పాలనకు కొలబద్ధ అభివృద్ధి, సంక్షేమం, ప్రజల జీవన ప్రమాణస్థాయి. తొలి 100 రోజుల పాలనలో జగన్‌రెడ్డి, చంద్రబాబు పాలనలో కొన్ని అంశాలలో సారూప్యాన్ని గమనిస్తే ప్రజలు ఎవరివైపు సానుకూలంగా ఉన్నారనేది ఇట్టే తెలుస్తుంది. ప్రజలిచ్చిన అవకాశంతో గద్దెనెక్కిన వెంటనే జగన్‌రెడ్డి విధ్వంసం, ప్రతీకార రాజకీయాలకు తెరతీయడంతో.. ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం, భద్రతకాంక్షించి తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తన 100 రోజుల పాలనలో శక్తివంతమైన నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు. పాలనలో అనుభవంతో ఇచ్చిన హామీలు అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన పాలనను గాడిన పెట్టేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య ప్రజలనుంచి వ్యాపార వర్గాల వరకూ అందరి సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
రూ.4 వేలకు పెన్షన్ల పెంపు
చంద్రబాబు హామీల అమలులో ముఖ్యమైనది పెన్షన్ రూ.4 వేలకు పెంపు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పెన్షన్ల పెంపును అమలు చేశారు. పెంచిన పెన్షన్ కలుపుకుని ఏప్రిల్ నెలనుంచి బకాయిలతో కలిపి రూ.7 వేలు అందజేశారు. దివ్యాంగులకు, డయాలసిస్ రోగులకు పెన్షన్లను పెంచి మానవత్వం చాటుకున్నారు. ఇలా పింఛన్ల పెంపు ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు తదితర నిరుపేద కుటుంబాలకు ఉపశమనం కలిగింది. ప్రభుత్వ ప్రతిష్టను మరింతగా పెంచింది.
ప్రజాకాంక్షలపై జగన్ తొలి దెబ్బ
2019 మే 30న ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన జగన్‌రెడ్డి తొలి 100 రోజుల పాలనలో నవరత్నాల హామీల్లో ఒకటైన పెన్షన్ల పెంపుపై ఆదిలోనే గండికొట్టారు. పెన్షన్ల పెంపుపై వృద్ధులు ఆశలు పెట్టుకోగా, కేవలం రూ.250 మాత్రమే పెంచి వృద్ధుల ఆశలపై నీళ్లుచల్లారు. ఇచ్చిన హామీకి ఆదిలోనే గండి కొట్టి వృద్ధులకు షాక్ ఇచ్చారు. విడతలవారీగా పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతామని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
మెగా డీఎస్సీతో నిరుద్యోగులకు భరోసా
ఎన్నికలకు ముందు చంద్రబాబు.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై సంతకం చేశారు. నిరుద్యోగ యువతకు 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేశారు. నిరుద్యోగుల ఆశలకు ఊపిరి పోశారు. ఎన్నో ఏళ్లనుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కలలను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు.
ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి నాంది
అదే జగన్.. గద్దెనెక్కిన రోజే.. ప్రజావసరాల కోసం నిర్మించిన ప్రజావేదికను అక్రమకట్టడంగా పేర్కొని కూల్చేసి విధ్వంస పాలనకు నాంది పలికారు. నియంతగా వ్యవహరించి ఉక్కుపాదం మోపారు. ప్రజల ఆకాంక్షలను కాలరాస్తూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా నియంతగా పేరు తెచ్చుకున్నాడు.
ఇచ్చిన మాటమేరకు ఉచిత ఇసుక
ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి గృహ నిర్మాణదారుల్లో ఆర్థికభారాన్ని తగ్గించారు చంద్రబాబు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఉచిత ఇసుకను కేవలం రవాణా చార్జీలు చెల్లించి తీసుకెళ్లేందుకు నూతన విధానాన్ని తెచ్చారు. గత ప్రభుత్వంలో సాధారణ ప్రజలు ఇళ్లు నిర్మించుకోవాలంటే ఇసుకకు భారీగా చెల్లించాల్సి వచ్చేది. వారి కష్టాలను స్వయంగా గమనించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎన్నికల ముందే ఉచిత ఇసుక అందిస్తామని ప్రకటించింది. చెప్పినట్టే ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి నిర్మాణరంగాన్ని గాడిలోపెట్టి భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచారు.
