మూడేళ్లక్రితం కల్లబొల్లి కబుర్లు, అడ్డగోలు హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్న ఆయుధం ఎదురుదాడి. క్విడ్ ప్రో, మనీలాండరింగ్, సూట్ కేసు కంపెనీలతో 43వేల కోట్లరూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి 16నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా తమ పాత అలవాట్లను వీడలేదు. కమీషన్ల కక్కుర్తి కోసం ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ ని బలిపెడుతూ జగన్ ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పులను తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ వస్తోంది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల పదేపదే మీడియా ముందుకు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఎదురుదాడి అస్త్రాన్ని ప్రయోగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పోలవరం ప్రాజెక్టుపై పార్లమెంటులో కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటన, నీతి ఆయోగ్ సూచనల మేరకు ఐఐటి హైదరాబాద్ వారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఎ)కి సమర్పించిన థర్డ్ పార్టీ అధ్యయన నివేదికలు జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకాన్ని బట్టబయలు చేశాయి. ముఖ్యంగా ఐఐటి హైదరాబాద్ నిపుణల బృందం జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దిద్దుకోలేని తప్పులపై పొందుపర్చిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండ్ కో రాష్ట్రప్రజానీకానికి ఏం సమాధానం చెబుతారు? ఐఐటిహెచ్ నివేదికను కూడా చంద్రబాబే ఇచ్చారని చెబుతారా? ఇంకా ఎంతకాలం బొంకుడు విద్యతో పబ్బం గడుపుకొని ప్రజలను మోసగిస్తారు? మీరు చెప్పే మాటల్లో ఏమాత్రం చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నా తక్షణమే పార్లమెంటు సాక్షిగా కేంద్రం చేసిన వ్యాఖ్యలకు, ఐఐటి హైదరాబాద్ అధ్యయన నివేదికలోని అంశాలకు సమాధానం చెప్పే దమ్ముందా?
నీతి ఆయోగ్ సూచనల మేరకు ఐఐటి హైదరాబాద్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఎ)కి గత ఏడాది నవంబరులో 124 పేజీల సుదీర్ఘ నివేదిక అందజేసింది. రాష్ట్రప్రభుత్వం చెబుతున్నట్లుగా 2022 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పూర్తికావడం దుర్లభమని ఐఐటీహెచ్ ఆనాడే తేల్చేసింది. ఐఐటీహెచ్ బృందం సారథిగా డాక్టర్ కేబీవీఎన్ ఫణీంద్ర (సివిల్ ఇంజనీరింగ్ విభాగం), సభ్యులుగా డాక్టర్ సతీశ్ కె.రేగొండ (జలవనరుల నిపుణుడు-సివిల్ ఇంజనీరింగ్ విభాగం), డాక్టర్ కె.ప్రభీశ్ (ఆర్థిక నిపుణుడు-లిబరల్ ఆర్ట్స్ విభాగం), డాక్టర్ హరిప్రియ నరసింహన్ (లింగ-సామాజిక నిపుణురాలు-లిబరల్ ఆర్ట్స్), డాక్టర్ శుభ రంగనాథన్ (ఆర్ అండ్ ఆర్ నిపుణురాలు-లిబరల్ ఆర్ట్స్ విభాగం) ఉన్నారు.
ఐఐటి హైదరాబాద్ నివేదికలోని కీలకాంశాలు
ప్రాజెక్ట్ కీలకదశలో ఉన్నపుడు కాంట్రాక్టర్ ను మార్చడం
పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్/ఏజెన్సీ మార్పులే సమయం ఆలస్యానికి ఒక ప్రధాన కారణం. ఇది ప్రాజెక్ట్ కీలక దశల్లో ఉన్న ప్రధాన కాలువల ప్యాకేజ్‌లతోపాటు హెడ్ వర్క్ విషయంలోనూ జరుగుతోంది. కాలువల కొన్ని రీచ్‌లకు సంబంధించి ఒప్పంద బాధ్యతలు కొత్త ఏజెన్సీని కేటాయించడం ప్రాజెక్ట్ జాప్యానికి దారితీస్తోంది. ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని అర్థంతరంగా రద్దుచేసుకోవడం వల్ల ప్రాజెక్ట్ పురోగతిలో జాప్యం జరుగుతోంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ప్రణాళికల ద్వారా దీనిని సాధించవచ్చు.
