అమరావతి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న బాబును అధికారులు, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని అందుకే ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని ప్రజలు కంగారు పడుతున్నారు. ఇప్పటికే డీ హైడ్రేషన్, చర్మ సంబంధిత వ్యాధి రావడంతో పాటు, బరువు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా చంద్రబాబు ఆరోగ్యంపైనే చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఓ వైపు జైలు అధికారులు, మరోవైపు వైద్యాధికారులు, ఇంకోవైపు వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మీడియా ముందు మాట్లాడుతుండటంతో అసలు సెంట్రల్ జైలులో ఏం జరుగుతోందని సామాన్యుడు సైతం అనుమానం వ్యక్తంచేస్తున్న పరిస్థితి. జైలు అధికారులను లిఖిత పూర్వకంగా కోరినా చంద్రబాబు కుటుంబసభ్యులకు కూడా మెడికల్ రిపోర్ట్ ఇవ్వకపోవడంపై ఆందోళనతో పాటు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 12వ తేదీ తర్వాత నిర్వహించిన పరీక్షలకు సంబంధించి మెడికల్ రిపోర్టును జైలు అధికారులు బయటకు ఇవ్వలేదని, మెడికల్ రిపోర్ట్‌లో పేర్కొన్న అంశాలను దాచిపెట్టి హెల్త్ బులిటెన్ ఇవ్వడంపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటంలేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొని ఏసీబీ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందంటూ మరియు తమకు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపడతానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
కాగా చంద్రబాబు ఆరోగ్యంపై నివేదిక తాలుకు ఒరిజినల్ పత్రాలు తమకూ ఇంకా అందలేదని కోర్టు తెలిపిందని న్యాయవాదులు చెప్పారు. అందువలనే తాము మెడికల్ రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నామని కోర్టు తెలిపిందన్నారు.
అందుకే అనుమానాలు..
ఇలాఉంటే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, డాక్టర్ల సూచనలను సమగ్రంగా తెలిపే రాజమహేంద్రవరం జీజీహెచ్ చర్మవ్యాధుల నిపుణులైన వైద్యులు ఇచ్చిన నివేదికను తొక్కి పెట్టి వేరే వైద్యులను పిలిపించి ఇష్టమైన నివేదికలు ఇప్పిస్తున్నారు. అధికారులు నిర్దేశించిన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ హెల్త్ బులిటెన్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెల్త్ బులిటెన్ అసమగ్రంగా ఉండడం, కుటుంబసభ్యులు అడిగినా చంద్రబాబు ఆరోగ్యంపై వైద్య నివేదిక ఇవ్వక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 12వ తేదీన చంద్రబాబుని పరీక్షించిన వైద్యుల బృందం ఆయనకు ఛాతి, గడ్డం, వీపు, చేతులు, మెడ భాగంలో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీతో బాబు బాధపడుతున్నారని ఆయనను చల్లని వాతావరణంలోనే ఉంచాలని నివేదిక అందించారు. అయితే వైసీపీ ప్రభుత్వం, అధికారులు కలిసి రిపోర్ట్ ఇచ్చి రెండు రోజులు గడిచినా దానిని బయటపెట్టలేదు. గత శనివారం సాయంత్రం ఇంకా కొద్దిసేపట్లో కుటుంబసభ్యులు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్‌లో భాగంగా చంద్రబాబుని కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లనుండడంతో ఎటూ ఈ విషయం ఇంకా దాచలేము అని భావించే డాక్టర్లు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బయట పెట్టిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ములాఖత్ సమయంలో లోకేష్ రాజమహేంద్రవరం వైద్యులు ఇచ్చిన నివేదికపై జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌ను ప్రశ్నిస్తే ఆయన స్పందించలేదు. కావాలంటే కోర్టుకు చెప్పుకోమని ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తరువాత మెడికల్ రిపోర్ట్ బయటపడడం, దాని ద్వారా కోర్టుకు వెళ్లడంతో చంద్రబాబు బ్యారెక్‌లో ఏసీ ఏర్పాటుకు ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు డీ హైడ్రేషన్‌కు గురైన విషయాన్ని తొలుత అధికారులు ఖండించారు. తరువాత డీ హైడ్రేషన్ నిజమే అని అంగీకరించారు.
