- ఆయన వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే
- అసెంబ్లీ రూల్‌బుక్ చదవాలని హితవు
- ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించాలని సూచన
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత కాదని… ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రతిషక్ష హోదా రావాలంటే మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో పయ్యావుల స్పందించారు. అమరావతిలో బుధవారం మీడియాతో పయ్యావుల మాట్లాడారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్‌కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. స్పీకర్‌కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడమేంటని నిలదీశారు.
అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి
ప్రజలు ఇచ్చిన తీర్చును జగన్ గుర్తించలేనట్టుంది. జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని జనమే నిర్ణయించారు. ఆ హోదాపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అధికార పార్టీగా మేం హుందాగానే స్పందించి మంత్రులతో పాటు ప్రమాణం చేయించాం. దేశవ్యాప్తంగా అన్ని శాసన సభలు, పార్లమెంట్లో పాటించే నిబంధనలను జగన్ తెలుసుకోవాలి. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా? ఆ సలహాలు తీసుకుంటే పూర్తిగా మునిగిపోతారు. మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు… శాసనసభ పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ షట్టర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి. ఓనమాలు కూడా చూసుకోకుండా మీతో ఈ లేఖ రాయించారు. 10 శాతం సభ్యులు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని పయ్యావులు ప్రశ్నించారు.
అప్పుడు మీ నోటితో మీరే చెప్పారుగా?
మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిటికేస్తే చంద్రబాబుకు ప్రతిషక్ష హోదా కూడా ఉండదని జగన్ అహంకారపూరితంగా మాట్లాడారు. శాసనసభ సాక్షిగా జగనే 10 శాతం నిబంధన గురించి స్వయంగా చెప్పారు కదా? మళ్లీ ఇప్పుడు 10 శాతం నిబంధన లేదు… తూచ్ అంటారా? ప్రజలు అధికారం తీసేసినా కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్లుంది. ప్రతిషక్ష హోదాతో క్యాబినెట్ ర్యాంకు వస్తుంది… దానితో జులుం చేయొచ్చనుకుంటున్నారేమో! ఆ ధోరణి మార్చుకోండి. ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించండి. సభలో మీరు మాట్లాడాలనుకుంటే… అందరి సభ్యుల్లాగే మీకూ మాట్లాడే హక్కు ఉంటుంది. 1984లో పార్లమెంట్లో ఉపేంద్రను ఫ్లోర్ లీడర్‌గా పేర్కొన్నారు తప్ప… ప్రతిషక్ష హోదా ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో ప్రతిపక్ష నేతగా పీజేఆర్ లేరు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా అప్పటి స్పీకర్ ఆయన్ను గుర్తించారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయని పయ్యావుల అన్నారు.