రాయ్‌పూర్: తెలంగాణ ఎన్నికల్లో కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఓ సంచలనం. ప్రభుత్వ నోటిఫికేషన్లు లేక కడుపు మండిన ఆమె న్యాయం కోసం ఎన్నికల బరిలోకి దిగింది. చివరకు ఓటమి చవి చూసినా ప్రజల హృదయాల్లో మాత్రం స్థానం దక్కించుకుంది. అయితే, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఓ దినసరి కూలి ఇలాగే న్యాయం కోసం బరిలోకి దిగాడు. కుమారుడి హత్యతో ఆగ్రహానికి గురైన అతడు ప్రజాస్వామ్యమే ఆయుధంగా ఎన్నికల బరిలోకి దిగి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్యర్థిపై ఘన విజయం సాధించాడు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్ సాహూ ఓ దినసరి కూలి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అతడి కుమారుడు ఈ ఏడాది జరిగిన అల్లర్లల్లో కన్నుమూశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సాజా నియోజకవర్గంలోని బీరాన్‌పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మరణించిన ముగ్గురిలో ఈశ్వర్ సాహూ కుమారుడు భవనేశ్వర్ సాహూ ఒకరు. కాంగ్రెస్ హయాంలో తన కుమారుడు ఇలా దుర్మరణం చెందడాన్ని ఈశ్వర్ తట్టుకోలేకపోయాడు. కాంగ్రెస్‌పై అతడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే, దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది.
ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో సాహూను సాజా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ బరిలోకి దించింది. మరోవైపు కాంగ్రెస్ తరపున రాజకీయ దిగ్గజం రవీంద్ర చౌబే బరిలోకి నిలిచారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయన సొంతం. కానీ ఎన్నికల ఫలితం మాత్రం రవీంద్ర చౌబేకు ఊహించని అపజయాన్ని ఇచ్చింది. ఈశ్వర్ సాహూ రవీంద్ర చౌబేపై ఏకంగా 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. దీంతో, ఈ సామాన్యుడి విజయం యావత్ దేశం దృష్టినీ ఆకర్షించింది.