అమరావతి (చైతన్య రథం): భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లను చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏపీ సీఎస్ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుచిత్ర ఎల్ల.. కేబినెట్ ర్యాంకుతో రెండేళ్ల కాలానికి పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేనేత, హస్తకళల అభివృద్ధి రూపకల్పనకు ఆమెనుంచి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏరో స్పేస్, డిఫెన్స్ గౌరవ సలహాదారుగా సతీష్‌రెడ్డి
ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చీఫ్ జి సతీష్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం సతీష్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు సలహాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కోరింది. పారిశ్రామిక కారిడార్లు క్లస్టర్లు టెస్టింగ్ ఫెసిలిటీల్లో పరిశ్రమల ఏర్పాటు, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ సలహాలు, సూచనలు ఇవ్వాలని సతీష్‌రెడ్డిని ప్రభుత్వం కోరింది. యువతకు.. నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఆయన సలహాలు ఇవ్వనున్నారు.
ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీ
ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీ నియమితులయ్యారు. గాంధీని రెండేళ్లపాటు కేబినెట్ ర్యాంకు హోదాలో నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా శ్రీధర పనిక్కర్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సోమనాథ్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తున్నారు. పాలనా వ్యవహారాలు, పరిశ్రమలు, పరిశోధనలో సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.