– జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడటమే ఆయన కర్తవ్యం
– 498ఎ నిందితుడు, కిడ్నాపర్‌కు సిఐడి చీఫ్ బాధ్యతలు
– రఘురామపై కక్షసాధించినందుకు మేనల్లుడికి పదవి
– కళంకిత అధికారులతో రాష్ట్రంలో అరాచకం
– తాడేపల్లి ప్యాలెస్ ఆడమన్నదే ఆట…పాడిరదే పాట!
– అధికారపార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిన సిఐడి
– ప్రతిపక్షనేతలపై చీటికీమాటికీ తప్పుడు కేసులు
ఆంధ్రప్రదేశ్ సిఐడి అంటే ఒకప్పుడు దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గల దర్యాప్తు సంస్థ. అధికారపార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారిన కొందరు కళంకిత అధికారుల తీరు కారణంగా ఆ సంస్థ ప్రతిష్ట రానురాను మసకబారింది. లా అండ్ ఆర్డర్ పోలీసుల దర్యాప్తుకు చిక్కని మొండికేసులను పరిష్కరించేందుకు గాను ఏర్పాటైన సిఐడి విభాగం ప్రస్తుతం అధికారపార్టీ కక్షసాధింపు కోసం ఆయుధంగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై పోలీసుశాఖలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా దేశంగానీ, రాష్ట్రంలో గానీ అత్యున్నత దర్యాప్తు సంస్థలకు అధిపతిని ఎంపికచేసేటప్పుడు వారి గత రికార్డులను పరిశీలించి క్లీన్ చిట్, సమర్థత ఉన్న అధికారులకు ఆ బాధ్యతలు అప్పగిస్తుంటారు. అయితే గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పోలీసు మ్యాన్యువల్, నిబంధనలు, చట్టాలను తుంగలో తొక్కి రాజకీయ ప్రత్యర్థులపై తాము ఉస్కో అన్నపుడల్లా ఏమాత్రం సంకోచించకుండా అడ్డగోలుగా విరుచుకుపడే నైపుణ్యం ఒక్కటే జగన్ రెడ్డి ప్రభుత్వంలో సిఐడిలో పోస్టింగ్ కు అర్హత. వారి గత చరిత్ర ఎంత వరస్టుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వంలో అన్ని అదనపు అర్హతలుగా పరిగణిస్తారు. నిక్కచ్చిగా, ముక్కు సూటిగా, నిబంధనలమేరకు వ్యవహరించే అధికారులను సిఐడి వంటి కీలక విభాగాలకు అధిపతులను చేస్తే జె-గ్యాంగ్ మాట వినే అవకాశం ఉండదు. అందుకోసమే ఏరికోరి ఎంచుకున్న కళంకిత పోలీసు అధికారులతో సిఐడి విభాగాన్ని నింపి తమ కక్షసాధింపునకు పావులుగా ఉపయోగించు కుంటున్నారు నేరచరితుడైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.
అమరావతి : రాష్ట్రంలో కళంకిత ఎపిసిఐడిలో దిగజారుడుతనం సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ ను నియమించడంతోనే ప్రారంభమైంది. ఆయన నేతృత్వంలో స్వతంత్రంగా సాగాల్సిన సిఐడి విభాగాన్ని జగన్ రెడ్డి జేబు సంస్థగా మార్చారు. కళంకిత అధికారిగా పేరుమోసిన సునీల్ కుమార్ నేతృత్వంలో సిఐడి విభాగం అరాచక వ్యవస్థకు ప్రతిరూపంగా నిలచింది. సునీల్ కుమార్ చరిత్ర ఎంతటి ఘనమైనదో మీరే చూడండి.
ఎపి సిఐడి వరస్టు!