జైల్లో చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిశీలించిన రాజమహేంద్రవరం జీజీహెచ్ చర్మవైద్య నిపుణులు, అసోసియేట్ ప్రొఫెసర్ సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీత నివేదికలను తొక్కి పట్టి.. జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ శివకుమార్ అనే వైద్యుడ్ని ప్రెస్ మీట్‌కు తీసుకు వచ్చి కొత్తకథలు చెప్పించారు. ఈ డాక్టర్ శివకుమార్ చెప్పిందేమిటంటే ఇప్పుడున్న వాతావరణంలో అందరికీ డీ హైడ్రేషన్ వస్తుందట. చంద్రబాబుకు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తెలియవట.
ఆయనను ఆస్పత్రికి తరలించాల్సిన అవసరమే లేదట. మరి జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన నివేదిక సంగతేమిటంటే.. దాన్ని బయట పెట్టలేమని కోర్టుకు పంపిస్తామని చెబుతున్నారు. శివకుమార్ డాక్టర్ లాగ మాట్లాడకుండా వైసీపీ నేతలు మాట్లాడినట్లుగా మాట్లాడటం మీడియా ప్రతినిధులను సైతం ఆశ్చర్య పరిచింది. 67 కేజీలు బరువున్నారని.. ఉత్సాహంగా ఉన్నారని కథలు చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబుకు ఉన్న సమస్యలు ఏమిటంటే.. చర్మంపై దద్దుర్లు వస్తున్నాయని.. చల్లటి వాతావరణంలో ఉంచాలని సిఫారసు చేశామని చెప్పుకొచ్చారు.
కుట్ర లేకపోతే చంద్రబాబు ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులు ఇచ్చిన నివేదిక ఇవ్వడానికి అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికిప్పుడు మెడికల్ రిపోర్ట్ తమకు ఇస్తేనే వ్యక్తిగత వైద్యుల ద్వారా అవసరం అయిన మందులు పంపే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చంద్రబాబు హెల్త్ విషయంలో వాస్తవాలను దాచిపెడుతున్న ప్రభుత్వం వైఖరిపై కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఆరోగ్యంపైనా కారుకూతలే..
చంద్రబాబు ఆరోగ్యం పై తమకు ఆందోళనగా ఉందని కుటుంబసభ్యులు తమ బాధను పంచుకుంటుంటే దానిపై కూడా వైసీపీ నేతలు వారికి అలవాటైన భాషలో, ప్రతిపక్ష పార్టీ నేతలను ఇంతలా కించపరచొచ్చా.. అన్నట్లుగానే ప్రతిస్పందించారు.
ఒకరేమో బాబు జైల్లో ఉండి రాష్ట్రంలో కుట్రలకు వ్యూహాలు పన్నుతున్నారని, మరొకరేమో బాబు జైల్లోనే సంతోషంగా ఉన్నారని, జైలుకి వచ్చాక బాబు బరువు పెరిగారని, బాబుకి ఇంటి నుండి వచ్చే భోజనం ఒక్కసారి లోకేష్‌కు పెట్టి పరీక్షించిన తరువాతనే బాబుకి పంపాలంటూ ఇష్టానుసారంగా మాట్లాడిన తీరును టీడీపీ అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు. బాబుకి న్యాయస్థానాలలో బెయిలు రాకపోవడంతో ఇటువంటి డ్రామాలకు తెరలేపారు. ఇది తెలుగు డ్రామా పార్టీ అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.
అసలు చంద్రబాబుని ఈ ప్రభుత్వం ఏం చెయ్యాలని చూస్తోందో తమకు అర్ధం కావడం లేదని, చంద్రబాబు ఆరోగ్యం పై వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నేతలు తెగేసి చెపుతున్నారు. చంద్రబాబుకి అనుకోనిది ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ ప్రభుత్వానిదే అంటూ వైసీపీ నేతలను, ప్రభుతాన్ని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఒక విజనరీ నాయకుడికి ఇటువంటి పరిస్థితి రావటం మాత్రం అత్యంత దురదృష్టకరమనే చెప్పాలి. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి అధికారం వేదిక కాకూడదని ప్రభుత్వాలు గ్రహించాలి.