.ఉడుత వల్లే ప్రమాదమని వింత వివరణ
.తుగ్లక్ ప్రభుత్వంలో అన్ని విచిత్రాలే
.ఘటనపై చంద్రబాబు, లోకేష్‌ల దిగ్భ్రాంతి
సత్యసాయిజిల్లా: సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో కూలీలతో వెళ్తున్న ఆటో మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా, మరో ముగ్గురికి తీవ్రగాయాల య్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందినవారంతా మహిళలేగా పోలీసులు గుర్తించారు. మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్ల వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది వ్యవసాయ కూలీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదుగురు సజీవ దహనం
ఆటోకు మంటలు అంటుకోవడంతో డ్రైవర్ వెంటనే పక్కకు నిలిపేశాడు. కానీ.. ఆటో మొత్తం రెగ్జిన్ కవర్ తో కప్పబడి ఉండడంతో.. క్షణాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. దీంతో.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఐదుగురు సజీవంగా దహనమయ్యారు. తమ స్నేహితులు, తోటి వారిని రక్షించుకునేందుకు మిగిలిన కూలీలు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు.
మృతులంతా మహిళలే
ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా మహిళలే. మృతులను గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో.. గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి.. పెద్దకోట్లకు చెందిన కుమారి ఉన్నారు. మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్దకోట్లకు చెందిన కుమారి కూలీలను పనికోసం తీసుకెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఉడుత వల్లే ఈ ప్రమాదం…. ఏస్పీడీసీఎల్‌ఎస్‌ఈ నాగరాజు వింతైన వివరణ
తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో జరిగిన ఆటో ప్రమాదంపై ఏస్పీడీసీఎల్ ఎస్‌ఈ నాగరాజు వివరణ ఇచ్చారు. విద్యుత్ వైర్లు తెగి పడటానికి ప్రమాదానికి కారణం ఉడుత అని తెలిపారు. ఉడుత వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదని… ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆపరేషన్‌కు విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఉడుత షాట్ అయినప్పుడు లైన్ కట్ అయ్యి ఆటోపై పడిరదన్నారు. ఎక్కడైనా లైన్ కట్ అయితే సబ్ స్టేషన్ ట్రిప్ అవుతుందని.. కానీ ఈ ఘటనలో అది జరగలేదని అన్నారు. శాఖాపరంగా విచారణ జరుపుతున్నామని.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు ఏస్పీడీసీఎల్ ఎస్‌ఈ నాగరాజు తెలిపారు.
కూలీలు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది: చంద్రబాబు
శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఆవేదన చెందారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఘటనపై లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడి ఐదుగురు మృతి చెందిన ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
కూలీ పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోడం బాధాకరం: అచ్చెన్నాయుడు
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైటెన్సన్ విద్యుత్ తీగలు తెగి బస్సుపై పడడంతో ప్రమాదం జరిగిందని… దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు తెలిపారు.
రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలి
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాడిమర్రిలో రైతులు, మృతుల కుటుంబాలతో కలిసి టిడిపి నేతలు ఆందోళన దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. తాడిమర్రి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.