- నాసిరకం మద్యం తాగి 30 వేల మంది..
- కరోనాలో సరైన వైద్యం అందక 50 వేల మంది..
- రైతు ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానం
- హత్యలు, దాడులు, వేధింపులతో 200 మంది మృతి
- 23 వేల మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు
- గుంతల రోడ్లు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో 27 వేల మంది
- 275 మంది అమరావతి రైతుల ఆత్మహత్యలు
- నాసిరకం మద్యం తాగి 30 వేల మంది..
- కరోనాలో సరైన వైద్యం అందక 50 వేల మంది..
- రైతు ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానం
- హత్యలు, దాడులు, వేధింపులతో 200 మంది మృతి
- 23 వేల మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు
- గుంతల రోడ్లు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో 27 వేల మంది
- 275 మంది అమరావతి రైతుల ఆత్మహత్యలు
అమరావతి, చైతన్యరథం: గత నాలుగున్నరేళ్ల నుండి అరాచక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి ప్రజలపై విపరీతమైన భారాలు మోపడమే కాక, రాష్ట్ర సహజ సంపదలను దోచుకోవడమే కాక పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను సైతం హరిస్తున్నారు. ఈ కాలంలో జగన్ రెడ్డి మూకలు అధికార దర్పంతో రాజకీయ హత్యలు, దాడులు, వేధింపులకు తోడు అరాచక, అసమర్థ పాలన కారణంగా దాదాపు లక్షా 31వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అని చెప్పుకునే జగన్ రెడ్డి ఫక్తు పెత్తందారుడిలా సాగించిన పాలనలో ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాల వారి ప్రాణాలే పోయాయి. జగన్‌రెడ్డి నిర్లక్ష్య, అసమర్ధ పాలన కారణంగా చనిపోతున్న వారిలో కూడా పేదలే అధికంగా ఉన్నారు. నాసిరకం మద్యంతో 30 వేల మంది, కరోనా కాలంలో చికిత్స అందించటంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా 50 వేల మంది చనిపోయారు. 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, వివిధ ప్రమాదాల్లో 29 వేల మంది, రాజకీయ హత్యలు, దాడులు, వేధింపుల కారణంగా 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 23 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా జగన్‌రెడ్డి పాలనలో నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో మారణ హోమం సాగుతోంది.
నాసిరకం మద్యంతో 30 వేల మంది మృతి
మద్యం పాలసీని తన సొంత బొక్కసం నింపుకునే విధంగా మార్చుకొని అడ్డగోలుగా దోపిడీ చేసేందుకు తక్కువ రేటుకు మద్యం కొని ఎక్కువ రేటుకు అమ్మి స్తున్నారు. అంతటితో ధనదాహం తీరక పరిధులు దాటి దోచుకోవాలనే ఆత్యాశతో తన మందిమాదగలతో మద్యం తయారీ కంపెనీలు పెట్టించి వాటిల్లో తయారయ్యే నాసిరకం మద్యాన్ని మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీంతో ప్రజలు ముఖ్యంగా పేదలు ఈ నాసిరకం మద్యం తాగి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నాలుగేళ్లలో దాదాపు 30 వేల మంది పేదలు ప్రాణాలు విడిచారు. నాసిరకం మద్యం కారణంగా సక్రమించిన వ్యాధులతో ప్రతిరోజూ హాస్పటల్స్‌కు పేదలు వచ్చి చేరుతున్నారు. పేద ప్రజలు వైద్య ఖర్చులు భరించలేక కొద్దొగొప్పొ ఉన్న ఆస్తులు, భార్యల పుస్తెలు అమ్ముకుంటున్నారు. ఆస్తులు అమ్ముకున్నా కాని, ప్రాణాలు నిలబడడం లేదు. దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి పేద మహిళల చేత ఓట్లు వేయించుకొని గెలిచిన జగన్‌రెడ్డిదే ఈ పాపం.
