- ప్రజలపై ఛార్జీల భారం రూ.32,166 కోట్లు
- విద్యుత్ సంస్థలపై అప్పు రూ.49,596 కోట్లు
- అసమర్థ పాలనతో జరిగిన నష్టం రూ.47,741 కోట్లు
- ఐదేళ్లలో విద్యుత్ రంగం సర్వనాశనం
- గాడి తప్పిన వ్యవస్థను తిరిగి పట్టాలెక్కిస్తాం
- ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే శ్వేతపత్రాలు
- రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలి
అమరావతి(చైతన్యరథం): భావితరాల భవిష్యత్‌ను గత జగన్ ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఐదేళ్లలో గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సమూలంగా నాశనం చేసిందన్నారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజలపై రకరకాల చార్జీల పేరుతో రూ.32,166 కోట్ల భారాన్ని మోపిందని, విద్యుత్ రంగంలో రూ.49,596 కోట్ల అప్పు చేసిందన్నారు. జగన్ చేతకానితనంతో విద్యుత్ రంగం రూ.47,741కోట్లు నష్టపోయిందని చంద్రబాబు వివరించారు. మెత్తమ్మీద విద్యుత్ రంగంలో ప్రభుత్వ విధానాల వలన ప్రజలకు, ప్రభుత్వానికి రూ.1,29,503 కోట్ల నష్టం జరిగిందన్నారు. గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తామని చెప్పారు. అసమర్థుల పాలనలో జనానికి ఎంత నష్టం జరుగుతుందో చెప్పేందుకు జగన్ పాలన ఉదాహరణ అని వివరించారు.
మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చాం.. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. అందుకే శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లకు చెప్పామన్న చంద్రబాబు రూ.500, 200 నోట్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నాం అని అన్నారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నాం. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతుంది. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలి.
సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో ఉండాలి. శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని ప్రజలు అనుకోవద్దు. వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం మా బాధ్యత. అందరి ఆలోచనల మేరకు ముందుకు వెళ్తాం. విద్యుత్‌తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంటుంది. అసమర్థులు అధికారంలో ఉంటే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రిమోట్ మొరాయించడంపై చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. పనిచేయకపోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిందని, సరి చూసుకోవాలని అధికారులకు చురకలు వేశారు.
విద్యుత్ రంగాన్ని నిలబెట్టిన సంస్కరణలు
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల వల్ల మేము 2004 ఎన్నికల్లో ఓడి అధికారం కోల్పోయినా దేశం బాగుపడిరది. నేను తెచ్చిన సంస్కరణల ఫలాలు తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కనిపించాయి. ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలదొక్కుకుంది. మా హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నాం. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగింది. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశాం. మా హయాంలో ట్రాన్స్‌కో, జెన్కోకు ఎన్నో అవార్డులు వచ్చాయి. గత ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపారు. విద్యుత్ రంగంలో రూ.49,586 కోట్లు అప్పులు చేశారు. అసమర్థ పాలనతో విద్యుత్ రంగం రూ.47,741 కోట్లు నష్టపోయింది. జగన్ పాలనలో మొత్తమ్మీద విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని చంద్రబాబు అన్నారు.
ఓ భూతాన్ని రాజకీయంగా భూ స్థాపితం చేశాం
రాజకీయం ముసుగులో లూటీ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇష్టానుసారం గా మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ ముసుగులో బెదిరింపులు చేస్తే భయపడేది లేదని హెచ్చరించారు. నేరస్థులు, అవినీతి పరులు తప్పించుకోలేరని తెలిపారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. దీన్ని కూడా కొందరు రాజకీయం చేసి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో ఓ భూతాన్ని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామన్నారు. విచారణలు, ఎంక్వయరీ లు అంటే పెట్టుబడిదారులు భయపడి ఎవరూ రారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇప్పటికే ఆయా సంస్థలేవీ పెట్టుబడులకు ముందుకు రాలేదన్నారు. రాష్ట్రంలో నిధుల లోటు ఉందని, అయినా ఇసుక ఉచితం గానే ఇస్తున్నామన్నారు. అక్రమాలు చేస్తే కఠినం గా వ్యవహరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అప్పుల వాళ్ళు రోజూ తిరుగుతున్నారన్నారు. పెండిరగ్ లో ఉన్న కొన్ని బిల్లులు క్లియర్ చేయాల్సి ఉందన్నారు.