ఇసుకను బొక్కిన జగన్ సర్కారు
జగన్‌రెడ్డి పాలన మొదలైన దగ్గర్నుంచే ఇసుక మాఫియాకు శ్రీకారం చుట్టారు. ఇసుక వినియోగదారులపై అధికభారం మోపారు. కొనుగోళ్లు, అమ్మకాలను ఆన్‌లైన్ చేయడం పెద్ద గందరగోళానికి దారి తీసింది. అంతేకాకుండా అనుచరులకే ఇసుక కాంట్రాక్టును అప్పగించి భారీస్థాయిలో దోపిడీకి పాల్పడ్డారు. అధిక ధరలతో ప్రజలపై భారం మోపడమే కాకుండా భవన నిర్మాణ కార్మికులకు ద్రోహంచేయడం జగన్ సర్కార్ అత్యంత దుర్మార్గపు చర్య. ఈ నిర్ణయంతో లక్షలాది కార్మికులు పనుల్లేక ఆకలితో అలమటించారు.
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇచ్చిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. పేదలకు కేవలం రూ.5కే నాణ్యమైన భోజనం, అల్పాహారం అందిస్తూ పేదల కడుపు నింపుతోంది. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం ద్వారా చంద్రన్న ప్రభుత్వం లక్షలాది పేదల మన్ననలు అందుకుంటోంది.
అన్న క్యాంటీన్ల మూసివేత
అదే జగన్ సర్కారు హయాంలవో.. అన్నక్యాంటీన్లు మూసేసి పేదల కడుపుకొట్టాడు. అక్కసు రాజకీయాలకు తెరలేపి.. చంద్రన్న ఇచ్చిన వరాన్ని పేదలకు కాకుండా చేశారు. ఈ విషయంలో జగన్‌రెడ్డి తన హీనబుద్ధి బయటపెట్టుకున్నారు. జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా తీసుకున్న అన్న క్యాంటీన్ల రద్దు నిర్ణయం నిరుపేదలు, దినసరి కార్మికులపై తీవ్ర ప్రభావం చూపింది. పేదల కడుపుపై జగన్ సర్కారు బలమైన దెబ్బకొట్టింది.
ల్యాండ్ టైటిలింగ్ రద్దు…రాజముద్రతో పాసు పుస్తకాలు
గత ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ప్రజలకు ఉపశమనం కలిగించారు చంద్రబాబు. భూముల రీ సర్వే కార్యక్రమాన్ని నిలిపివేశారు. భూముల విషయంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. జగన్ ప్రభుత్వం ఆయన ఫొటోతో జారీ చేసిన పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను జారీ చేశారు. రైతు భూమి హక్కులకు ఆధునిక టెక్నాలజీ వాడకం ద్వారా మరింత భరోసా కల్పించారు. క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో భూమి సరిహద్దులు, లోకేషన్ వివరాలను పాసుపుస్తకాల్లో పొందుపరచి భూసమస్యలను తగ్గించడానికి చంద్రబాబు చొరవ చూపారు.
అమరావతి విధ్వంసం
జగన్.. పాలన మొదలెట్టిన వంద రోజుల్లోనే రాజధాని అమరావతిపై కక్ష ప్రదర్శించారు. అప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధిపై ఆశలు పెట్టుకున్న ప్రజల కలలను జగన్ సర్కారు చిదిమేసింది. విధ్వంస పాలనకు శ్రీకారంచుట్టిన ఆయన మూడు రాజధానుల సాగుతో అమరావతిని ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. పనులను ఎక్కడికక్కడే మధ్యలోనే ఆపేశారు. ప్రతీకార రాజకీయాలకు తెరలేపారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచేశారు. చివరకు ప్రజా రాజధాని ఆకాంక్షను చిదిమేశారు.
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్రం నిధులు
కేంద్రంతో సంప్రదింపులు జరిపిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడంలో సఫలీకృతమయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు సాధించటంలో విజయం సాధించారు. అంతేకాకుండా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నారు. గత ప్రభుత్వం క్రూరత్వానికి బలైన రాజధాని కౌలు రైతులకు ఊరటనిస్తూ రూ.400 కోట్లు విడుదల చేశారు.
