.ఎస్‌ఐ జయకృష్ణ మోకాళ్లపై నిలబెట్టి కర్రలతో కొట్టారు
.గోడకుర్చీ వేయించి గుంజీలు తీయించారు
.ఇది 1శాతమే… బయటచెబితే మిగతాది చూస్తావన్నారు
.కేసులు బనాయించి బొక్కలో తోస్తామని బెదిరించారు
అమరావతి: ఉదయం 7గంటలకు వారెవరో చెప్పకుండా సిబిసిఐడి పోలీసులు మా ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు. తలుపు తీయగానే నువ్వేనా సాంబ అన్నారు. రావడంతోనే ఫోన్ ఇవ్వరా అంటూ బూతులు లంకించుకున్నారు. ఆ సమయంలో బిడ్డకు నాభార్య పాలిస్తోంది. కంగారుగా ఇంటిలోకి వెళ్లాను. లోపలకు వచ్చి నన్ను బలవంతంగా లాక్కొని గుంటూరు సిఐడి ఆఫీసుకి తీసుకెళ్లారు. ఎస్ ఐ జయకృష్ణ, కానిస్టేబుల్ శ్రీనివాస్ నా మోకాళ్లపై కర్రలతో కొట్టారు. గోడకుర్చీ వేయించి గుంజీలు తీయించారు. కొదిసేపు అటు ఇటూ నడిపించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు నా కాళ్లుపట్టుకొని లాగి తీవ్రంగా హింసించారు. ఆ తర్వాత డిఎస్పీ వచ్చి కొట్టారా అని అడిగారు. కాళ్లపై కొట్టారని చెప్పాను. నిన్ను కొట్టలేదు… విచారణ మాత్రమే చేశామని చెప్పాలి. కాదంటే ఇప్పుడు నీకు 1శాతమే చూపించారు… తర్వాత మిగతాది చూపిస్తామని డిఎస్పీ హెచ్చరించారు. లాప్ ట్యాప్ మెయిల్ పాస్ వర్డ్ ఓపెన్ చేయమని అడిగారు. నేను కంగారులో ఓపెన్ చేయలేకపోయాను. లక్ష్మణ్ అనే సిఐ బూటు కాలితో గుండెలపై తన్నారు. నాటకాలు వేస్తావురా నా కొడకా అని బూతులు తిట్టారు. తర్వాత సాయంత్రం నాకు 41ఎ నోటీసులు ఇచ్చి వెళ్లమని చెబుతూ బయటకు వెళ్లి కొట్టామని చెబితే కేసులు బనాయించి బొక్కలో వేస్తాం… గుర్తుంచుకో… పెద్దోళ్లతో పెట్టకుంటున్నావ్ జాగ్రత్త అంటూ బెదరించి పంపించేశారు.