జగన్ రెడ్డి ఏలుబడిలో ప్రస్తుతం సిఐడి విభాగం ప్రధాన కర్తవ్యం రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం నేతలకు ఏదోఒక బురద అంటించి… ఆ తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేయడం. ఏదో ఒక కేసులో తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను, సానుభూతి పరులను ఇరికించడమే ఏకైక లక్ష్యంగా ఎపి సిఐడి పనిచేస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వెంకటేష్‌పై తప్పుడు ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి అర్థరాత్రి ఇంటిపైకి వెళ్లి గోడలుదూకి తలుపులు పగలగొట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో తప్పులతకడకగా సిఐడి రూపొందించిన రిమాండ్ రిపోర్టు చూసిన జడ్జి తీవ్ర అగ్రహం, అసహనం వ్యక్తం చేస్తూ ఎపి సిఐడి వరస్టుగా మారిందని వ్యాఖ్యానించడం చూస్తే రాష్ట్రంలో సిఐడి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచచ్చు. పలు సందర్భాల్లో రాజకీయాలతోనూ ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను, సామాజిక కార్యకర్తలను, వ్యాపారవేత్తలను విచారణల పేరుతో పిలిచి సీఐడీ బెదిరింపులకు పాల్పడుతోంది. తప్పుడు కేసులు నమోదుచేసి విచారణ పేరుతో పిలచి తెలుగుదేశం పార్టీ నేతల పేరు చెప్పాలని వత్తిడితేవడం సిఐడి బరితెగింపు చర్యలకు పరాకాష్ట.
కళంకిత అధికారి సునీల్ కుమార్‌కు అందలం!
ఎపి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఈయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నమ్మినబంటు. జగన్ కళ్లలో ఆనందం చూడటానికి ఈయన ఎందాకైనా దిగజారడానికి సిద్ధమవుతారు. ఎంపి రఘురామ కృష్ణంరాజు ఎపిసోడే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడ్ని తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించడమేగాక లాకప్‌లో లాఠీలతో కుళ్లబొడుస్తూ తమ ఇష్టనేతకు లైవ్‌లో చూపించి రాక్షసానందం కలిగించిన మహోన్నత అధికారి ఈయన. సునీల్ కుమార్ గత చరిత్ర చూస్తే అన్నీ మరకలే కన్పిస్తాయి. భార్యను వరకట్నం కోసం వేధించడమే గాక తమ వికృత చర్యలను ప్రశ్నించిన అత్తమామలను కిడ్నాప్ చేసిన ఘన చరిత్ర ఈయనది. అంబేద్కర్ మిషన్ అనే సంస్థను ఏర్పాటుచేసి తాను గొప్ప అంబేద్కరిస్టుగా చెప్పుకునే ఈయన తన విధినిర్వహణలో బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం అమలుచేయరు. తన యజమాని జగన్‌రెడ్డి ఆదేశించినప్పుడు రాష్ట్రంలో సరికొత్త రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇష్టారాజ్యంగా వేధింపులకు పాల్పడుతున్నారు పీవీ సునీల్‌కుమార్. పలు ఆరోపణలున్న ఈ కళంకిత అధికారికి జగన్‌రెడ్డి ప్రభుత్వం సీఐడి చీఫ్ వంటి కీలక బాధ్యత అప్పజెప్పి వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో సునీల్‌కుమార్‌పై ఆయన భార్య పి.అరుణ వరకట్న వేధింపుల కేసు పెట్టారు. సంబందిత కేసు విషయంలో సొంత అత్తమామలను కిడ్నాప్ చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. గత 20 ఏళ్ల నుంచి సునీల్ కుమార్ అదనపుకట్నం కోసం సొంత భార్యను వేధింపులకు గురిచేస్తున్నారు. కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ సునీల్ కుమార్ భార్య అరుణ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. సునీల్ కుమార్ సెక్షన్ ఐ.పి.సి 498 (ఏ),506, డిపి యాక్ట్ సెక్షన్ 3,4 ల కింద తెలంగాణలో కేసు నమోద్కెంది. దీంతో సునీల్ కుమార్ అరుణ కుటుంబ సభ్యుల్ని సైతం కిడ్నాప్ చేసి వేధించారు. అరుణ సోదరులపై కిరాయి రౌడీలతో దాడికి పాల్పడ్డాడు. ఇటువంటి ఘనచరితుడిని జగన్ రెడ్డి ఏరికోరి తెచ్చుకున్నారంటే ఆయన అంతర్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో తాము చెప్పినట్లుగా ఆడినందుకు గాను నజరానాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి… సునీల్‌కుమార్ మేనల్లుడు నూతలపాటి సోనీఉడ్‌కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యత్వం ఇచ్చి కీలక బాధ్యతలు అప్పగించారు.
పీవీ సునీల్ కుమార్ గతంలో ఒక మతానికి వ్యతిరేకంగా వ్యవహరించి సమాజంలో రెండువర్గాల మధ్య మత చిచ్చుపెట్టేలా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది సెక్షన్-3 ఆఫ్ ది పోలీస్ పోర్సెస్ (రిస్ట్రిక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్ -1966, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ – 1964కు విరుద్దం. దీనికిగాను సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్.ఆర్.పి.ఎఫ్) కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పిర్యాదు కూడా చేసింది.
