అమరావతి: అవినీతిని సమర్థించుకుంటూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర తహశీల్దార్ ముర్షావలి మాట్లాడిన మాటలు నేడు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, వ్యవస్థల పతనానికి అద్దం పడుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి సోమవారం అచ్చెన్నాయుడు లేఖ రాశారు. అవినీతిని సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలను తప్పుబడుతూ తహశీల్దార్ ముర్షావలిని సస్పెండ్ చేశారు. ఏ కారణంతో అయినా లంచం తీసుకోవడం సమర్థనీయం కాదు. అయితే ముర్షావలి లేవనెత్తిన సమస్యపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ముర్షావలి వివరించారు. వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో తద్వారా తెలుస్తోంది. వీడియో ద్వారా ముర్షావలి వెల్లడిరచిన సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టకుండా సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ చర్య చూస్తుంటే వ్యాధికి కాకుండా వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తున్నట్లు ఉంది. ముర్షావలి సస్పెన్షన్ ఆర్డర్‌ను ఉపసంహరించుకుని సమస్యకు మూలంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ముర్షావలి ప్రకటన ద్వారా పరిస్థితుల గురించి తెలుసుకొని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి.