- అగ్రస్థానంలో ఉండేందుకే కృషి చేద్దాం
- ఇన్వెస్టర్లను భయపెట్టిన గత పాలకులు
- ఆ పరిస్థితులను మనం అధిగమించాలి..
- పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు పూర్తిచేయాలి
- విద్యుత్ కోతల ఊసే రానివ్వొద్దు..
- చేనేత వస్త్రాలను ప్రమోట్ చేద్దాం
- 7న చీరాలలో చేనేత దినోత్సవం నిర్వహణ
- కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేలా చూడాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖలను సమీక్షించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2014-19 మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తొలి ఏడాది తప్ప మిగతా నాలుగేళ్లు మొదటిస్థానంలో మనమే ఉన్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా పెండిరగులోవున్న రైల్వేక్రాసింగ్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలలన్నారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి అటవీ శాఖ కాలయాపన జరుగుతోందని, అడవులు తవ్వుకుపోయినప్పుడు స్తబ్దుగా ఉన్నారు, రోడ్ల నిర్మాణం కోసం ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని మెత్తగా మందలించారు. పరిశ్రమలకు కేటాయించాల్సిన భూములను ప్రచారం కోసం ఇళ్ల స్థలాల కేటాయించారని, ఏపీఐఐసీలోనూ అక్రమాలు జరిగాయన్నారు.
పోర్టుల నిర్మాణంలో టీడీపీ హయాంలో పీపీపీ తీసుకొస్తే, గత ప్రభుత్వం ఈపీపీ విధానం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. పోర్టులు త్వరితగతిన పూర్తవ్వాలంటూనే, 9 ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలని, 4 కొత్త పోర్టులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు కలెక్టర్ల దృష్టికి తెచ్చారు. మరో మూడు విమానాశ్రయాలు వస్తాయని, మొత్తం పది ఎయిర్ పోర్టుల నిర్మాణం పూర్తవ్వాలన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గ చర్యలతో రాష్ట్రానికి చెందిన వారు కూడా పెట్టుబడులు పెట్టకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. ఏ ప్రాజెక్టైనా ఆసల్యమైతే ఖర్చు అదనమవుతుందని అంటూ.. గతంలో పీపీఏలు రద్దు చేసినందుకు ఆయా సంస్థలకు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండకూడదని, విద్యుత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీయేనని గుర్తు చేశారు. కొరత విద్యుత్‌ను అధికమించి మిగులు విద్యుత్ సాధించాం.
కానీ తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలతో మళ్లీ కోతలు తప్పలేదన్నారు. విద్యుత్ ఆదాకూ ప్రాధాన్యముండాలి. పవర్ కొరతవున్న చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాట్లు చేయాలి. పగటి పూటే రైతులకు విద్యుత్ అందించాలి. విద్యుత్ వాహనాలు వినియోగం పెరగాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులకు నిధులు ఖర్చు చేయలేదని, రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలోవున్న జాతీయ రహదారులకు సంబంధించి ఒక్క ఫిర్యాదూ నాకు రాకూడదని ఆదేశించారు. హ్యాండ్లూమ్స్ను ప్రమోట్ చేయాలంటూనే, ఈనెల 7న చేనేత దినోత్సవాన్ని చీరాలలో నిర్వహిస్తామని ప్రకటించారు. టాటా సంస్థతో మంగళగిరి చేనేతలు ఒప్పందం కుదుర్చుకుని విక్రయాలు చేస్తున్నారని, ఆ తరహా విధానాలపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.