అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ- జనసేన -బిజెపి కూటమి ప్రభుత్వ హయాంలో ఈ ఐదేళ్లలోనే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా లోకేష్ ముందడుగు వేస్తున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు యువగళం పాదయాత్రలోను, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోను ఇచ్చిన హామీని సఫలీకృతం చేయడంలో తన వంతు పాత్ర పోషించే దిశగా లోకేష్ అడుగులేస్తున్నారు. రాష్ట్ర రాజధాని నగరం అమరావతితోపాటు ఇటు ఉత్తరాంధ్రలో విశాఖపట్టణం, అటు రాయలసీమలో తిరుపతి కేంద్రాలుగా ఐటీ, సాఫ్ట్‌వేర్ పరిశ్రమల ఏర్పాటుకు లోకేష్ రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఐటి, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు నూతన కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తన లక్ష్య సాధనలో భాగంగా లోకేష్ ఈనెల 25నుంచి నవంబర్ 1వరకూ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 29, 30 తేదీలలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో జరుగనున్న ‘‘9వ వార్షిక ఐటీ సర్వ్ సినర్జీ సదస్సు’’లో లోకేష్ పాల్గొని ఏపీలో ఐటి పెట్టుబడుల ఆకర్షణకు కృషి చేయనున్నారు.
ఇప్పటికే విశాఖపట్టణంలో రెండు దఫాలుగా ఐటీ కంపెనీలతో లోకేష్ సమావేశమై అక్కడి మౌలిక వసతుల గురించి, ఇప్పటి వరకూ ఆయా కంపెనీల సక్సెస్ రేట్, భవిష్యత్ ప్రణాళికల గురించి విస్తృతంగా చర్చించారు. ఇటీవల ముంబయిలో పర్యటించిన లోకేష్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) సెంటర్‌ను విశాఖలో నెలకొల్పేలా ఒప్పించారు. టీసీఎస్ ద్వారా 10వేల ఉద్యోగాలు రానున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీకి ప్రఖ్యాత కంపెనీలను స్వాగతించడంలో లోకేష్ విజయం సాధిస్తున్నారనడానికి విశాఖకు టీసీపస్ రావడం ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపేందుకు టీసీఎస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి తొలి అడుగు కానుంది.
అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కృషితో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌సీఎల్ ఏపీలో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ సమీపంలోని గన్నవరంలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్ ప్రస్తుతం 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు విస్తరణ ద్వారా మరో 5500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫేజ్ 2లో నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్‌సీఎల్ సన్నధ్ధమవుతోంది. టీడీపీ తొలి విడత ప్రభుత్వంలో టీసీఎస్‌ను నెలకొల్పిన సమయంలోనే దశలవారీగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఆ సంస్థ అంగీకరించింది. ప్రారంభ దశలో 4500 ఉద్యోగాలు ఇచ్చింది. ఆ తరువాత వైసీపీ హయాంలో సంస్థకు కల్పించాల్సిన మౌలిక వసతులు, ఇవ్వాల్సిన రాయితీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో టీసీపస్ విస్తరణకు ముందడుగు పడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లోకేష్ చొరవతో హెచ్‌సీఎల్ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఫలితంగా రెండు దశలలో 15500 ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీని అప్పట్లో చంద్రబాబు నాయుడు దశల వారీగా ఏవిధంగా అభివృద్ధి చేశారో అదే మాదిరిగా అమరావతి, విశాఖపట్టణం, తిరుపతి నగరాలలో ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపేనీలతో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు లోకేష్ కృషి చేస్తున్నారు. చంద్రబాబు నాడు నిర్మించిన హైటెక్ సిటీ ఫలించి హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 1500 ఐటీ కంపెనీలు పని చేస్తున్నాయి. ప్రపంచంలోనే ఐటీ దిగ్గజ కంపెనీలుగా భావించే 30 సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. మైక్రోసాఫ్ట్, డెలాయిట్, ఎసెంచర్, కేప్ జెమిని, టీసీఎస్, నొవార్టిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్సిలింక్స్, జనరల్ ఎలక్ట్రిక్, జెన్‌పెక్, అమెజాన్, వెల్స్ ఫార్గో, ఎడిపి, హెడ్‌స్ట్రాంగ్, గూగుల్, ఒరాకిల్, సిట్రిక్ సిస్టమ్స్, సైబేజ్, థామ్సన్ రాయిటర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సేల్స్ ఫోర్స్, డిఇ షా, కంవాల్ట్, డెల్, క్యూల్ కమ్, సిఎ టెక్నాలజీస్, సిజిఐ, కాగ్నిజెంట్, డ్రావిన్ బాక్స్, స్వైప్, హై రేడియస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు నేడు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయంటే అది చంద్రబాబు ఘనతే. 9,05,715 మంది ఐటీ రంగ నిపుణులు హైదరాబాద్ కేంద్రంగా ఉపాధి పొందుతున్నారు. నాడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా వేసిన పునాదులు, నిర్మాణాలు, భవిష్యత్ ప్రణాళికలను ఆయన తరువాత ముఖ్యమంత్రులుగా వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కె చంద్రశేఖరరావు కొనసాగించబట్టే హైదరాబాద్ ఐటీ రంగం ఈస్థాయి ప్రగతిని సాధించింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014-2019 మధ్య ఐటి పరిశ్రమల అభివృద్ధికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేశారు. అప్పటికే విశాఖపట్టణం, విజయవాడ సమీపంలోని గన్నవరం, తిరుపతి, చిత్తూరు తదితర కేంద్రాల్లోవున్న ఐటీ కంపెనీలకు మరిన్ని సదుపాయాలు కల్పించి ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు కొత్త కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019-24 మధ్యకాలంలో అనేక ఐటీ కంపెనీలు ఏపీని వదిలి వెళ్ళిపోవడమో, ఏపీలో కార్యకలాపాలు తగ్గించుకోవడమో చేశాయి. 2019కి ముందు ఏపీలో దాదాపు ఐదువేల ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించగా.. 2024 జనవరి 9నాటికి 2540 ఐటి కంపెనీలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వహయాంలో ఐటీ మంత్రి లోకేష్ కృషి ఫలితంగా పలు ఐటీ కంపెనీలు ఏపీ వైపు దృష్టి సారించడం శుభపరిణామం.
-బోళ్ళ సతీష్ బాబు,
మీడియా కోఆర్డినేటర్, తెలుగుదేశం పార్టీ