అమ్మాయిలను వేధించిన జగదీష్‌కు సిఐడిలో పోస్టింగ్!
జగదీష్‌పై ఉన్న ఆరోపణలను పరిశీలిస్తే ఆయన చరిత్ర ఎంత ఘనమైందో ఇట్టే తెలిసిపోతుంది. స్టేషన్‌కు వచ్చిన మహిళలతో అసభ్య ప్రవర్తన, రౌడీ షీటర్లతో సన్నిహిత సంబంధాలు, ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధం, నరసరావుపేట పరిధిలో భూకబ్జాలు, అక్రమ దందాతో, బినామీ పేర్లతో ఆస్తులు, లొంగని మహిళలపై అక్రమ కేసులు, ప్రేమ పేరుతో విద్యార్థినులకు వేధింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు జగదీష్‌పై ఉన్నాయి. ఇన్ని ఆరోపణలున్న జగదీష్‌కు సీఐడిలో కీలక బాధ్యతలు అప్పగించడంతో అసలే కోతి… ఆపై కల్లుతాగింది అన్న చందంగా ఆయన అరాచకానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది.
పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో సామాజిక కార్యకర్త గార్లపాటి వెంకటేష్, టిడిపి సోషల్ మీడియా ఫ్రీ లాన్సర్ సాంబశివరావుల అక్రమ అరెస్టులో కీలకపాత్ర పోషించిన జగదీష్ చరిత్ర మొత్తం అవినీతి, అరాచకాల మయం. గుంటూరు జిల్లా నరసరావుపేట పరిధిలో ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లలు పుట్టిన తర్వాత నాకు సంబంధం లేదంటూ ముఖం చాటేశాడు. దీనిపై గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ నెం.210/2020 కేసు నమోదైంది.
టిడిపి వారిని వేధించే అధికారులకు కీలక పోస్టింగులు
మొన్నటి వరకు సీఐడిలో సైబర్ క్రైమ్‌లు చూసింది, అక్రమ కేసుల ఫైళ్లు నడిపింది రాధికా జీఆర్. 20 మందికి పైగా ఉద్యోగులను ప్రత్యేకంగా నియమించుకుని సోషల్ మీడియాలో ఎవరు పోస్టు పెట్టినా వాళ్ల లొకేషన్ తీయడం, నోటీసులు పంపించడం, యాక్టివ్‌గా ఉన్నవారిని ఫోన్‌లు చేసి బెదిరించడం, అక్రమ కేసులు నమోదు చేయడం చేశారు. ఆమె పనితీరుకు మెచ్చి ఆమె కోరిక మేరకు శ్రీకాకుళం ఎస్పీగా తాజాగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలావుండగా సిఐడిలో ప్రతి ఫైలు ఓఎస్ డి విజయ్‌పాల్ కనుసన్నల్లోనే ముందుకు నడుస్తుంది. ప్రతిపక్షనేతల వేధింపులకు సంబంధించి దశ, దిశ నిర్ధారణ చేసేది ఇతనే. రిట్కెరైన తర్వాత కూడా ఈయనను విధుల్లోకి తీసుకుని ఓయస్‌డి హోదా ఇచ్చి ప్రతిపక్ష అభ్యర్థులపై తప్పుడు కేసులు బనాయించడానికి ఉపయోగిస్తున్నారు. ఇతని కుటుంబ సభ్యులకు, బంధువులకు ఏ అవసరం వచ్చినా సీఐడి కార్యాలయం నుంచే కార్లు, భోజనాలు… అన్నీ వెళతాయి. డీఐజి సునీల్ నాయక్‌ను డెప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి డీఐజిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇతను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏరోజూ స్వతంత్రంగా బాధ్యతలు నిర్వహించిన దాఖలాలు లేవు. డూడూ బసవన్నలా వ్యవహరిస్తున్నారు.
యే క్యా హై సీఐడి ?