తగిన నిధులు ఖర్చుచేయకపోవడం
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించకపోవడం, కేటాయించిన నిధులు ఖర్చుచేయకపోవడం పోలవరం ప్రాజెక్ట్ జాప్యానికి ఒక ప్రధాన కారణం. ప్రాజెక్ట్ నిర్ణీత సమయంలో పూర్తికావడానికి అవసరమైన నిధులను ఆటంకం లేకుండా కేటాయించడం అవశ్యం. ఇందుకు అవసరమైన నిధులను రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేస్తే కేంద్రం రీఎంబర్స్ మెంట్ చేస్తుంది. సకాలం నిధులను వెచ్చించడంలో అవాంతరాల కారణంగా ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్న కీలక సమయంలో నిర్మాణ సంస్థను మార్చడం దిద్దుకోలేని తప్పని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీహెచ్) స్పష్టం చేసింది.
సమన్వయ లోపం – వ్యూహం లేకపోవడం
పోలవరం ప్రాజెక్ట్ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి కావాలంటే స్థిరమైన ప్రణాళికా వ్యూహాలతో సాధ్యం… పోలవరం నిర్మాణంలో ఇది లోపించిందని అభిప్రాయపడింది. ‘ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థ అనుభవం కలిగి ఉండాలి. సమయానుకూలంగా డిజైన్లను మార్చాల్సి వస్తే అనుభవమే అక్కరకొస్తుంది’ అని పేర్కొంది. పోలవరం నిర్మాణంలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) ఎడమ ప్రధాన కాలువ, కనెక్టివిటీ చానళ్లు నిర్మించలేకపోవడానికి.. ఒక ప్రణాళికంటూ లేకపోవడమే గాక.. అధికారులు, కాంట్రాక్టు సంస్థ మధ్య సమన్వయ లేమి, నిధుల కొరత ప్రధాన కారణాలని ఐఐటీహెచ్ పేర్కొంది. స్పిల్‌వే పనులు పూర్తయినందున 2019లోనే దిగువ కాఫర్ డ్యాం ఎత్తును 30.5 మీటర్లకు పెంచి ఉంటే.. ప్రాజెక్టు పనులు నిరాటంకంగా సాగేవని అభిప్రాయపడింది.
డిజైన్లలో మార్పులు – పర్యవేక్షక సంస్థల ఆదేశాలు బేఖాతరు
ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం వద్ద గ్యాప్-1, గ్యాప్-2, ఎడమ ప్రధాన కాలువ, కనెక్టివిటీలు, కెనాల్ స్ట్రక్చర్ల నిర్మాణం నిర్ధారిత షెడ్యూల్ కంటే బాగా వెనుకబడి ఉంది. తరచూ డిజైన్లలో మార్పులు, డిపిఆర్ కు విరుద్ధంగా నిర్మాణాలవల్ల అరకొరగా పనులు, నిర్వహణ లోపం, కాంట్రాక్టరు మార్పు, పర్యవేక్షక సంస్థల ఆదేశాలను సిఫారసులను కాంట్రాక్టు సంస్థ అమలు చేయకపోవడం తదితరాలు ప్రాజెక్టు జాప్యానికి ప్రధాన కారణాలు.
