అమరావతి: వివిధ చార్జీలరూపంలో జనాన్ని బాదడంతో జగన్ మోసపురెడ్డి కుల,మత,ప్రాంతీయ భేదాలు లేవని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదలచేస్తూ… రెండునెలలు కూడా కాకముందే ఆర్టీసీ ఛార్జీలు మళ్లీ పెంచి ప్రజల నడ్డివిరిచారని అన్నారు. విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేశారని తెలిపారు. ఆర్టీసీ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని తెలిపారు. పల్లె వెలుగు సర్వీసుల్లో గరిష్ఠంగా రూ. 25, ఎక్స్ ప్రెస్ లో రూ. 90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో రూ. 120, ఏసీ సర్వీసుల్లో రూ. 140 పెంచారని విమర్శించారు. రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ. 500 కోట్లను పేదల నుండి వైసీపీ ప్రభుత్వం కొట్టేస్తుందని అన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు.