అమరావతి, చైతన్యరథం: దొడ్డిదారిన ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించాలన్న జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ‘‘ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని చెప్పి జగన్ రెడ్డి గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. ఉత్తరాంధ్రకు మకాం మారుస్తున్నా.. ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు మార్చేస్తా అంటూ మరోమోసానికి సిద్ధమయ్యాడు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తన నియంతృత్వ పోకడలను చాటుకుంటున్నాడు. గత ప్రభుత్వ హయాంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన మిలీనియం టవర్స్ బలవంతంగా ఖాళీ చేయించడం జగన్ రెడ్డి పెత్తందారీ విధానాలకు నిదర్శనం. ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నాశనం చేసి ఇక్కడకు సీఎం వచ్చి ఏం సాధిస్తారు.? దాదాపు 40వేల కోట్ల విలువైన 70వేల ఎకరాల భూముల్ని ఉత్తరాంధ్రలో కబ్జా చేశారు. విశాఖలోని ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టి రూ.25వేల కోట్ల అప్పులు తెచ్చుకున్నారు. ఐటీ కంపెనీలను తరిమేశారు. లులూ, అదానీ డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాండ్యుయెంట్ లాంటి ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులు దూరం చేశారు. ఏం ఉద్దరిద్దామని విశాఖకు మకాం మారుస్తున్నారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక భూములిచ్చిన రైతుల ఉసురు తీశారు. దాడులు చేసి, కేసులు పెట్టి, అరాచకం సృష్టించారు. ఇప్పుడు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికే విశాఖకు మకాం మార్చానని చెప్పడం హాస్యాస్పదం. జగన్ రెడ్డి ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా నమ్మేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరని గుర్తుంచుకోవాలి’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.