విజయవాడ: జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే నిరసన తెలియజేసే హక్కు కూడా వారికి లేదు అన్నట్టుగా పోలీసులు దళితులను అరెస్టులు చెయ్యడం తీవ్రంగా ఖండిరచారు. దళితులపై నమ్మకద్రోహమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగుతోందన్నారు. దాడులను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమకేసులు పెట్టి హింసిస్తున్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 నెలల్లో దళితులపై జరిగినన్ని దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాయత్నాలు, దళిత మహిళలపై మానభంగాలు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతూ సొంత వారిపైనే కేసులు పెట్టేలా అమాయక దళితులను జగన్ ఉసిగొల్పుతున్నాడన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నేతలు పిన్నమరాజు త్రిమూర్తిరాజు, సంధిరెడ్డి గాయత్రీ, మురళి కృష్ణంరాజు, ఘంటా కృష్ణమోహన్, మాల్యాద్రి, పడమటి రామకృష్ణ, ప్రసాద్, గొట్టుముక్కల వెంకీ, తదితరులు పాల్గొన్నారు.