కరోనాలో 50 వేల మంది మృతి
కరోనా కాలంలో జగన్‌రెడ్డి అవినీతి, అసమర్ధత పాలన కారణంగా వేలాది మంది చనిపోయారు. కరోనా విపత్తును గ్రహించి ఆరోగ్య శాఖను సమాయత్తం చేసి ఉంటే 50వేల మందికి పైగా మరణించి ఉండే వారు కాదు. కరోనా కాలంలో పేదలకు వైద్యం అందడం గగనమైపోయింది. వారికి సరైన మందులు అందలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమయ్యాయి. దీంతో వరుసగా వేల కొద్ది ప్రాణాలు గాల్లో కలిసాయి. దీనికితోడు మెడికల్ మాఫియాకు జగన్ రెడ్డి అండాదండగా నిలిచారు. మందులు, ఇన్‌జెక్షన్లు బ్లాక్ మార్కెట్‌లో కొనుక్కొవాల్సిన పరిస్థితి. ఐదు వేలు ఉన్న ఒక్క ఇంజెక్షన్ 70 వేలు, లక్ష రూపాయలు పెట్టి కొనుక్కొవాల్సి వచ్చింది. కొనలేని పేదలు ప్రాణాలు వదిలారు. అధికారిక లెక్కల ప్రకారమే 50,399 మంది చనిపోయారు. ఇక ప్రభుత్వ లెక్కలకు అందని వారు చాలా మంది ఉన్నారు.
రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానం
జగన్ రెడ్డి సహజ వనరులు దోపిడీ, అవినీతిపైనే దృష్టి పెట్టి వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రైతులు పండిరచిన పంటకు సరైన గిట్టుబాటు ధర దొరకలేదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మూడుపువ్వులు ఆరు కాయలుగా ఉన్న వ్యవసాయ రంగం జగన్‌రెడ్డి హయాంలో కునారిల్లిపోయింది. కొన్ని చోట్ల పంటలు పండక, కొన్ని చోట్ల పంటలు పండినా లాభాలు లేక రైతులు అప్పులపాలయ్యారు. దీంతో జగన్ పాలనలో ఏడాదికేడాది ఆత్మహత్యలు చేసుకునే రైతుల సంఖ్య పెరిగింది. 2020లో 889 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా 2021లో ఆ సంఖ్య 1,065కు చేరింది. 2023లో ఇంకా పెరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య మూడు వేల మందికి పైగానే ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.
రాజకీయ హత్యలు, దాడులు, వేధింపులతో 200 మంది మృతి
జగన్‌రెడ్డి అరాచక పాలనను ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, వారిని హత్య చేయడం పరిపాటిగా మారింది. అందులోనూ బడుగు, బలహీన వర్గాలనే అధికంగా ఊచకోత కోశారు. ఈ అరాచక పాలనలో దాడులు, వేధింపులు, హత్యలు కారణంగా ఎస్‌సీలు 28 మంది, ఎస్‌టీలు 9 మంది, బిసీలు 74 మంది, మైనార్టీలు 8 మంది, రాజకీయ కక్షతో 76 మంది ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను చంపేశారు. 74 మంది బిసీలను హత్య చేశారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన బిసీ నేత తోట చంద్రయ్యను నడిరోడ్డు మీద నరికి చంపారు. తన అక్కను వేధించిన వైసిపి కార్యకర్తను నిలదీసినందుకు బాపట్ల జిల్లాలో అమర్నాధ్ గౌడ్ అనే బాలుడ్ని సజీవదహనం చేశారు. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న దళితుడైన సుబ్రమణ్యాన్ని చంపేసి ఇంటికి పార్శిల్ చేశాడు. దళిత డాక్టరైన సుధాకర్ పిపిఇ కిట్లు అడిగిన పాపానానికి ఘోరంగా అవమానించి మనోవేదనతో చనిపోయేట్లు చేశారు. చిత్తూరు జిల్లాలో లిక్కర్ రేట్లపై ప్రశ్నించిన దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అక్రమ ఇసుక రవాణను ప్రశ్నించిన వరప్రసాద్ అనే దళితుడ్ని గుండుగీయించి అవమానించారు. పిడుగురాళ్ల దగ్గర మంత్రుబాయి అనే గిరిజన మహిళను వైసిపి నేత ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు. కర్నూల్ జిల్లాలో పోలీసులు వేధింపులు తట్టుకోలేక అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతురు కంటే బాగా చదువుతుందనే కారణంగా వైసిపి నేత వేధించడంతో పలమనేరులో మిస్బా అనే ముస్లీమ్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఇలా జగన్ రెడ్డి చేయించిన హత్యలు, దాడులు, వేధింపులతో దాదాపు 200 మంది చనిపోయారు.
