- సీఎం చంద్రబాబుకు భువనేశ్వరి ప్రశంసలు
- తనకు చేనేత చీరలు కొనితెచ్చినందుకు కృతజ్ఞతలు
అమరావతి(చైతన్యరథం): చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రశంసించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి కోసం రెండు చేనేత చీరలు కొనుగోలు చేశారు. దీనిపై నారా భువనేశ్వరి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. తన కోసం చేనేత చీరలు కొని తెచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని భువనేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం అద్భుతమైన నిర్ణయం. చేనేత అనేది గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మాత్రమే కాదు, స్థిరమైన, నైతిక వారసత్వ కళా సంపద. మనం చేనేత దుస్తులను ధరించాలని నిర్ణయించుకున్నామంటే, మన సంప్రదాయ దుస్తుల శైలికి సంబంధించిన అందమైన వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్టే లెక్క. మీ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం చేనేతకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అంకితభావంతో చేస్తున్న కృషి ఎంతో సంతృప్తికరంగా ఉందంటూ చంద్రబాబును ఉద్దేశించి భువనేశ్వరి ట్వీట్ చేశారు.