అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే బాధ్యతలు తీసుకోవాలని రవిచంద్రకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1996 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి రవిచంద్ర సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పేరు కోసం పాకులాడకుండా తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తారనే మంచి పేరు ఉంది. వివిధ జిల్లాలకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు, ప్రభుత్వ యంత్రాగంలో కీలకమైన ఉన్నతస్థాయి పదవుల్లో కూడా రవిచంద్ర తన సామర్థ్యం నిరూపించుకున్నారు. విధానాల రూపకల్పనలోనూ, వాటిని సమర్థవంతంగా అమలు చేయటంలోనూ చక్కటి పనితీరు కనబరుస్తారు. 2003లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించటంలో కీలకపాత్ర పోషించారు. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా చక్కటి పనితీరు కనబర్చారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ కార్యదర్శిగా విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు. 2014`19 మధ్య చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.