ఆర్ అండ్ ఆర్ లో జాప్యం
జాతీయ స్థాయి ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని వ్యూహాత్మక ప్రణాళికతో అమలు చేయకుంటే సమయం, ఖర్చు అధికమవుతుంది. ఆనకట్ట నిర్మాణం కారణంగా లక్ష మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వారికి పునరావాసం కల్పించాలి. రెండు విడతల్లో 1,06,006 కుటుంబాలు నిర్వాసితుల అవుతుండగా, వారికోసం 213 కాలనీలు నిర్మించాల్సి ఉంది. తొలిదశలో 31-8-2021నాటికి 20,946 కుటుంబాలకు పునరావసం కల్పించాల్సి ఉండగా, 26 కాలనీలు నిర్మించి 6,351 కుటుంబాలను మాత్రమే తరలించారు. ఇంకా 14,595 కుటుంబాలను తరలించాల్సి ఉంది. సకాలంలో భూసేకరణ, సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి ఆర్ అండ్ ప్యాకేజి అందించాల్సి ఉంది. ప్రస్తుతం సామాజిక-ఆర్థిక సర్వే మొదటి దశ (+41.15 మీటర్లు) కోసం మాత్రమే నిర్వహించారు. రెండోదశలో తూర్పు గోదావరిలో ఎక్కువగా సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించాల్సిల ఉంది. రెండోదశలో (+45.72)కి సంబంధించి మరో 85,060 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. పునరావాస కార్యక్రమాల్లో జాప్యం కారణంగా ప్రాజెక్ట్ పూర్తిచేయడం జాప్యం కావడంతోపాటు అంచనా వ్యయం భారీగా పెరుగుతుంది. 2014నుంచి ఇప్పటివరకు భూసేకరణ, పునరావాసం కోసం ఎంత ఖర్చు పెట్టారో ఐఐటిహెచ్ నివేదికలో స్పష్టంగా పొందుపర్చారు. ఆర్ అండ్ ఆర్ పనులు ముందుకు కదలడం లేదని, 2022 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యమని నివేదికలో పేర్కొన్నారు.
కేంద్రం ఏం చెబుతోంది?
ఈనెల 18వతేదీన టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిస్తూ వ్యూహాత్మక ప్రణాళికా లేమి.. సమన్వయ లోపం కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంటులో సమాధానమిచ్చారు. సరైన ప్రణాళిక లేకపోవడంవల్ల 2022 ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని అందుకోలేకపోయినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఎ) అక్కడ జరుగుతున్న పనుల తీరును పరిశీలించాక 2024 జూన్ కు పూర్తవుతుందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు పిపిఎ 14 సమావేశాలు, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ 20సార్లు, ఎక్స్ పర్ట్ కమిటీ 7సార్లు సమావేశమైందని తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ కు ఎవరెంత ఖర్చుచేశారు?
ఐఐటి హైదరాబాద్ వారి ఎవల్యూయేషన్ రిపోర్టులో పోలవరం ప్రాజెక్ట్ లో 2014 నుంచి 2022 మార్చివరకు ఎవరెంత ఖర్చుపెట్టారో సంవత్సరాల వారీగా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 2014 నుంచి 2019 మార్చివరకు టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.10,584 కోట్ల రూపాయలు ఖర్చుచేయగా, వైసిపి ప్రభుత్వం 2019 నుంచి 2022వరకు మూడేళ్లలో వైసిపి ప్రభుత్వం రూ.2,643 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. టిడిపి ప్రభుత్వ హయాంలో 70శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తిచేయగా, వైసిపి ప్రభుత్వంలో బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో కేవలం 22శాతం మాత్రమే ఖర్చుచేసి 2శాతం పనులు మాత్రమే పూర్తిచేసింది. ఇటువంటి వాస్తవాలను మరుగునపెట్టి చంద్రబాబు వల్లే ప్రాజెక్ట్ జాప్యం జరిగిందన్న ఎదురుదాడికి దిగుతూ విషప్రచారం చేస్తున్న వారిని ఏమనాలో విజ్జులైన ప్రజలే నిర్ణయించుకోవాలి.