కేంద్రంనుంచి నిపుణులవరకు తప్పంతా మీదేనని తేల్చారు!
పోలవరం పరిహారంపై నాటి హామీలు ఏమయ్యాయి?
అదాన్ డిస్టిలరీపై సమగ్ర విచారణ జరపండి!
రాష్ట్రంలో బడులు మూస్తున్నారు…బార్లు తెరుస్తున్నారు!
జగనన్న పేదలకు ఇచ్చింది కాలనీలు కాదు… చెరువులు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వ ఘోర తప్పిదాలపై ఇప్పుడు సిఎం జగన్ ఏం సమాధానం చెబుతారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. పోలవరాన్ని బలిపెట్టింది వైసిపి ప్రభుత్వమే అనే విషయాన్ని టీడీపీ మొదటి నుంచి చెబుతోందని…తాజా రిపోర్టులు ద్వారా అదే నిజమని తేలిందని అన్నారు. పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యూహం లేదని, సమన్వయం లేదని కేంద్రం తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 2020లో పూర్తి కావాల్సిన పోలవరం…2024కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని కేంద్రం పార్లమెంట్ లోనే చెప్పిందన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఐఐటి నిపుణులు బృందం కూడా రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల కారణంగానే పోలవరంలో విధ్వంసం జరిగిందని తేల్చారన్నారు. పోలవరం కాంట్రాక్టర్ ను మార్చవద్దని పీపీఏ, కేంద్ర జలనరుల శాఖ రాసిన లేఖలను, చేసిన హెచ్చరికలను నాడు జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. పోలవరం పాపంలో అన్ని వేళ్లూ జగన్ వైపే చూపుతున్నాయని… ఇప్పుడు జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం, వైఫల్యాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. 2014లో తన ప్రయత్నం కారణంగా ఏపీలో చేరిన పోలవరం విలీన గ్రామాలు…ఇప్పుడు ఈ ప్రభుత్వ వైఖరితో మళ్లీ తెలంగాణలో కలపాలనే డిమాండ్ చేస్తున్నాయన్నారు. పోలవరం ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారం పై జగన్ ఇచ్చిన హామీలు, పునరావాస కాలనీల నిర్మాణం ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు.
స్ట్రాటజీ మీటింగ్ లో చర్చించిన అంశాలు:
1. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేయని పరిస్థితిపై సమావేశంలో చర్చించారు. ప్రతి అంశంలో ప్రచారం కోసం తపిస్తున్న ప్రభుత్వం…పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలో దారుణంగా విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రంలో బడులను విలీనం పేరుతో మూసివేస్తున్న ప్రభుత్వం…..బార్లు మాత్రం తెరుస్తున్నారని దుయ్యబట్టారు. 11 లక్షల మంది విద్యార్థులు పాఠశాలకు దూరం అవుతున్న విషయంలో పోరాటం చెయ్యాలని నిర్ణయించారు.
2. రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరుతో ఇచ్చిన స్థలాలు నివాస యోగ్యం కాదన్న విషయం మరోసారి స్పష్టం అయ్యిందని అన్నారు. వర్షాలకు, వరదలకు కాలనీలు పూర్తిగా నీటమునిగి….ప్రభుత్వ, వైసీపీ నేతల అక్రమాలను తేటతెల్లం చేశాయని అన్నారు. అవి జగన్నన కాలనీలు కాదు…..జలగన్న కాలనీలు….ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి అని విమర్శించారు. అక్కడి ఇళ్లు కట్టుకుంటూ బోట్లలో వెళ్లాల్సి వస్తుందని అన్నారు.
3. పేదల ఆకలి తీర్చే రేషన్ పంపిణీపైనా జగన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయాలు చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో నాలుగు నెలలుగా రేషన్ బియ్యం పంపిణీ నిలిపివేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని 1.42 కోట్ల కార్డు దారులందరికీ బియ్యం పంపిణీ చెయ్యాలని డిమాండ్ చేశారు. నెలకు 5 కేజీల చొప్పున నిలిపివేసిన 4 నెలలకు 20 కేజీలు, ఆగష్టు నెల కూడా కలిపి 25 కేజీలు బియ్యం సరఫరా చేయాలి.
4. రాష్ట్రంలో రోజురోజుకూ రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అన్నారు. జగన్ చెప్పినట్లు జులై 15 నాటికి రోడ్లు అద్దాల్లా మారకపోగా…మరింత దెబ్బతిని వాహనదారులు నరకం చూస్తున్నారన్నారు. వివిధ సెస్సులు, పన్నుల ద్వారా రూ.1,800 కోట్లు జనం నుంచి గుంజిన ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్లు బాగుచెయ్యాలని డిమాండ్ చేశారు.
5. ఇక అప్పుల విషయంలో ప్రభుత్వం సమాధానం పెద్ద బూటకం అని నేతలు అన్నారు. వైసీపీ హయాంలో కేవలం 1.41 లక్షల కోట్లు అప్పులు మాత్రమే చేశారనే ప్రకటనను తప్పు పట్టారు. ప్రభుత్వానికి దైర్యం ఉంటే వెంటనే దీనిపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
6. కేవలం రూ. లక్ష మూలధనంతో ఏర్పాటైన ఎంపీ విజయసాయిరెడ్డి బినామీ అదాన్ డిస్టలరీకి రెండేళ్లలోనే రూ. 2,400 కోట్ల విలువైన ఆర్డర్లు ఏ విధంగా ఇచ్చారు? వీటన్నింటిపై ఈడీ సమగ్ర విచారణ జరపాలని సమావేశం డిమాండ్ చేసింది. మద్యపాన నిషేదం చేస్తేనే ఓట్లు అడుగుతానన్న జగన్ రెడ్డి వచ్చే 15 ఏళ్ల పాటు మద్యంపై రూ.58 వేల కోట్ల అప్పులు ఎలా తెస్తారు? 2025 వరకు 840 బార్లకు లైసెన్స్ లు ఏ విధంగా పొడిగిస్తారు? అని ప్రశ్నించారు.
7. రాష్ట్రం ప్రభుత్వం చెపుతున్న సంక్షేమ పథకాలపై స్పష్టమైన లెక్కలు ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. రకరకాల కారణాలతో ప్రజలకు అందే సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారని…ఏ పథకం ఎంతమందికి అందుతుంది అనే విషయంలో వాస్తవ పరిస్థితికి…ప్రభుత్వ లెక్కలకు సంబంధం ఉండడం లేదని నేతలు అన్నారు.
8. టీడీపీ నిర్వహిస్తున్న రైతు పోరు సభల ద్వారా అన్నదాతల కష్టాలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే అవకాశం లభిస్తుందన్నారు. రైతు సమస్యలపై ఈ సభల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. మోటార్లకు మీటర్లపై కూడా పోరాటం ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. నరేగా పనుల్లో కూలీ చెల్లించ లేదని, వారికి ఇచ్చే సమ్మర్ గ్రాంట్ కూడా ఇవ్వలేదని…ఈ చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, కాలవ శ్రీనివాసులు, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర, బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్ జవహర్, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరాలు, అనగాని సత్యప్రసాద్, బీద రవిచంద్ర యాదవ్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, టీడీ జనార్థన్, గురజాల మాల్యాద్రి, పి.అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్ పాత్రుడు, జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.