స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం
ట్రూఆప్, ఇంధన సర్‌ఛార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాలుగా గత ప్రభుత్వం ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీలు వసూలు చేసింది. గృహ వినియోదారులపై 45శాతం ఛార్జీలు పెంచారు. ఛార్జీల పెంపుతో కోటీ 53 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 50 యూనిట్లు వాడిన పేదలపై వందశాతం ఛార్జీలు పెంచారు. టారిఫ్ ద్వారా రూ.16,689 కోట్లు, ట్రూ ఆప్ ద్వారా రూ.5,886 కోట్లు, ఇంధన ఛార్జీలు రూ.3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో రూ.5,607 కోట్ల మేర వసూలు చేశారు. కేవలం గృహ వినియోగదారులపైనే రూ.8,180 కోట్ల భారం పడిరది. పెత్తందారులు, పేదవారికి పోటీ అని చెప్పేవాడు. ఈ పెత్తందారీ పాలనలో పేదవాడు ఎలా నలిగిపోయాడో అందరికీ తెలిసింది. రూ.వేల కోట్ల రుణం తీసుకుని విద్యుత్ రంగంపై పెనుభారం వేశారు. ఐదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పు 78శాతం మేర పెరిగింది. కొన్ని సార్లు ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలపై భారం మోపాయి. విద్యుత్ వాడుకోకపోయినా కోర్టు ఆదేశంతో నిర్వహణ ఛార్జీలు రూ.8వేల కోట్లు చెల్లించారు. పవన విద్యుత్ రంగంలో చేసుకున్న 21 ఒప్పందాలు రద్దు చేశారు. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలు మరింత పెరుగుతాయి. ఈవీ వాహనాల డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాలి. టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం సాయం తీసుకుంటాం. వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
రూఫ్ టాప్ సౌరశక్తి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు
థర్మల్ విద్యుత్‌ను గ్రీన్ హైడ్రోజన్‌గా మార్చేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ వస్తే మనకు అదనంగా రాయితీలు వస్తాయి. రూఫ్ టాప్ సౌరశక్తి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కమిటీ నిర్ణయిస్తుంది. విద్యుత్ సరఫరాలో నష్టాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యుత్ రంగం బలోపేతానికి సాంకేతిక సాయం తీసుకుంటాం. జగన్ ఆహంకారం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే 4,773 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడిరది. సెకి నుంచి కొనుగోలు చేయాల్సిన 7వేల మెగావాట్ల వల్ల ఒక్క ట్రాన్సిమిషన్ కోసమే రూ.3,850 కోట్ల నుంచి 4,350 కోట్ల వరకు అదనంగా చెల్లింపులు చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఊహించని కోణాల్లో విద్యుత్ సంస్థలకు నష్టాలు వస్తున్నాయి. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ బాండ్లలో.. ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలు పెట్టుబడులు పెట్టాయంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందని చంద్రబాబు వివరించారు.
పీఎఫ్ డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నించారు
ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల పీఎఫ్ ఫండ్ డబ్బులు కూడా కొట్టేసే ప్రయత్నం చేశారని, ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ కొట్టేశారని సీఎం చంద్రబాబు అన్నారు. పవర్ సెక్టార్‌లో గ్రోత్ లేకపోవడంతో పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోయిందని చంద్రబాబు వెల్లడిరచారు. పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే ఏం చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నాం. ఇది చాలా పెద్ద కసరత్తు. నా రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడూ ఎదుర్కొనలేదని చంద్రబాబు అన్నారు.
ఎక్కడా విద్యుత్ కోతలు ఉండొద్దు
విద్యుత్ కోతలు ఎక్కడా ఉండడానికి వీలులేదని సీఎం చంద్రబాబు అన్నారు. లో ఓల్టేజ్ ఉండకూడదని, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడ పవర్ కట్ ఉండేందుకు వీలులేదని, ఇప్పుడే అధికారులను ఆదేశిస్తున్నానని అన్నారు. ఎక్కడి నుంచి ఫిర్యాదు వచ్చినా ఊరుకోబోనని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.