- ఆ లోగా సెక్షన్ 17ఏ పై తీర్పునిస్తామన్న సుప్రీం కోర్టు ధర్మాసనం
- తదుపరి విచారణ వరకు చంద్రబాబును అరెస్టు చేయకూడదు
- 17 ఏ తీర్పు అనుకూలంగా వస్తే కేసులన్నీ రద్దు
ఢిల్లి, చైతన్యరథం: ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెదేపా అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు దాఖ లు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం డిసెంబర్ 12కు వాయిదా వేసింది. సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసును రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ‘క్వాష్’ పిటిషన్‌పై తీర్పును రాస్తున్నామని న్యాయమూర్తులు అనురద్ధ బోస్, బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం నిన్న ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వెల్లడించింది.
నిన్న క్లుప్తంగా జరిగిన విచారణ సందర్భంగా.. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తే అప్పటి వరకు చంద్రబాబును రాష్ట్ర సీఐడీ అరెస్టు చేయరాదని గతంలో జరిగిన ఏర్పాటును కొనసాగించాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. అందుకు సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గీ అంగీకరించడంతో డిసెంబర్ 12 వరకు సీఐడీ చంద్రబాబును అరెస్టు చేయదు.
అవినీతి నిరోధక సవరణ చట్టం, 2018 లోని సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా తమపై సీఐడీ స్కిల్ కేసును నమోదు చేసినందున ఆ కేసును రద్దు చేయాలంటూ చంద్రబాబు చేసిన అభ్యర్థనను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీపావళి సెలవులకు ముందు సుప్రీం కోర్టులో 17 ఏ పై ఇరుపక్షాల వాదనలు ముగియటంతో ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో బెయిలు విషయం సుప్రీం కోర్టులో విచారణకు రాగా.. ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించే అవకాశం రాలేదు. ముందస్తు బెయిల్ విషయంపై తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసిన ధర్మాసనం అంతకు ముందే 17 ఏ పై తీర్పునిస్తామని స్పష్టం చేసింది. అదేరీతిలో నిన్నటి విచారణ సందర్భంగా డిసెంబర్ 12 లోగా కీలకమైన 17 ఏ తీర్పును ఇస్తామని ధర్మాసనం మరలా సూచించింది.
17 ఏ పై సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఆయనపై సీఐడీ అక్రమంగా ఇప్పటికే బెయిల్ వచ్చిన నమోదు చేసిన 6 కేసులు (ఇప్పటికే బెయిల్ వచ్చిన అంగళ్లు కేసు తప్ప) వీగిపోతాయని న్యాయ కోవిదుల అభిప్రాయం.