అమరావతి (చైతన్యరథం): సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ముడుపులు అందుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వెంటనే ఏసీబీ, లేదా సీబీఐ విచారణ జరపించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అదానీ కంపెనీతో కుదుర్చుకున్న సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పదం మరో పెద్ద క్విడ్ ప్రో కో డీల్ అని విమర్శించారు. రూ.1750 కోట్ల లంచం డబ్బు జగన్‌కు చేరిందని అమెరికా దర్యాప్తు సంస్థ తేల్చేసిందన్నారు. ఈ కేసును ఆ దేశంలోని కోర్టులు తెలుస్తాయన్నారు. కానీ లంచాలు తీసుకున్నది జగన్ అయితే నష్టపోయేది రాష్ట్ర ప్రజలని తెలిపారు. అదంతా ప్రజల సొమ్ము అని.. విచారణ జరిపించాలని కోరారు. లంచం డబ్బు తీసుకుని ప్రజలపై భారం మోపేందుకు జగన్ సిద్ధమయ్యారని మండిపడ్డారు.
పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయడమా? లేక ఏసీబీ విచారణకు అదేశించడమా అనేది వెంటనే చేయాలని ఒక ప్రకటనలో యనమల కోరారు. జగన్ అవినీతి వల్ల ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడుతుంది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే తప్ప.. అదానీతో ఒప్పందాలే చేసుకోలేదని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. సెకీ అనేది కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమే. సెకీకి అదానీ కేసుతో ఎంత మాత్రమూ సంబంధం లేదు. అదానీ-జగన్ డీల్ జరిగిందని స్పష్టంగా కన్పిస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా జగన్-అదానీ మధ్య ఒప్పందం జరిగిందని యనమల స్పష్టం చేశారు.