- ఏం తప్పు చేశారని కుప్పంలో 85 అంగన్ వాడీ సిబ్బందికి మెమోలు ఇచ్చి జీతాలు ఆపారు
- అన్యాయంగా ఇద్దర్ని ఎందుకు సస్పెండ్ చేశారో ముఖ్యమంత్రి చెప్పాలి
- వేధింపులు ఆపి, సస్పెండ్ చేసిన ఇద్దర్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
- లేకుంటే వారి తరుపున టీడీపీ అంగన్ వాడీ విభాగం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంది
- ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రజల్లోకి వస్తే అంగన్‌వాడీ కేంద్రాల దుస్థితి.. అక్కడి పిల్లల ఆకలి కేకలు కనిపిస్తాయి
అమరావతి: జగన్ రెడ్డి చెప్పేదానికి, చేసేవాటికి ఎక్కడా పొంతన ఉండదని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. ప్రజల ముందుకొచ్చిన ప్రతిసారి ఉత్తుత్తి ఉపన్యాసాలు ఇవ్వడం… నా ఎస్సీలు, నాఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని కపటప్రేమ ఒలకబోయడం తప్ప కనీసం పేద మహిళలు, చిన్నారుల కడుపు నింపే అంగన్ వాడీ కేంద్రాలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని చేతగాని ముఖ్యమంత్రిగా చరిత్రే సిగ్గుపడేలా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీకి తమ సమస్యలు, ఇబ్బందులు చెప్పుకున్నందుకు కప్పంలో 85 మంది అంగన్ వాడీ సిబ్బందికి మెమోలు ఇచ్చి జీతాలు ఆపారన్నారు. ఇద్దర్ని సస్పెండ్ చేశారన్నారు. అధికార వైసీపీ కార్యక్రమాలకు జనాన్ని తరలిస్తూ, వాటిల్లో అంగక్ వాడీ సిబ్బంది పాల్గొంటున్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్సీతో మాట్లాడటమే తప్పయిందా అని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కార్యక్రమాల్లో పలుమార్లు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారన్నారు. అంగన్ వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడంలో.. పేదపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం సరఫరా చేయడంలో.. అంగన్ వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడని విమర్శించారు. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చూస్తూనే ఉన్నాం. అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం, చిక్కీల్లో పురుగులు.. ఖర్జూర ప్యాకెట్లలో పాము కళేబరాలు.. కాలపరిమితి ముగిసిన పాలప్యాకెట్ల సరఫరా ఘటనలు చూస్తూనే ఉన్నాం. వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగే తప్పిదాలు, లోపాలను కూడా సరిచేయలేని అసమర్థ ముఖ్యమంత్రి ఊరికే ఉపన్యాసాల్లో ప్రజలపై ఎక్కడాలేని ప్రేమ చూపడం జగన్ రెడ్డి నయవంచన విద్యల్లో ఒకటనే చెప్పాలి. అంగన్ వాడీ కేంద్రాల్లో పేద పిల్లలు తినే ఆహారాన్ని జగన్ రెడ్డో.. ఆయన సతీమణి భారతి రెడ్డో ఒకసారి తింటే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుందని సునీత అన్నారు.
అంగన్ వాడీ సిబ్బంది జీతాలు పెంచడానికి మాత్రం జగన్ రెడ్డికి మనసు రాదు
ఎన్నికలకు ముందు అంగన్ వాడీ కేంద్రాలను బ్రహ్మండంగా పునరుద్ధరిస్తానని.. ఆయా కేంద్రాల్లోని సిబ్బంది జీతభత్యాలు పెంచుతానని.. మహిళలు, పిల్లలకు మంచి నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తానని ఇలా జగన్ అనేక ప్రగల్భాలు పలికాడు. తీరా అధికారంలోకి వచ్చాక.. అంగన్ వాడీ కేంద్రాలను అనాథకేంద్రాలుగా గాలికి వదిలేశాడు. గతంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీ సిబ్బంది ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిస్తే, వారిని పోలీసుల ఉక్కు పాదంతో దారుణంగా అణచివేశాడు. తన చుట్టూ 40మందికి పైగా సలహాదారుల్ని నియమించుకొని వేల కోట్ల విలువైన ప్యాలెస్‌లలో ఉంటూ రాజభోగాలు అనుభవిస్తున్న జగన్ రెడ్డికి..అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచడానికి మాత్రం మనసు రాదు. అంగన్ వాడీ సిబ్బంది జీవితాలు విశాఖపట్నంలో రుషికొండపై జగన్ రెడ్డి నిర్మించు కుంటున్న భారీ భవనంలోని బాత్ టబ్ ఖరీదు కూడా చేయవా అని సునీత ప్రశ్నించారు.