- ఆగస్ట్ 15న అందుబాటులోకి వంద క్యాంటీన్లు
- డ్రెయిన్లలో పూడికతీత త్వరితగతిన పూర్తి చేయాలి
- టిడ్కో ఇళ్లకు మౌళికవసతుల కల్పనపైనా దృష్టి
- మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ
అమరావతి (చైతన్య రథం): ఎన్నికల హామీలలో భాగంగా ఎన్డీయే సర్కారు మరో హామీని అమల్లోకి తెస్తోంది. రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లు ఆగస్టు 15నుంచి నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి పి నారాయణ `ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అన్న క్యాంటీన్ల భవన నిర్మాణ పనులు, మురుగు కాల్వల్లో పూడికతీత పనులతోపాటు పలు ఇతర అంశాలపై నారాయణ సమీక్ష జరిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. కాన్ఫరెన్స్‌కు మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కమిషనర్, డైరెక్టర్ హరినారాయణన్, టిడ్కో ఎండీ సాయికాంత్‌వర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆయా క్యాంటీన్ల భవనాల నిర్మాణాలు పనులు ఎంతమేరకు వచ్చాయి? కిచెన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈనెల పదో తేదీలోగా వంద క్యాంటీన్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. రాబోయే వారంపాటు మున్సిపల్ కమిషనర్లు అన్న క్యాంటీన్లపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని 33 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇక మరో 83 క్యాంటీన్లు ఈనెలాఖరులోగా పూర్తిచేసేలా ముందుకెళ్లాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. మరో 20 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాలు ఉంచే ప్రదేశం ఏర్పాటుతోపాటు నీటి సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లనూ పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. సర్వింగ్ టీమ్‌తో ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్లు సమన్వయం చేసుకుంటూ పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం సరఫరా చేసేలా చూడాలని మంత్రి సూచించారు..
20లోగా డ్రెయిన్లలో పూడికతీత
రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాల్టీల్లోని డ్రెయిన్‌లలో పూడిక తీసేలా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మున్సిపాల్టీలకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇప్పటికే అన్ని మున్సిపాల్టీల్లో మురుగు కాల్వల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ఈనెల 20లోగా సిల్ట్ తొలగింపు పనులు పూర్తిచేయాలని మంత్రి నారాయణ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ర్యాండమ్‌గా తనిఖీలు చేయాలని సూచించారు. ప్రతివారం రెండు మూడు మున్సిపాల్టీల్లో తాను కూడా తనిఖీలు చేస్తానని మంత్రి చెప్పారు.
టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పనపై దృష్టి
టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పనపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని మంత్రి నారాయణ సూచించారు. సీఆర్డీయే పరిధిలోని టిడ్కో ఇళ్లకు మౌలిక వసతుల కల్పన బాధ్యతను సీఆర్డీయేకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో ఉండే టిడ్కో ఇళ్లకు వసతుల కల్పన బాధ్యతను ఆయా యూడీఎలకు అప్పగించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. మరోవైపు మున్సిపాలిటీల పరిదిలో ఉండే ఇళ్లకు అన్నిరకాల వసతులు కల్పించాల్సిన బాధ్యతను ఆయా మున్సిపాలిటీలకు అప్పగించారు..