రాష్ట్రంలో గత మూడేళ్లుగా టిడిపి నేతల టార్గెట్‌గా ఎపి సిఐడి వ్యవహరించిన ఘన కార్యాలు మచ్చుకుకొన్ని ప్రజలముందుంచుతున్నాం. సీఐడి ఒక పద్ధతి, విధానం లేకుండా వైసీపీ కీలక నేతలు ఇచ్చే ఆదేశాల మేరకు పనిచేస్తోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిన సందర్భంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తూ ఒకసారి మాజీ మంత్రి నారాయణ మీద, మరోసారి శాసనమండలి సభ్యులు, ఉద్యోగసంఘ నేత అశోక్‌బాబు, సామాజిక కార్యకర్త రంగనాయకమ్మ, నలంద కిషోర్ ఇలా ఒక్కొక్కరిపై కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ప్రయత్నించింది.
1. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి నెపంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్ట్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ డ్కెరెక్టర్ అంజీకుమార్‌పై ఐపీసీ సెక్షన్ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167, 217 కింద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
2. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడిరగ్ నెపంతో మాజీమంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో వేధింపులకు గురి చేశారు.
3. పదో తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే పరీక్ష పేపర్ల లీకేజీ పేరుతో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా విచారణ చేయకుండా, అధారాలు లేకుండా అరెస్టు చేశారు.
4. ఉద్యోగుల హక్కుల కోసం ప్రశ్నించిన మాజీ ఉద్యోగుల సంఘంనేత, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై గతంలో ఉద్యోగంలో పదోన్నతి కోసం దొంగ సర్టిఫికిట్ తెచ్చారంటూ అక్రమ కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్టు చేశారు.
5. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసినందుకు టీడీపీ మహిళా నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషకు అర్థరాత్రి నోటీసులు జారీ చేశారు. విచారణ పేరుతో 7 గంటల పాటు బంధించి విచారించారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు.
6. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును హైదారాబాద్ వెళ్లి సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తీవ్రంగా కొట్టి గాయపరిచారు.
7. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన సోషల్ మీడియా కార్యకర్తలు కృష్ణారావు, నలంద కిషోర్ సహా సామాజిక కార్యకర్త 60 ఏళ్ల వయసున్న రంగనాయకమ్మపై అక్రమ కేసు బనాయించి విచారణ పేరుతో వేధింపులకు గురి చేశారు. ఇందులో నలంద కిషోర్ కోవిడ్‌తో చనిపోయారు.
8. ఉగాండాలో ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో కదిరి వైసీపీ ఎమ్మెల్యే ఓబుల్ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తూ పోస్టు పెడితే 70 ఏళ్ల వయసున్న వాళ్ల నాన్న అయిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేసి హింసించారు.
9. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన గారపాటి వెంకటేష్ ని అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసులు అర్దరాత్రి అతని ఇంట్లోకి అక్రమంగా చొరబడి తలుపులు గొట్టి స్టేషన్‌కి తీసుకెళ్లారు. విచారణ పేరుతో తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆ గాయాలు బయటపడకుండా మెడికల్ రిపోర్టును తారుమారు చేసేందుకు ప్రయత్నించారు.
10. ఇదే కేసులో సాంబశివరావు అనే యువకుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా గొట్టడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ బూతులు తిట్టారు. సీఐ బూటు కాలుతో సాంబశివరాలు గుండెల మీద తన్నారు. ఇక్కడ జరిగింది బయటకు చెప్తే తప్పుడు కేసులు పెట్టి మళ్లీ లోపలేస్తామని బెదిరించారు.
11. 60 వేల మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ అధికారులు పీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు బనాయించారు. స్నేహితుడి పరామర్శకు వెళ్లిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై తప్పుడు కేసులు పెట్టారు.
రాష్ట్రంలో కళంకిత అధికారులను అడ్డుపెట్టుకొని జగన్‌రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై న్యాయపోరాటం చేసి చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇప్పటివరకు వివిధ సందర్భాల్లో ఎపి సిఐడి యథేచ్చగా, నిబంధనలను అతిక్రమించి సాగించిన అరాచకాలపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పెద్దల అండదండలతో కళంకిత అధికారులు సాగిస్తున్న అరాచాలకు ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమేగాక ఎపిసిఐడి బాధిత వర్గాలకు న్యాయసహాయం అందించేందుకు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో 24/7 పనిచేసేలా ప్రత్యేక న్యాయసహాయ విభాగాన్ని ఏర్పాటుచేసింది. మొత్తమ్మీద కొందరు కళంకిత అధికారుల చర్యలతో గతంలో ఎన్నడూలేని విధంగా ఎపి సిఐడి ప్రతిష్ట మసక బారింది.