రివర్స్ టెండరింగ్‌తో జగన్ రివర్స్ పాలన
సాగునీటి ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగకుండా రైతులను దారుణంగా దెబ్బతీశారు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేసి అభివృద్ధికి బదులుగా రివర్స్ పాలనకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రజాప్యం రాష్ట్రానికి పెద్దదెబ్బగా మారింది. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాకపోవడంతో రైతులు, ప్రజలు, మొత్తం రాష్ట్రమే తీవ్రంగా నష్టపోయింది.
గంజాయి నియంత్రణకు కమిటీ, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
రాష్ట్రంలో గంజాయి మాఫియాకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ కమిటీ గంజాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండటంతో గంజాయి స్మగ్లర్లకు అడ్డుకట్టపడిరది. అంతేకాకుండా గంజాయి మాఫియా సమాచారం ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించి ప్రజలకూ భాగస్వామ్యం కల్పించారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటుచేసి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో గంజాయి అక్రమార్కులను అణచివేయడం కోసం చేపడుతున్న చర్యలు సఫలీకృతమవుతున్నాయి.
ప్రతిపక్షంపై జగన్ కక్షసాధింపు చర్యలు
30 కీలక ప్రాజెక్టులను నిలిపివేసి జగన్ తన ప్రతీకార వైఖరిని ప్రదర్శించారు. ప్రాజెక్టులపై విచారణ పేరుతో అభివృద్ధికి తీవ్ర ఆటంకాలు కలిగించారు. కేవలం రాజకీయ కక్షపూరిత చర్యలతో పాత ప్రాజెక్టులను నిలిపివేసి ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడంపైనే దృష్టిసారించి పాలనను గాలికొదిలారు.
అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు
రాష్ట్రంలో మహిళల భద్రతకు చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. చీరాల అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లో ఛేదించింది. అనకాపల్లిలో బాలిక హత్య కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఘటనలో నిందితులను పట్టుకోవడం ద్వారా మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటిచెప్పారు. అంతేకాకుండా మహిలలపై నేరాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు వేగవంతమైన చర్యలు తీసుకుంది.
విద్యుత్ ఒప్పందాల రద్దు… కేంద్రంతో చీవాట్లు
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దుచేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిరది. ఈ నిర్ణయం అటు విద్యుదుత్పత్తిదారులను, ఇటు పరిశ్రమల యాజమాన్యాలను, కేంద్రాన్ని కలవరపెట్టింది. తుగ్లక్ నిర్ణయంతో రాష్ట్రంలో పరిశ్రమలపై తీరని దెబ్బపడిరది. విద్యుత్ రంగం కుదేలైంది.
వరదల్లో దగ్గరుండి సహాయక చర్యలు
ఇటీవల విజయవాడ, తర్వాత ఏలేరుకు వచ్చిన భారీ వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందుల కు గురిచేశాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరదలు తగ్గి జనజీవనం సాధారణ స్థితికి చేరేవరకు రేయింబవళ్లు ప్రజల కోసం ఆయన పడిన తపన అభినందనీయం. వరద బాధితులకు భరోసా ఇస్తూ తక్షణ చర్యల ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. అటు సహాయక చర్య లు ముమ్మరం చేయడం, మంత్రులు ముంపు ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షించేలా చేయ డం, కేంద్ర సహాయం తీసుకోవడం ద్వారా బాధితులకు ఉపశమనం కలిగింది. చంద్రబా బు నాయకత్వం, కార్య దీక్షతకు ఈ ఘటనలే నిదర్శనం.
