సంజామల: అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పేరుసోముల గ్రామంలో టీడీపీ గౌరవసభను ఏర్పాటు చేశారు. బీసీ మాట్లాడుతూ ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. నిత్యావసర ధరలు పెంచి, వివిధ రకాల పన్నులు విధించి ప్రజలపై భారం మోపారన్నారు. వైసీపీ నాయకులు సారా, మద్యం విక్రయాలు చేస్తున్నా పట్టించుకొనే వారే కరవయ్యారన్నారు. టీడీపీ సమావేశాలకు వెళ్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తామని కొందరు నాయకులు బెదిరిస్తున్నారని, ఎదరూ భయపడవద్దని ప్రజలకు సూచించారు. గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోలీసు బందోబస్తుతో వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారని, సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయటికి రావడానికి జంకుతున్నారన్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన కంటే ఎక్కువ ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని సవాలు విసిరారు. పేరు సోములలో రూ.2.20 కోట్లతో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో అభివృద్ధి చేశామన్నారు. మూడేళ్లలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని వైసీపీ నాయకుడి ఆగడాలు హద్దు మీరాయన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని చెప్పిన సీఎం జగన్ మోదీ వద్ద మోకరిల్లుతున్నారన్నారు.