అమరావతి: కాకినాడ పోర్టు, సెజ్ ఆక్రమణపై సీఐడీ విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం.. వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ‘‘కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్‌ను బలవంతంగా లాక్కున్నారు. పోర్టు లాగేసుకుని 41శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందో వాళ్లకు అప్పగించారు. ఆస్తులను గుంజుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్ అయ్యింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా డ్యామేజ్ చేశారు. వీటన్నింటిపై సీఐడీ విచారణ జరిపిద్దాం’’ అని మంత్రులతో చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేదానిపై మంత్రులతో సీఎం చర్చించారు.