నిరుద్యోగుల ఆత్మహత్యలు
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలన్నీంటీని భర్తీ చేస్తానని జగన్ రెడ్డి యువతకు ఆశపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయాడు. ప్రభుత్వ ఖాళీ పోస్టుల భర్తీ ఊసే లేదు. ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి వాలంటీర్ ఉద్యోగాలు కల్పించి అదే గొప్ప ఉపాధిగా ప్రచారం చేసుకున్నారు. మరోవైపు ప్రయివేట్ రంగంలోనూ ఉపాధి లేకుండా పోయింది. కొత్త కంపెనీలు తీసుకురావడం అటుంచి ఉన్న కంపెనీలనే రాష్ట్రం నుంచి పారద్రోలారు. దీంతో ఉద్యోగం, ఉపాధి దొరకని నిరుద్యోగులు నిశ్పృహలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో దాదాపు 23,263 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.
అమరావతి రైతుల ఉసురు తీశారు
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిని జగన్‌రెడ్డి రాజకీయ కక్షతో, తన భూదందా కోసం నిర్వీర్యం చేశారు. ఎన్నో అకాంక్షలతో, ఎంతో ఆశతో రాజధానికి భూమలిచ్చిన రైతుల నోట్లో మట్టికొట్టారు. తాము కట్టుకున్న కలలసౌధం కళ్లముందే కూలిపోవడంతో తట్టుకోలేక రాజధాని రైతులు గుండెలు పగిలిపోయాయి. అటు ఉపాధి లేక…ఇటు ఇచ్చిన భూములకు విలువ లేక ఏమీ పాలుపోని స్థితిలో 275 మంది ప్రాణాలు విడిచారు.
అవినీతి, నిర్లక్ష్యం ఖరీదు ఈ ప్రాణాలు
జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి కారణంగా రాష్ట్రంలో పలు ప్రమాదాల్లో వందల మంది చనిపోయారు. నిబంధనలు విరుద్దంగా టూరిస్టు బోటు గోదావరిలో ప్రయాణించడంతో కచ్చలూరు బోటు ప్రమాదంలో 46 మంది చనిపోయారు. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుండి విషవాయువు లీక్ కావడంతో 12 మంది చనిపోయారు. వెయ్యికిపైగా జబ్బున పడ్డారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం వలన 44 మంది మృతి చెందారు. గుంతల రోడ్లు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో ఈ నాలుగేళ్లలో 27 వేల మందికి పైగా మృతి చెందారు.
చంద్రబాబు అరెస్ట్, నిర్బంధాన్ని తట్టుకోలేక అభిమానుల మృతి
జగన్‌రెడ్డి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా లేని కేసులు బనాయించి చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించి జైలుకు పంపించడంతో అది చూసి తట్టుకోలేక రాష్ట్రంలో అనేక గుండెలు మూగబోయాయి. ఇప్పటి వరకు 164 మంది చంద్రబాబు అభిమానుల మృతికి కారకుడయ్యారు జగన్ రెడ్డి. మొత్తంగా చూస్తే జగన్‌రెడ్డి నరహంతక పాలన కొనాసాగిస్తున్నారు.