- శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
- అట్టహాసంగా సౌత్‌జోన్ ఆక్వాటిక్స్ పోటీలు ప్రారంభం
విజయవాడ (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన 35వ సౌత్‌జోన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఎన్టీఆర్, కృష్టా జిల్లాల ఎమేచర్ ఆక్వాటిక్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు 6 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. తొలుత ఆయా రాష్ట్రాల క్రీడాజట్లు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో శాప్ ఛైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ.. ఏపీలో స్విమ్మింగ్‌కు విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఆక్వాటిక్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు 6 రాష్ట్రాల నుంచి 450 మందికిపైగా స్విమ్మర్లు పాల్గొనడం సంతోషదాయమన్నారు.
ఆక్వాటిక్స్ క్రీడలో ఏపీ నుంచి క్రీడాకారులు మరింత ఉన్నతంగా రాణించి రాష్ట్ర కీర్తిప్రతిష్టలను విస్తృతం చేయాలన్నారు. ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం క్రీడాకారులకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామన్నారు. అలాగే క్రీడాకారుల ప్రోత్సాహకాలను భారీగా పెంచామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్‌ను 2 శాతం నుంచి 3శాతం పెంచిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. క్రీడాకారులకు మెరుగైన క్రీడావసతులు, సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. దానికి అనుగుణంగా క్రీడాకారులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రపంచవ్యాప్తంగా దేశ కీర్తిప్రతిష్టతలను ఇనుమడిరపజేయాలని ఆకాంక్షించారు.
స్విమ్మర్లకు చెక్కులు అందజేత..
అనంతరం 2024 ఆగస్టులో భువనేశ్వర్‌లో జరిగిన 50వ జూనియర్స్ నేషనల్ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులకు, కర్ణాటక రాష్ట్రం మంగళూరులో సెప్టెంబర్‌లో జరిగిన 77వ సీనియర్ నేషనల్ అక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ రవినాయుడు చేతుల మీదుగా ప్రోత్సాహకాలను అందజేశారు.
వాలీబాల్ జట్ల ఎంపిక ప్రక్రియ..
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏపీ సీనియర్ వాలీబాల్ టీమ్‌ల ఎంపిక ప్రక్రియను శాప్ ఛైర్మన్ రవినాయుడు శుక్రవారం పర్యవేక్షించారు. సీనియర్ మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్‌లకు ఉత్తమ ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను ఎంపికచేయనున్నారు. ఈ సందర్భంగా సెలక్షన్స్‌కు హాజరైన క్రీడాకారులను రవినాయుడు అభినందించారు. ఏపీ టీమ్‌లకు ఎంపికైన క్రీడాకారులు రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2025 జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ జరిగే సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నారు.
సాఫ్ట్‌బాల్ విజేతలకు అభినందనలు
జమ్మూలో ఈనెల 20నుంచి 24 వరకూ జరిగిన 37వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్న ఏపీ క్రీడాకారులను శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి అభినందించారు. విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో వారిరువురూ క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, శాప్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని రవినాయుడు హామీ ఇచ్చారు.