ప్రజారోగ్యానికి జగన్ పాతర
డెంగ్యూ, మలేరియావంటి సీజనల్ వ్యాధుల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. ప్రజలు ప్రాణాలతో పోరాడుతుంటే చోద్యం చూసింది. ఆసుపత్రులలో సౌకర్యాలపై దృషి ్టసారించలేదు. ప్రజల సమస్యలమీద కంటే ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టాలన్న దానిపైనే వ్యూహరచనలకు పరిమితం కావడంతో తొలి వందరోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
దేవాదాయ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం
దేవాదాయ ధర్మాదాయ శాఖను ప్రక్షాళన చేయటం ద్వారా గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు పెంపు, వేద విద్యను అభ్యసించిన బ్రాహ్మణులకు యువగళం ద్వారా నిరు ద్యోగ భృతి, ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.15 వేలు నుంచి రూ.25 వేలు పెంపు వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. దేవాలయాలు, పూజారులపై గత ప్రభుత్వంలో జరిగిన దాడులపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి దేవాలయాల పరిరక్షణ కోసం చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే చర్యలు తీసుకుంది.
పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం
ప్రైవేటు పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కోటా విధించడం రాష్ట్రంలో పెట్టుబడిదారులను భయపెట్టింది. ఈ విధానం పరిశ్రమల అభివృద్ధికి ఆటంకంగా మారాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయంగా వ్యాపార వర్గాలనుంచి విమర్శలు తలెత్తాయి. దాంతో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు జంకే భయానక పరిస్థితి రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వంద రోజుల పాలనలో ఎన్డీయే సర్కారు సాధించిన విజయాలతో గత ప్రభుత్వాన్ని పోల్చిచూస్తే.. చంద్రబాబు నిర్మాణాత్మక అభివృద్ధివైపు వెళ్తే.. జగన్‌రెడ్డి నిర్మాణాత్మక విధ్వంసంవైపు ప్రయాణం సాగించిన దృశ్యం స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయాలు పక్కన పెట్టి బాధ్యతాయుత పాలనకు సిద్ధమవుదామంటూ ఆదిలోనే పిలుపునిచ్చిన చంద్రబాబు.. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం జీపీఎస్ (గ్లోబల్ పింఛన్ సిస్టమ్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ కోసం కమిటీ వేశారు. ఎన్నో ఏళ్ల నుంచి వారు చేస్తున్న ఆందోళనలకు పరిష్కారం చూపేందుకు ముందడుగు వేయడం ద్వారా ఉద్యోగుల్లో విశ్వాసం పొందారు. తమకు చంద్రబాబు ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు.
విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆర్థిక భారాన్ని తగ్గించారు. ఐఐటీ, ఎన్‌ఐఐటీలో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశాలు కల్పించడం వంటి సత్వర చర్యలు ప్రభుత్వంపై విద్యావ్యవస్థ పట్ల ఉన్న అంకితభావాన్ని స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా విద్యార్థులకు ఎదురైన సమస్యలకు సత్వరం పరిష్కారం చూపి వారు నష్టపోకుండా తీసుకున్న చర్యలు ప్రభుత్వంపై వారిలో విశ్వాసాన్ని పెంచాయి.
బాబుది సంక్షేమం.. జగన్‌ది సంక్షోభం!
తొలి 100 రోజుల్లో జగన్‌రెడ్డి విధ్వంస పాలనకు తెరలేపి రాష్ట్రాభివృద్ధికి అవరోధమైతే.. చంద్రన్న పాలన అభివృద్ధి, సంక్షేమంతో ముందడుగు వేసింది. పెన్షన్ పెంపుతో ప్రారంభమైన చంద్రబాబు పాలన అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, మహిళల భద్రతపై చర్యలు, అమరావతి నిర్మాణం పునరుద్ధరణ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న చర్యలతో సుస్థిరమైన అభివృద్ధికి బాటలు వేశారు. చంద్రబాబు ప్రజల కోసం అందిస్తున్న ప్రజాహిత పాలనకు ప్రజలు నూటికి నూరుశాతం మార్కులు వేస్తున్నారు. జగన్‌రెడ్డి 100 రోజుల పాలనలో విధ్వంసకర విధానాలను దేశం మొత్తం చూసింది. అభివృద్ధి అనే మాట పక్కన పెట్టి కక్ష పూరిత రాజకీయాలను నడిపించారు. ప్రతి రంగాన్ని విధ్వంసం చేసి తిరోగమనంలోకి నెట్టారు. మొదటి మూడు నెలల్లోనే జగన్ రెడ్డి విధ్వంసపాలన ప్రజలకు తెలిసొచ్చిందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
కొనపల స్వరూప, అనలిస్ట్