెలియచేసే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. పండుగలు జరుపుకోవడమంటే మన సంస్కృతి, సాంప్రదాయాన్ని పదిమందికీ తెలియజెప్పడమే. ప్రతి పండుగా మనకొక ప్రత్యేకం. దసరా అంటే మహిళా శక్తికి నిదర్శనం. అందుకే దసరా పండుగ మహిళలకు ప్రత్యేకమైనది. మహిషాసురుడిని అంతం చేయడానికి త్రిమూర్తుల తేజస్సు నుండి ఉద్భవించిన ఆ మహాశక్తి, తొమ్మిది రోజులు యుద్ధం చేసి.. రాక్షస సంహారంతో విజయం సాధించిన రోజునే విజయదశమిగా జరుపుకుంటాం. నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. దసరా అంటే అందరికీ గుర్తుకొచ్చే క్షేత్రం ఇంద్రకీలాద్రి. అమ్మలగన్న అమ్మ మన దుర్గమ్మ చల్లని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు.
సాంకేతిక యుగంలో ఆడబిడ్డల విజయాలు ఎంతో ఆదర్శం
‘మహిళా శక్తిని గుర్తించే మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. మహిళల విజయాలను గుర్తించాలి, ప్రోత్సహించాలి. మనందరిలో ఎంతో శక్తి దాగి ఉంది. దానిని బయటికి తీస్తే ఆ ఫలితాలే గొప్పవి. సాంకేతిక యుగంలో ఆడబిడ్డల విజయాలు ఎంతో ఆదర్శంగా నిలిస్తున్నాయి. మహిళలు అంతరిక్షానికి కూడా వెళ్తున్నారు, యుద్ధ విమానాలు నడుపుతున్నారు, సైంటిస్టులు, ప్రజా నాయకులుగా విజయాలు అందుకుంటున్నారు. సర్పంచ్ నుండి రాష్ట్రపతి పదవి వరకు మహిళలు రాణిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మన దేశానికి ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము నేడు రాష్ట్రపతిగా ఉండడం గర్వించదగిన విషయం. ప్రభుత్వ, వ్యాపార రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి’ అన్నారు భువనమ్మ.
మహిళాశక్తిని ముందుగా గుర్తించింది అన్న ఎన్టీఆర్
‘మహిళలపై వివక్ష, చిన్నచూపు ఇంకా సమాజంలో ఉంది. ఎప్పటినుంచో వస్తున్న కొన్ని అపోహల కారణంగా పూర్తిస్థాయిలో మహిళాశక్తిని ఉపయోగించుకోవడం లేదు. మహిళా సాధికారత జరిగితే ఆ ప్రభావం కుటుంబాలపై ఉంటుంది. కుటుంబాలు బాగుంటే గ్రామాలు, రాష్ట్రాలు బాగుంటాయి. ఈ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. మహిళలకు అవకాశం కల్పించి, వారిని ప్రోత్సాహించాలి. మహిళలకు అవకాశాలు కల్పించాలని అన్న ఎన్టీ రామారావు దార్శనికతతో ప్రోత్సహించారు. దాంతో మహిళలు ఎన్నో రంగాల్లో విజయాలు సాధించారు. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితమే మగవారితోపాటు మహిళలకూ ఆస్తిలో సమాన హక్కు ఉండాలని, ఆడబిడ్డలకు హక్కు కల్పించిన దార్శనికుడు ఎన్టీ రామారావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి పెద్దఎత్తున ఆడబిడ్డలు వచ్చారు. ఆడబిడ్డల చదువు కోసం తిరుపతిలో తొలి మహిళ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత కాలంలో స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు, కళాశాలల్లో 33 శాతం రిజర్వేషన్‌ను మహిళలకు చంద్రబాబు కల్పించారు. మహిళలు వారి కాళ్లపై వారు నిలబడాలని డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చారు. ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలని ప్రతి కి.మీకు ఒక పాఠశాల నిర్మించారు. ఈరోజు మన ఆడబిడ్డ మగవారికి ధీటుగా ధైర్యంగా ఎన్నో కంపెనీల్లో ఉద్యోగాలకు వెళ్తుండడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఎన్నో సంస్థల్లో మహిళలు తమ సామర్ధ్యంతో ఉన్నత స్థానాలను చేరుకుంటున్నారు. డైరెక్టర్, సీఈవోలుగా ఎదిగి కంపెనీలను ముందుకు తీసుకువెళ్ళడం గొప్ప విషయం’ అన్నారు.
మన శక్తిని మనమే గ్రహించాలి
‘మన శక్తిని మనం తెలుసుకోవాలి. హెరిటేజ్ సంస్థను నాకు అప్పగించినప్పుడు నడపగలనా? అన్న సందేహం కలిగింది. కానీ చంద్రబాబు ధైర్యం చెప్పి, ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు. నీకంటే నేను బాగా నడపగలనా? అని నాతో అప్పుడప్పుడు అంటుంటారు. జీవితంలో, వ్యాపారాల్లో అనేక సవాళ్లు, అడ్డంకులు, కష్టాలుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడితేనే విజయం సాధిస్తాం. హెరిటేజ్‌లో నేనూ అనేక సవాళ్లు ఎదుర్కొన్నాను. కానీ ఇది నేను చేయగలను, నేను సాధించగలను అని ధైర్యంగా ముందుకెళ్లి విజయం సాధించాను. జీవతంలో పువ్వులు, ముళ్లూ రెండూ ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించగల శక్తి మనలో ఉంది. దాన్ని ప్రతి మహిళ గుర్తించి ముందుకెళ్ళాలి. ఒక అమ్మగా, భార్యగా, చెల్లిగా, అత్తగా, ఆడకూతురిగా భిన్నమైన బాధ్యతలు మనపై ఉన్నాయి. ప్రతి మహిళా ఒక శక్తిలా కుటుంబానికి మూలాధారంగా ఉండి నడిపిస్తోంది. అటువంటి మహోత్తర శక్తి మహిళల్లో తప్ప మరెవ్వరిలో లేదు. అందుకే మీ శక్తిని మీరు గుర్తించి, మిమ్మల్ని మీరు నమ్మండి, గౌరవించుకోండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది’ అని మహిళలకు భువనమ్మ పిలుపునిచ్చారు.
కూలికి వెళ్ళే ప్రతీ మహిళా నాకు ఆదర్శమే
‘దేశంలో నేడు ఉన్నతస్థానాల్లో ఉన్న అనేకమంది మహిళలు సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారే. వారినీ ఆదర్శంగా తీసుకోవాలి. వారిలో పట్టుదల, ధైర్యం, సాధించాలనే లక్ష్యం ఉన్నది గనుకే సాధించగలిగారు. మీలో ఉన్న ఆ దుర్గా శక్తిని గుర్తించండని ప్రతి మహిళను కోరుతున్నా. మీకు విజయం సిద్ధిస్తుంది. కావాల్సింది చిత్తశుద్ధి, పట్టుదలే. తన కుటుంబాన్ని నడిపించడానికి, పిల్లల చదువుకోసం కష్టపడి పనిచేసే ప్రతి సాధారణ మహిళా నాకు ఆదర్శమే. కుటుంబం కోసం కూలి పని చేసుకునే, పాలు అమ్ముకునే, పాడి రైతు మహిళ నాకు ఆదర్శం. భర్తకు ఆర్థికంగా తోడుగా ఉండేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ప్రతి మహిళా నాకు ఆదర్శం’ అంటూ భువనమ్మ ఉద్వేగానికి లోనయ్యారు.
మన సాంప్రదాయాలు, కళలను మనమే ప్రోత్సహించాలి
‘చేనేత వస్త్రాలు, హస్తకళలు మనకున్న గొప్పకళ. వాటిని మనం కాపాడుకోవాలి. చేనేత కార్మికులు పడే కష్టాలు నా కళ్ళతో చూసాను. అందుకే చేనేత వస్త్రాలు ధరించి ఈ పండుగ జరుపుకుందామని పిలుపునిచ్చాను. వారం లేదా నెలలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించాలి. ప్రముఖులు, రాజకీయ, సినీ, వ్యాపారరంగాల్లో ఉన్నవారు చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి. చేనేత, గిరిజన ఉత్పత్తులు, కొండపల్లి, ఎట్టుపాక బొమ్మలను మనం కొనుగోలు చేస్తే వారికి మంచి చేసినవారవుతాం’ అని భువనమ్మ సూచించారు.
అమ్మ ఆశీర్వాదంతో ప్రజలకు విజయాలు
‘స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అమ్మలుగన్న అమ్మ దుర్గమ్మను ప్రార్ధిస్తూ, దుర్గమ్మ శక్తిని తనలో కలిగిన ప్రతి స్త్రీమూర్తిని గౌరవిద్దాం. విజయాలను తెలయజెప్పే విజయదశమి శుభాకాంక్షలు. దుర్గమ్మ తల్లి చల్లని దీవెనలు ప్రతి తెలుగువారిపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని భువనమ్మ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.